కందుల వేలంలో గోల్‌మాల్‌! | Auction of buns allegations have been made by Golmal in a state of Marc Fad | Sakshi
Sakshi News home page

కందుల వేలంలో గోల్‌మాల్‌!

Aug 17 2017 3:09 AM | Updated on Sep 12 2017 12:14 AM

రాష్ట్ర మార్క్‌ఫెడ్‌లో కందుల వేలంలో గోల్‌మాల్‌ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూ.5.3 కోట్ల నష్టంతో వేలంలో విక్రయించిన మార్క్‌ఫెడ్‌
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మార్క్‌ఫెడ్‌లో కందుల వేలంలో గోల్‌మాల్‌ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని అత్యంత తక్కువకు వ్యాపారులకు విక్రయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రూ.5.3 కోట్ల నష్టం వాటిల్లిందని మార్క్‌ఫెడ్‌ ప్రకటించడం గమనార్హం.

తడిసిన కందులు కొనుగోలు చేసి..
2015–16లో ఆదిలాబాద్‌ జిల్లాలో కొందరు రైతులు మార్కెట్‌కు కందులు తీసుకొచ్చారు. మార్కెట్‌కు తెచ్చాక వర్షం రావడంతో 10 వేల క్వింటాళ్లు తడిసిపోయాయి. ఆ సమయంలో మార్కెట్లో కందుల ధర క్వింటాలుకు రూ.9 నుంచి 10 వేలు పలుకుతోంది. తడిసిన కందులను ఎలాగైనా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం(ఎంఐఎస్‌) కింద రైతుల నుంచి క్వింటాలుకు రూ.8 వేల చొప్పున మార్క్‌ఫెడ్‌ తడిసిన కందులను కొనుగోలు చేసింది. రూ.8 కోట్లు రైతులకు చెల్లించింది. అయితే తడిసిన కందులను సెంటర్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ (సీడబ్ల్యూసీ) గోదాముల్లో ఎండబెట్టి నిల్వ ఉంచింది. అలా దాదాపు రెండేళ్లు విక్రయించకుండా రూ.50 లక్షలు అద్దె చెల్లించి దాచారు. ఇన్నాళ్లు ఎందుకు విక్రయించకుండా ఉంచారన్న దానిపైనా విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు రూ.2,700కు విక్రయం..
ఇటీవల కందులను విక్రయించడానికి టెండర్లు పిలిచారు. ప్రస్తుతం మార్కెట్లో కందుల ధర రూ.4,100 వరకు ఉంటే, టెండర్లలో రూ.2,700కు వ్యాపారులకు మార్క్‌ఫెడ్‌ విక్రయించింది. తడిసిన కందులను ఎండిబెట్టి ప్రమాణాల ప్రకారం సరిగానే సిద్ధం చేసినా ఇంత తక్కువకు విక్రయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.8 కోట్లకు కొనుగోలు చేసి, కేవలం రూ.2.7 కోట్లకు విక్రయించడంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా రూ.5.3 కోట్లు నష్టం రావడంపై విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement