ఆదాయపన్ను రిటర్న్స్‌లో చీటింగ్‌ | Cheating in Income Tax Returns | Sakshi
Sakshi News home page

ఆదాయపన్ను రిటర్న్స్‌లో చీటింగ్‌

Jul 4 2017 2:40 AM | Updated on Sep 5 2017 3:06 PM

ఆదాయపన్ను రిటర్న్స్‌లో చీటింగ్‌

ఆదాయపన్ను రిటర్న్స్‌లో చీటింగ్‌

తప్పుడు, మోసపూరిత పద్ధతుల్లో సాఫ్ట్‌వేర్, ఇతర కంపెనీల ఉద్యోగులు ఆదాయ పన్ను మినహాయింపులు పొందడంపై ఆదాయ పన్ను శాఖ తీవ్రంగా పరిగణించింది.

- మోసపూరిత పద్ధతుల్లో పన్ను మినహాయింపులు పొందుతున్న కొందరు ఉద్యోగులు
తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించిన ఆదాయ పన్నుశాఖ
 
సాక్షి, హైదరాబాద్‌: తప్పుడు, మోసపూరిత పద్ధతుల్లో సాఫ్ట్‌వేర్, ఇతర కంపెనీల ఉద్యోగులు ఆదాయ పన్ను మినహాయింపులు పొందడంపై ఆదాయ పన్ను శాఖ తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగుల కోసం చాలా మంది ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ప్రాక్టీష నర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు తప్పుడు ఆదాయ పన్ను రిటర్న్స్‌ దాఖలు చేస్తూ రీఫండ్స్‌ను క్లెయిమ్‌ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలంగాణ, ఏపీల ఆదాయ పన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయ ప్రజా సంబంధాల అధికారి బీవీ వినోద్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లోని ఆదాయ పన్ను శాఖ పరిశోధన విభాగం తనిఖీలు, సర్వేలు జరపగా, ఇంటి అద్దె వ్యయం, వైద్య ఖర్చులు, వివిధ పథకాల్లో పొదుపులు, తదితర పేర్లతో ఆదాయ పన్ను నుంచి మినహాయింపు కోరుతూ తప్పుడు క్లెయిమ్స్‌ సమర్పించారని వెల్లడైందన్నారు. ఐటీ కంపెనీల హెచ్‌ఆర్‌ విభాగంలోని డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ అధికారులు నిబంధనల మేరకు టీడీఎస్‌ రూపంలో సరైన పన్ను మినహాయింపులతో ఉద్యోగుల జీతాల నుంచి ఆదాయ పన్నును ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తున్నారని తెలిపారు. అయితే, ప్రముఖ ఐటీ కంపెనీల్లోని కొందరు ఉద్యోగులు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ప్రాక్టీషనర్ల సాయంతో తప్పుడు క్లెయిమ్‌ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీ నుంచి ఫాం–16ను పొంది ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ప్రాక్టీషనర్ల సాయంతో తప్పుడు మినహాయింపులు పొందారని వెల్లడించారు. అనైతిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని అన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్లకు అడ్వైజరీ జారీ చేశామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement