చైనా కట్టడికి చతుర్భజ వ్యూహం!

how quadrilaterals quade can control china - Sakshi

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో  ఎదురులేని ఆర్థిక, సైనిక శక్తిగా అవతరించిన చైనా ఆధిపత్య ధోరణిని కట్టడిచేయడానికి పదేళ్లనాటి ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి రంగం సిద్ధమైంది. దక్షిణ చైనా సముద్రంపై పూర్తి పెత్తనం కోరుతున్న చైనా ఆటలు సాగకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాతో కూడిన నాలుగుదేశాల కూటమి(ఇంగ్లిష్‌లో క్వాడ్రిలేటరల్‌ క్వాడ్) అవసరమని జపాన్‌ ప్రధాని షింజో అబే 2007లో సూచించారు. తర్వాత నెల రోజులకే  ఆయన పదవి నుంచి వైదొలిగాక ఈ చైనా ‘వ్యతిరేక’ చతుర్భజం ఐడియా మరుగునపడిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు అబే జపాన్‌ ప్రధానిగా తన స్థానం బలోపేతం చేసుకున్నాక ఈ ప్రతిపాదనకు గట్టి ఆమోదముద్ర లభించింది. ఇటీవల 31వ ఆగ్నేయాసియా, 12వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనడానికి ఈ నాలుగు దేశాల నేతలు మనీలా వచ్చిన సందర్భంగా నాలుగు రాజ్యాల కూటమి ప్రతిపాదనపై ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. షింజో మొదటిసారి ఈ ఆలోచనను 2007 ఆగస్ట్లో భారత పార్లమెంటులో ప్రసంగిస్తూ వెల్లడించారు. ‘‘ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో ఇండియా, జపాన్‌ కలిసి పనిచేస్తే ఈ విశాల ఆసియా ప్రాంతం పసిఫిక్మహాసముద్ర ప్రాంతాలన్నిటినీ కలుపుకుని ఇక్కడి దేశాల మధ్య సంబంధాలను బలోపేతంచేసే శక్తిగా అవరిస్తుంది . ఈ క్రమంలో వీటికి అమెరికా, ఆస్ట్రేలియా జతకూడితే ఇక్కడ ప్రజలు, సరకులు, పెట్టుబడులు, పరిజ్ఞానం స్వేచ్ఛగా ఒక చోట నుంచి మరో చోటకు పయనించడానికి వీలవుతుంది.’’అని షింజో వివరించారు.

షింజో లక్ష్యమేంటి?
అంతర్జాతీయ ఆర్థిక ప్రపంచంలో ప్రధానపాత్ర పోషించే ఆసియా, పసిఫిక్‌ దేశాల రవాణాకు దక్షిణ చైనా సముద్రం ఎంతో కీలకమైంది. అయితే, ప్రపంచీకరణ ఫలాలతో బలమైన ఆర్థికశక్తిగా ఎదిగిన చైనా ఈ సముద్రప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించేవిధంగా చర్యలు తీసుకుంటోంది. పొరుగుదేశాలను బెదరించే ధోరణిలో ప్రకటనలు చేస్తోంది. అదీగాక, చైనాతో ప్రాదేశిక వివాదాలతో సతమతమైన జపాన్ఈ కమ్యూనిస్టు రాజ్యం అనుసరించే పెత్తందారీ ధోరణులకు వ్యతిరేకంగా సంకీర్ణం నిర్మించాలనే పట్టుదలతో ఉంది. ఇటీవల డొనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలోని అమెరికా  అగ్రరాజ్య ఆధిపత్య హోదా నెమ్మదిగా బలహీనం కావడంతో నాలుగుదేశాల ప్రాంతీయ కూటమి అత్యవసరమనే అభిప్రాయానికి జపాన్వచ్చినట్టు కనిపిస్తోంది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా తాజా పరిణామాల ఫలితంగా చైనాకు ఇండియా మరింత దూరం కావడంతో భారత్ను ఈ కూటమిలో చేర్చుకోవడానికి ఇదే మంచి తరుణమని కూడా షింజే భావిస్తున్నారు. అధ్యక్షపదవి చేపట్టినప్పటి నుంచీ చైనాను కట్టడి చేయడానికి ట్రంప్చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అమెరికా ఈ కూటమి ప్రతిపాదనపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. అమెరికాను అనుసరించే ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు ‘చతుర్భుజం’లో భాగంకావడానికి సిద్ధమైంది. పదేళ్ల క్రితం ఈ ప్రతిపాదన వెల్లడికాగానే చైనా చేసిన బెదిరింపులు, అప్పటి ఆర్థిక సమస్యల కారణంగా జపాన్మినహా మిగిలిన మూడు దేశాలూ వెనక్కి తగ్గాయి. 

కొత్త కూటమి చేయాలిందేంటి?
హిందూమహాసముద్ర ప్రాంతం, ఆగ్నేయాసియా ప్రాంతం మీదుగా ముడి చమురు చైనాకు రవాణా అవుతోంది. అందుకే ఈ ప్రాంతాలపై తన ప్రభావం, ఆధిపత్యం ఉండేలా చైనా చాలా కాలంగా పావులు కదుపుతూ చాలా వరకు అనుకున్నది సాధించింది. దౌత్య, ప్రాంతీయ సంబంధాల్లో ఇండియా కొంత వెనుకబడడం చైనాకు ఇప్పటి వరకూ కలిసొచ్చింది. బర్మా, బంగ్లాదేశ్, శ్రీలంకతో చైనాకు సంబంధాలు బాగా బలపడ్డాయి. రెండు నెలలకు పైగా డోక్లామ్వివాదంతో విసిగిపోయిన భారత్‌కు ఈ ‘క్వాడ్’ కూటమిలో చేరడం మంచి అవకాశంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ చైనా ప్రవర్తన గమనిస్తే అంతర్జాతీయ చట్టాలపై దానికి గౌరవం లేదనే అభిప్రాయం కలుగుతుంది.అందుకే ఆదివారం మనీలాలో జరిగిన అధికారుల స్థాయి క్వామ్సమావేశంలో, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో అందరూ నియమనిబంధనలతో కూడిన పద్ధతి అనుసరించడం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించే క్రమంలో అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా నౌకా రవాణాకు, గగనతలంలో విమానాలకు అడ్డంకులు లేకుండా చూడడం, ఇక్కడ నౌకలకు భద్రత కల్పిస్తూ, ఉగ్రవాదుల నుంచి సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం వంటి అంశాలపై నాలుగు దేశాల ప్రతినిధులు చర్చించారు.

చైనా వన్‌ బెల్ట్‌ - వన్‌ రోడ్(ఓబీఓఆర్‌ - బెల్ట్‌ రోడ్‌ ప్రాజెక్టు)కు ట్రంప్‌ ప్రత్యామ్నానికి మార్గం సులువవుతుందా?
చైనా ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆర్భాటంగా అమలుచేస్తున్న బెల్ట్‌ రోడ్‌ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ ఈ ప్రాంతంలో సూచించే ఆర్థిక మౌలికసదుపాయాల ప్రాజెక్టు ఈ కూటమి బలపడితే ఆచరణలోకి వస్తుందని భావిస్తున్నారు. చైనా ఆధిపత్య ధోరణికి సవాలు విసురుతూ కూటిమి కడతున్న ఈ నాలుగు దేశాలూ ప్రజాస్వామ్యపంథాలో నడుస్తున్నాయి. ‘ప్రజాతంత్ర వజ్రం’ గా జపాన్అభిర్ణిస్తున్న ఈ క్వాడ్‌ కూటమి చైనా దుందుడుకు పోకడలను ఎంత వరకు అడ్డుకుంటుందో! స్వేచ్ఛగా, అందరికి అందుబాటులోకి తీసుకొద్దామనుకుంటున్న దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఈ నాలుగు దేశాలు లేకున్నా సమీపంలోని దేశాల్లో అమెరికాకు సైనిక స్థావరాలున్నాయి. జపాన్, ఆస్ట్రేలియాలూ దానికి దగ్గర్లోనే ఉన్నాయి. ఈ కూటమి రూపుదిద్దుకునే క్రమంలో చైనా ఎలా స్పందిస్తుందనే అంశంపై సభ్యదేశాల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఆర్థికంగా బలపడిన నాలుగు పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ పేరుతో చేతులు కలపడం చైనాకు పెద్ద సవాలే.

(సాక్షి నాలెడ్జ్సెంటర్)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top