సిటీ బస్సు.. బోర్డు తుస్సు | Sakshi
Sakshi News home page

ఎటుబోద్దో..

Published Fri, Feb 9 2018 8:02 AM

sakshi special story on city bus destination boards  - Sakshi

నగరంలో ప్రతిరోజు సుమారు 32 లక్షల మంది సిటీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. రవాణా సాధనాలు ఎన్ని మారినా ప్రజల నుంచి వీటికున్న ఆదరణ అద్భుతంగా ఉంది. కానీ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మాత్రం ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. సిటీ బస్సుల డెస్టినేషన్‌ బోర్డుల తీరుపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సికింద్రాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు తిరిగే బస్సుల్లో సుమారు 40 శాతం బస్సులు అస్పష్టమైన బోర్డులతోనే దర్శనమిచ్చాయి. డెస్టినేషన్‌ బోర్డులు రంగు వెలిసి ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. బోర్డులపై అక్షరాలు కనిపించక తాము ఎక్కాల్సిన బస్సు ఏదో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఏ బస్సు ఎటు వెళ్తుందో తెలియక బస్టాప్‌లో ఆగినా ప్రయాణికులు ఎక్కేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రతిరోజు ఆ రూట్లోనే రాకపోకలు సాగించే వాళ్లకు సైతం తప్పడం లేదు.  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఆర్టీసీ సేవలు మసకబారుతున్నాయి. మెట్రోరైలు వచ్చాక సిటీ బస్సుల వినియోగం తగ్గుతుందని లెక్కలు వేసినా అవన్నీ తప్పేనని తేలిపోయింది. ఇప్పటికీ ప్రతిరోజు సుమారు 32 లక్షల మంది సిటీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. వందలాది కాలనీలకు, ప్రధాన రహదారులకు, నగర శివారు ప్రాంతాలకు ఈ బస్సులే కనెక్టివిటీగా ఉన్నాయి. కానీ బస్సుల నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. అధికారులు బస్సులను డిపో నుంచి రోడ్డెక్కించడం వరకే పరిమితమవుతున్నారు గాని, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు. 

అన్ని రూట్లలోనూ ఇంతే..  
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్, రేతిఫైల్, చిలకలగూడ క్రాస్‌రోడ్స్, బ్లూసీ హోటల్, గురుద్వారా తదితర ప్రాంతాల నుంచి రోజూ సుమారు 1500 బస్సులు వివిధ ప్రాంతాలకు తిరుగుతుంటాయి. పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, బాలానగర్, అల్వాల్, రిసాలాబజార్, బోయిన్‌పల్లి, బొల్లారం, జూపార్కు, ఆఫ్జల్‌గంజ్, నాంపల్లి, ఈసీఐఎల్, కోఠి, మహాత్మ గాంధీ బస్‌స్టేషన్, బార్కాస్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్‌సిటీ తదితర  ప్రాంతాలకు వేలాది టిప్పులు రాకపోకలు సాగిస్తాయి. ఒక్క సికింద్రాబాద్‌ నుంచే వివిధ ప్రాంతాలకు కనీసం 10 వేల ట్రిప్పులకు పైగా బస్సులు తిరుగుతాయి. ఈ ప్రాంతం నుంచే సుమారు 15 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. కానీ ప్రయాణికుల డిమాండ్, ఆదరణకు తగినవిధంగా సదుపాయాలు మాత్రం లేవు. సికింద్రాబాద్‌ నుంచి పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్‌ వైపు, మల్కాజిగిరి, ఈసీఐఎల్, నేరేడ్‌మెట్, కోఠి తదితర మార్గాలకు వెళ్లే బస్సుల్లో చాలావాటికి అస్పష్టమైన డెస్టినేషన్‌ బోర్డులే దర్శనమిచ్చాయి. బస్సు దగ్గరకు వచ్చే దాకా బోర్డు కనిపించదు. తీరా తెలిసి అది ఏ రూట్‌లో  వెళ్తుందో కనుక్కోవడం కూడా కష్టమే. బస్సు రూట్‌తో పాటు ఈ ప్రాంతం (వయా) మీదుగా వెళ్తుందో స్పష్టంగా తెలియాలి. ఆ వివరాలు కూడా బోర్డులపై లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. 

సికింద్రాబాద్‌ నుంచి ఈసీఐఎల్‌ (16ఏ రూట్‌) వరకు  ప్రతి రోజు వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్, మెట్టుగూడ, మల్కాజిగిరి, వాణీనగర్, నేరేడ్‌మెట్‌ మీదుగా ఈ బస్సులు ఈసీఐఎల్‌కు వెళ్తాయి. కానీ ఈ బస్సులు అస్పష్టమైన బోర్డులతోనే తిరుగుతున్నాయి.  
సికింద్రాబాద్‌ నుంచి ఈసీఐఎల్‌కు వెళ్లే బస్సులు కొన్ని సాయినగర్‌ మీదుగా వెళ్తాయి. కానీ ‘సాయినగర్‌’ అనే పేరు కనిపించక చాలా మంది ఎక్కేస్తున్నారు. తీరా అది సాయినగర్‌ మీదుగా వెళ్తుందని తెలిసి ఇబ్బందులకు గురవుతున్నారు.  
తెలుపు రంగు బోర్డులపైన కనీసం వంద అడుగుల దూరంలో ఉన్న ప్రయాణికులకు కూడా స్పష్టంగా కనిపించేలా తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో రూట్‌ వివరాలతో డెస్టినేషన్‌ బోర్డులు ఉండాలి. కానీ చాలా బస్సులకు రంగులు వెలిశాయి.  
ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉన్న మెట్రో బస్సుల్లోనూ స్పష్టత కొరవడింది.

కొరవడిన సమీక్ష..
ప్రతి 6 నెలలకు ఓసారి బస్సుల డెస్టినేషన్‌ బోర్డులను మార్చాలి. ఎప్పటికప్పుడు కొత్తవి ఏర్పాటు చేయాలి. ఇందుకు డిపో మేనేజర్‌ స్థాయి అధికారులకు ఆర్టీసీ పూర్తి బాధ్యతలను అప్పగించింది. కానీ చాలామంది డీఎంలు బోర్డుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదులను కూడా పట్టించుకోరు.

అవసరమైన చోట ఏర్పాటు చేస్తాం...
డెస్టినేషన్‌ బోర్డుల బాధ్యతను డిపో మేనేజర్లకే అప్పగించాం. బస్సులను పరిశీలించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకొనే అవకాశం వారికి ఉంది. అయినా ప్రయాణికుల ఫిర్యాదుల మేరకు అన్ని డిపోల్లో మరోసారి పరిశీలించి  డెస్టినేషన్‌ బోర్డులను ఏర్పాటు చేస్తాం. – పురుషోత్తమ్‌ నాయక్, ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌

నాలుగేళ్లుగా పోరాడుతున్నా  
డెస్టినేషన్‌ బోర్డులు సరిగ్గా లేవని గత 4 సంవత్సరాలుగా డిపో మేనేజర్‌ నుంచి ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమణారావు వరకు, చైర్మన్‌ వరకు అందరినీ కలిశాను. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. దాదాపు అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి. ఇక బస్సుల టైమింగ్స్‌ కూడా ఎక్కడా కనిపించవు. ఎక్కడో ఓ చోట బస్టాపులో టైమింగ్స్‌ బోర్డు ఉంటుంది. కానీ ఆ టైమ్‌లో బస్సు ఉండదు. – జేఎన్‌ఎన్‌ శాస్త్రి, రిటైర్డ్‌ ఇంజినీర్‌

Advertisement
Advertisement