
రమ్ము తాగిన కోతి బెల్ట్ షాప్ ముందు కత్తిదూసింది
'డిక్కీ బరువెక్కిన కోడి చికెన్ షాపు ముందు తొడగొట్టింద'నే తెలుగు సినిమా డైలాగ్ ను ప్రాక్టికల్ గా ఫాలో అయి కటకటాలపాలైంది ఓ కోతి.
'డిక్కీ బరువెక్కిన కోడి చికెన్ షాపు ముందు తొడగొట్టింద'నే తెలుగు సినిమా డైలాగ్ ను ప్రాక్టికల్ గా ఫాలో అయి కటకటాలపాలైంది ఓ కోతి. వివరాల్లోకి వెళితే దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ కు కూడా మనలాగే మద్యంపై వచ్చే సుంకమే ప్రధాన ఆదాయవనరు. అందుకే ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనమిస్తాయి.
అలా ఈశాన్య బ్రెజిల్ లోని పటోస్ అనే ఊళ్లో గల బెల్ట్ షాప్ లోకి రెండు రోజుల కిందట ఓ కోతి చొచ్చుకొచ్చింది. ఎవడో గ్లాసులో నిండుగా పోసుకున్న రమ్మును ఒక్క గుక్కలో మింగింది. ఆ మత్తులోనే కిచెన్ లోకి దూరి కత్తిపట్టుకొచ్చి మందుబాబుల్ని బెదిరించింది. 'అసలే మర్కటం ఆపైన మద్యసేవనం ఇంకేమైనా ఉందా!' అనుకుంటూ బెల్ట్ షాప్ బయటికి పరుగులు తీశారు అక్కడున్నవాళ్లు. ఆ తర్వాత షాప్ పైకెక్కి కూర్చుని 'ఎవడొస్తాడో రండ్రా.. మందుతాగడానికి' అన్నట్లు కత్తిదూసింది. ఈ తతంగమంతటినీ మూలన దాక్కున ఓ వ్యక్తి వీడియోతీసి నెట్ లో అప్ లోడ్ చేశాడు. అన్నట్లు.. బెల్ట్ షాప్ నిర్వాహకురాలైన మహిళను మాత్రం ఏమీ అనలేదట!
బాధితుల ఫిర్యాదుమేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది కోతిని బంధించి, మత్తు దిగిందనుకున్న తర్వాత సమీపంలోని అడవిలో వదిలేశారట. అయితే అదే రోజు సాయంత్రం మళ్లీ జనావాసాల్లోకి వచ్చి జనాన్ని భయభ్రాంతుల్ని చేసిందా మర్కటం. దీంతో మళ్లీ దాన్ని అదుపులోకి తీసుకున్న సిబ్బంది.. ఈసారి వదిలేయాలా? ఏదైనా జూ కు తరలించాలా? అని ఆలోచిస్తున్నారట!