
హిమాలయాల్లో 'కుంగ్ ఫూ' నన్స్ ర్యాలీ..
డ్రక్పా ఆర్డర్ కు చెందిన 500 మంది నన్స్.. హిమాలయాల్లో మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక సైకిల్ ట్రెక్ నిర్వహించారు.
హిమాలయాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ ను అరికట్లేందుకు బౌద్ధ సన్యాసినులు నడుం బిగించారు. ఖాట్మండు నుంచి లెహ్ వరకూ 4000 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీతో ప్రత్యేక అవగాహనా కార్యక్రమం చేపట్టారు.
ఆధ్యాత్మిక కేంద్రం.. డ్రక్పా ఆర్డర్ కు చెందిన 500 మంది నన్స్.. హిమాలయాల్లో మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక సైకిల్ ట్రెక్ నిర్వహించారు. నల్లటి స్వెట్ ప్యాంట్లు, ఎరుపు జాకెట్లు ధరించి తెల్లని శిరస్త్రాణాలతో ఇరుకైన పర్వత ప్రాంతాల్లో నన్స్.. ఈ ర్యాలీ నిర్వహించారు. ఎటువంటి ప్రత్యేక ప్రపంచ గుర్తింపు కానీ, ఆర్థిక అవసరాలతో సంబంధం గానీ లేకుండా కేవలం మారుమూల ప్రాంతాల్లోని వారికి మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు అత్యంత కష్టతరమైన ఈ ప్రయాణాన్ని వారు నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న భారత్, నేపాల్, భూటాన్, టిబెట్ కు చెందిన బౌద్ధ సన్యాసులు సైకిల్ తొక్కడంలో ఎటువంటి ప్రత్యేక నైపుణ్యం లేనివారే.
గత సంవత్సరం నేపాల్ భూకంపం అనంతరం తామంతా అక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టామని, ఆ సమయంలో అక్కడి నిరుపేద కుటుంబాల్లోని అమ్మాయిలను విక్రయించడంపై తెలుసుకున్నామని చెప్తున్న నన్స్.. అబ్బాయిలకంటే అమ్మాయిలు తక్కువన్న ఆలోచనా విధానంలో మార్పుతేవాలనుకున్నారు. అందుకోసం ఏదైనా చేయాలన్నఆశయంలో భాగమే.. సైకిల్ ట్రెక్ అని.. కార్యక్రమంలో పాల్తొన్న కుంగ్ ఫూ నన్స్ చెప్తున్నారు. మహిళలు కూడా పురుషుల్లాగానే శక్తి కలిగి ఉంటారన్న విషయాన్ని మారుమూల ప్రాంతాల్లోని వారికి అవగాహన కల్పించాలన్నదే ధ్యేయమని, మహిళా శక్తిని నిరూపించి చూపించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ ట్రెక్ నిర్వహిస్తున్నట్లు నన్స్ తెలిపారు.
మాతృత్వానికి ఆవాసమైనా, స్త్రీ లను దేవతలుగా పూజించే సంస్కృతి ఉన్నా.. దక్షిణాసియాలో మహిళా నేతలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నా.. అనేక మంది బాలికలు, మహిళలు నేటికీ హింసకు గురౌతూనే ఉన్నారని, కనీస ప్రాథమిక హక్కులు పొందలేకపోతున్నారని నన్స్ అంటున్నారు. పాకిస్తాన్ లో పరువు హత్యలు, ఇండియాలో బ్రూణ హత్యలు, నేపాల్ లో బాల్య వివాహాలతోపాటు మహిళలు ఎన్నో బెదిరింపులు హింస ఎదుర్కొంటున్నారని, వారిలో అవగాహన పెంచడం, చట్టాల్లో మార్పు తేవడం, ఆర్థిక సాధికారతను సాధించడంతో ఆలోచనా విధానంలోనూ క్రమంగా మార్పు వచ్చే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. తమ సైకిల్ ట్రెక్ అటువంటి మార్పుకు కొద్దిమాత్రమైనా సహకరిస్తుందని విశ్వసిస్తున్నారు.