భద్రత సమాచారమూ ఇవ్వరా?

will u give defence information ? - Sakshi

విశ్లేషణ

రైళ్ల భద్రత ప్రాజెక్టు ఎవరి వ్యక్తిగత సమాచారం? ఇది ప్రయాణికుల, రైల్వే ఆస్తుల భద్రత. శాస్త్రవేత్తలు పరిశోధించి భద్రతకు సహకరిస్తారని ఎవరైనా అనుకుంటారు కానీ, శాస్త్రజ్ఞులు దీన్ని వ్యక్తిగత విషయం అంటారా?

1. రైళ్ల రక్షణ హెచ్చరిక వ్యవస్థ (ట్రైన్‌ ప్రొటెక్షన్‌ వార్నింగ్‌ సిస్టం)ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (íసీఈఎల్‌) 2013లో ప్రతిపాదించిన పథకానికి మంజూరు చేసిన వ్యయం ఎంత?
2. మంజూరుపత్రం కాపీ ఇవ్వండి.
3. విడుదలైన డబ్బు వినియోగించినట్టు ధృవీకరణ పత్రం నకలు ఇవ్వండి.
4. సీఈఎల్‌కు విడుదల చేసిన నిధుల వివరాలు ఇవ్వండి.
5. సీఈఎల్‌ పథకాన్ని పూర్తిచేసినట్టు ధృవీకరణ పత్రం నకలు ఇవ్వండి.
6. ప్రాజెక్టు పూర్తికాకపోతే కారణాలు తెలపండి, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పండి.
7. మంజూరు చేసిన వ్యయానికి లోబడి ప్రాజెక్టు పూర్తి అయిందా? కాక అదనపు ఖర్చును మంజూరు చేస్తూ జారీ చేసిన పత్రం నకలు ఇవ్వండి.
8. ఈ ప్రాజెక్టు టెక్నికల్‌ ఎవాల్యుయేషన్‌ కమిటీ పరిశీలించి ఉంటుంది.

వారి నివేదికలో ఆర్థిక సాంకేతిక లోపాల గురించి ప్రస్తావిస్తే ఆ వివరాలు ఇవ్వండని ఎనిమిది అంశాలమీద సమాచారాన్ని అడిగారు అస్తిత్వ అనే వ్యక్తి. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా శాఖ (డీఎస్‌ఐఆర్‌) జవాబు ఇవ్వాలి. కానీ ఇదంతా వ్యక్తిగతమట. సెక్షన్‌  8(1)(జె) కింద ఇవ్వరట. అస్తిత్వ అడిగిన సమాచారం సంక్షిప్తంగానైనా ఇవ్వాలని మొదటి అప్పీలు అధికారి ఆదేశించారు. ప్రాజెక్టు వివరాలను వ్యక్తిగత సమాచారమంటూ తిరస్కరించడం తీవ్రమైన విషయం. రైళ్ల భద్రత ప్రాజెక్టు ఎవరి వ్యక్తిగత సమాచారం? ఇది ప్రయాణికుల, రైల్వే ఆస్తుల భద్రత. శాస్త్రవేత్తలు పరిశోధించి భద్రతకు సహకరిస్తారని ఎవరైనా అనుకుంటారు కానీ, శాస్త్రజ్ఞులు దీన్ని వ్యక్తిగత విషయం అంటారా? పోనీ íసీపీఐఓ భావించినట్టు ఇది వ్యక్తిగత సమాచారమని అనుకున్నా, దానికి జనహితం అనే మినహాయింపు ఉంది కదా! ఆ జనహితం కోసమైనా ఈ సమాచారం ఇవ్వవచ్చు కదా?
 
ఆర్టీఐ దరఖాస్తు 23.5.2017న దాఖలైంది. విమల్‌ కుమార్‌ వరుణ్‌ ఆ దరఖాస్తును జి– విభా గం శాస్త్రజ్ఞుడు బీఎన్‌ సర్కార్‌కు పంపారు. సెక్షన్‌ 5(4) కింద అస్తిత్వగారు కోరిన సమాచారం ఇవ్వాలని కోరుతూ 25.5.2017న లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని సమాచార కమిషన్‌కు వివరణతో పాటు సమర్పించారు. అయినా బీఎన్‌ సర్కార్‌ ఇది వ్యక్తిగత సమాచారమనీ, సెక్షన్‌ 8(1)(జె) కింద ఇవ్వడం చెల్లదనీ జవాబిచ్చారు. మొదటి అప్పీలు అధికారి ఆదేశం తరువాత కూడా పూర్తి సమాచారం రాలేదని అస్తిత్వ కమిషన్‌కు వివరించారు. 

సీఇఎల్‌కు పరిశోధన చేయడానికి గాను తమ విభాగం (డీఎస్‌ఐఆర్‌) ఆర్థిక సాయం చేస్తుందని, మార్కెట్‌ అవసరాలను అనుగుణంగా కొన్ని ఉత్పత్తులు చేయడానికి సహకరించి, ఆ వస్తువులను వాణిజ్యపరంగా వినియోగిస్తుందని వివరించారు. కొన్ని ధృవపత్రాలు కూడా అస్తిత్వకు ఇచ్చామనీ, అయితే పొరబాటున వాటిని ధృవీకరించడం మరి చిపోయామనీ చెప్పారు. అయితే సీఈఎల్‌ అనేది కంపెనీ కనుక, వాణిజ్య వ్యవహారాలను నడుపుతుంది కనుక అడిగిన సమాచారం మొత్తం ఇస్తే అందులో వాణిజ్య రహస్యాలు ఉంటాయి కనుక ఇవ్వకూడదని సెక్షన్‌ 8(1)(డి) కింద మినహా యింపు వర్తిస్తుందని భావించామని, కానీ పొరబాటున సెక్షన్‌ 8(1)(జె) అని రాశామని కూడా సీపీఐఓ తన వివరణలో తెలియజేశారు. 

రికార్డు పరిశీలిస్తే డిసెంబర్‌ 13 (2017)న ఇచ్చిన జవాబుల్లో కూడా డీమ్డ్‌ పీఐఓ బీఎన్‌ సర్కార్‌ 5,6,7,8 అంశాలకు సరైన జవాబు, పూర్తి సమాచారం ఇవ్వలేదని తెలుస్తున్నది. అయిదో అంశంపైన ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అందుకు కారణాలు చెప్పలేదు. ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందో చెప్పలేదు. ఆరో ప్రశ్నకు ఆలస్యంగా ‘పరిశీలనలో ఉంది’ అని జవాబు ఇచ్చారు. ఏ పరిశీలన? ఎవరి పరిశీలన? ఏడో పాయింట్‌కు నాట్‌ అప్లికబుల్‌ అని ఊరుకున్నారు. మొత్తం ప్రాజెక్టు మంజూరైన వ్యయానికి లోబడి ఉందా లేదా అంటే వర్తించదు అని జవాబిస్తారా? ఎనిమిదో పాయింట్‌కు అటువంటి కమిటీ లేదు.

కమిటీ ఏ లోపాన్నీ కనిపెట్టలేదని జవాబు. 5 నుంచి 8 వరకు పాయింట్లకు వాణిజ్య రహస్యానికి సంబంధమే లేదు. కనుక 8(1)(డి) కూడా వర్తించదు. బీఎన్‌ సర్కార్‌ గారు మళ్లీ మళ్లీ 8(1)(డి)నే వర్తిస్తుందని, పత్రాలను ధృవీకరించనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. శాస్త్రజ్ఞులు ఇవ్వాల్సిన జవాబులా ఇవి? విమల్‌ కుమార్‌ వరుణ్‌ సీపీఐఓ ఈ సమాచారం ఇవ్వాలని స్పష్టంగా లేఖ రాశారు. కానీ సమాచారం అధీనంలో ఉన్న శాస్త్రజ్ఞుడైన సర్కార్‌ నిరాకరించడం వల్ల ఇవ్వలేకపోయారు. అస్తిత్వ ఈ ప్రాజెక్టు నిర్వహణలో అనేకానేక లోపాలను వివరిస్తూ ఆడిట్‌ ఇచ్చిన ఒక నివేదిక భాగాలను కమిషన్‌కు సమర్పించారు. వీటికి జవాబి వ్వాలని కూడా కమిషన్‌ ఆదేశించింది. 

(అస్తిత్వ వర్సెస్‌ సైన్స్‌/టెక్నాలజీ మంత్రిత్వశాఖ CIC/DOSIR/A/2017/159662 కేసులో సీఐసీ 12 జనవరి 2018న ఇచ్చిన ఆదేశం ఆధారంగా).

మాఢభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top