మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్టడీ స్కీం ఉపకారవేతనం పెరుగనుంది.
సాక్షి, హైదరాబాద్: మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్టడీ స్కీం ఉపకారవేతనం పెరుగనుంది. ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సీఎం కేసీఆర్ వద్ద దస్త్రం పరిశీలనలో ఉంది. ఇటీవల ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీం’ కింద ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాన్ని రూ. 20 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఎస్సీ విద్యార్థుల తరహాలో మైనారిటీలకు కూడా వర్తింపజేయాలని వచ్చిన పలు విజ్ఞాపనల మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సీఎం కేసీఆర్ ఆమోదంతో త్వరలో జీవో జారీ అయ్యే అవకాశాలున్నాయని మైనారిటీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఓవర్సీస్ స్కీం ఉపకార వేతనం కోసం కుటుంబ వార్షికాదాయ పరిమితి పెంచాలని మోహసిన్-ఏ-ఇన్సానియత్ ఫౌండేషన్ కార్యదర్శి బాల్కొండ రియాజ్ ఖాద్రి ప్రభుత్వాన్ని కోరారు.