
ఎడ్వర్డ్ కాదు.. జేమ్స్!
మీరు మూగ మనసులు సినిమా చూశారా? అందులో నాగేశ్వరరావు, సావిత్రిలకు గత జన్మలు గుర్తొస్తే అబ్బురపడిపోయాం.
మీరు మూగ మనసులు సినిమా చూశారా? అందులో నాగేశ్వరరావు, సావిత్రిలకు గత జన్మలు గుర్తొస్తే అబ్బురపడిపోయాం. ఈ నేపథ్యంలోనే వచ్చిన జానకి రాముడు, మగధీర, మనం వంటి చిత్రాలు ఘనవిజయం సాధించడంతో పునర్జన్మల నేపథ్యం తెలుగు సినిమాకు సూపర్‌హిట్ ఫార్ములాగా మారింది. మరి పునర్జన్మలు నిజంగా ఉన్నాయా..? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ వాదాన్ని బలపరుస్తూ నాలుగేళ్ల పిల్లాడు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నానని చెబుతున్నాడు. అతని కథేంటో చూద్దామా..?
అది యూరప్‌లోని ఒక ప్రాంతం. అక్కడో ప్రశాంతమైన ఇల్లు. అందులో ఎడ్వర్డ్ ఆస్ట్రియన్ అనే నాలుగేళ్ల పిల్లాడు ఉన్నాడు. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి మాట్లాడటానికే బాగా ఇబ్బంది పడుతున్నాడు. అతనికి చిన్నపట్నుంచీ గొంతులో ఏదో సమస్య ఉంది. ఆరోజు అది మరీ ఎక్కువ అవ్వడంతో కంగారు పడిన ఎడ్వర్డ్ తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అతని గొంతులో ఒక గడ్డ ఉందని, దాని చుట్టూ టాన్సిల్స్ ఉన్నాయని తేల్చారు. ఆపరేషన్ చేస్తే నయమవుతుందనీ చెప్పారు. ఎడ్వర్డ్ ఆస్పత్రిలోనే ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇంటికొచ్చాక తల్లి ప్యాట్రీషియా అతని పక్కన కూర్చుంది. అప్పుడు అతని గొంతులో నుంచి అతి కష్టం మీద వచ్చిన మాట.. ‘నాకు బుల్లెట్ తగిలింది’!
అనూహ్య మలుపు...
ప్యాట్రీషియా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. డాక్టర్లు కూడా శస్త్రచికిత్స చేయడానికి తేదీ నిర్ణయించారు. ఈ ఆపరేషన్ రెండు దశల్లో చేయాలన్నారు. మొదటి దశలో గడ్డ చుట్టూ ఉన్న టాన్సిల్స్ తీసేసి.. ఆ తర్వాత కొన్ని రోజులకు దాన్ని తొలగించాలనుకున్నారు. అనుకున్నట్టుగానే మొదటి దశ ఆపరేషన్ చేసి టాన్సిల్స్‌ను తొలగించారు. ఎడ్వర్డ్‌ను ఇంటికి తీసుకొచ్చింది ప్యాట్రీషియా. గొంతులోని ఇబ్బంది కొంచెం తొలగడంతో ఎడ్వర్డ్ మళ్లీ ‘నాకు బుల్లెట్ తగిలింది’ అనడం మొదలు పెట్టాడు. అదే మాట పదేపదే చెబుతుండటంతో ప్యాట్రీషియాలో భయం మొదలైంది. రెండో దశ ఆపరేషన్ రోజు దగ్గర పడుతోంది. ఎడ్వర్డ్‌లో ఎలాంటి మార్పూ రాలేదు. సడెన్‌గా ఒక రోజు ‘అమ్మా నీతో మాట్లాడాలి’ అన్నాడు. ఈ మాటతో ప్యాట్రీషియాలో ఆనందం మొదలైంది. కానీ ఎడ్వర్డ్ మాటలు విన్నాక భయం, ఆశ్చర్యం ఆమెను వెంటాడాయి.
2015 - 1915...
‘మీరు అనుకుంటున్నట్టుగా నా పేరు ఎడ్వర్డ్ కాదు.. జేమ్స్! ఫ్రాన్స్‌లోని మారుమూల పల్లెటూరు మాది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలవ్వడంతో కుర్రాళ్లందరిలాగే సైన్యంలో చేరాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. నేను మరణించిన రోజు, ప్రదేశం నాకింకా గురున్నాయి. ఆరోజు జరిగిన సంఘటన నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ ప్రదేశమంతా దట్టమైన చెట్లతో నిండి ఉంది. అక్కడి వాతావరణం కూడా వాన పడుతూ చల్లగా బాగా అసౌకర్యంగా ఉంది. వర్షం వల్ల అక్కడి నేల చిత్తడిగా మారింది. అప్పటి దాకా మామూలుగా ఉన్న నాకు సడెన్‌గా భుజంపై ఉన్న రైఫిల్ కూడా బరువుగా అనిపించసాగింది. నా చుట్టూ చాలా మంది సైనికులున్నారు.
ఇంతలో ఒక్కసారిగా ఆ ప్రదేశం బుల్లెట్ల మోతతో మార్మోగిపోయింది. శత్రుసైన్యం మాపై ఒక్కసారిగా విరుచుకుపడింది. నాతో ఉన్న వారు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఒక బుల్లెట్ వేరే సైనికుడికి తగిలి అతని శరీరంలోంచి బయటకు వచ్చి నా గొంతులో దిగింది. నా గొంతులో ఒక్కసారిగా రక్తం ఎగజిమ్మింది’ అన్నాడు ఎడ్వర్డ్. ఈ కథ విన్న ప్యాట్రీషియా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. రోజులు గడుస్తున్నాయి. ఎడ్వర్డ్ కథనంలో ఏమాత్రం మార్పులేదు. ఇంతలో ఆపరేషన్ తేదీ వచ్చేసింది.
వైద్యులూ షాక్..
ప్యాట్రీషియా ఎడ్వర్డ్‌ను తీసుకుని హాస్పిటల్‌కు వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్‌కు అంతా సిద్ధం చేశారు. కానీ అంతకుముందుగా మరోసారి పరీక్షలు చేశారు. అంతే.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇన్నాళ్లుగా సలుపుతూ వచ్చిన ఆ గడ్డ జేమ్స్ గొంతులో నుంచి మాయమైంది. డాక్టర్లు ప్యాట్రీషియాను పిలిచి విషయం చెప్పారు. ప్యాట్రీషియా కూడా ఆశ్చర్యపోయి జరిగిన కథంతా చెప్పింది. ఇది విన్న డాక్టర్లు ఎడ్వర్డ్‌కు వచ్చిన గడ్డ సహజసిద్ధంగా మాయమవ్వదన్నారు. ఈ కేసును వైద్యశాస్త్రంలోనే ‘అరుదైన కేసు’ల జాబితాలో చేర్చారు.
ఒక్కసారిగా వార్తల్లోకి...
ఈ ఉదంతం వెలుగు చూడటంతో ఎడ్వర్డ్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ప్రఖ్యాత న్యూస్ చానెల్ బీబీసీ ఇతనిపై డాక్యుమెంటరీ తీసింది. గతంలోనూ ఇలాంటి కేసులు కొన్ని వెలుగు చూశాయి. పునర్జన్మల మీద మన అభిప్రాయం ఏదైనప్పటికీ ఇలాంటివారి కథలు విన్నపుడు మాత్రం ‘నిజమా’ అనిపించడం సహజం!