తర్జుమా సమస్యలు

Translation mistakes - Sakshi

జీవన కాలమ్‌
నాయకులు తాము అడుగులకు మడుగులొత్తే పార్టీల కుషామత్తు కోసం బాహ్యస్మృతిని మరిచిపోయి, తర్జుమాల ఇరకాటంలో పడి నోటికి వచ్చింది వాగినప్పుడు– ఇలాంటి స్మృతుల చలివేంద్రాలు అవసరం అవుతూంటాయి.

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయ కులు మణిశంకర్‌ అయ్యర్‌ నరేంద్రమోదీని ‘నీచ వ్యక్తి’ అనీ, ‘నీచ జాతి’ వాడనీ అన్నారు. రాహుల్‌ గాంధీ 30 సంవత్సరాలుగా కాంగ్రెస్‌నే కాక గాంధీ కుటుంబానికి ‘విధేయుడి’గా ఉన్న అయ్య ర్‌ని పార్టీ ప్రాథమిక సభ్య త్వం నుంచే బర్తరఫ్‌ చేశారు.

ఇందులో చాలా అన్యాయం ఉన్నదని నాకు అని పిస్తోంది. అలా అనడానికి అయ్యర్‌ కారణాలను ఉటం కిస్తూ తనకు హిందీ సరిగ్గా రాకపోవడంవల్ల ఈ అనర్థం జరిగిందని వాపోయారు. ఆయన తన మన స్సులో ‘నీచ’ శబ్దాన్ని ‘కిందిస్థాయి’ వాడనే వాడాలని అనుకున్నారు. ‘నీచ జాతి’ వాడని అనడం ఎంత మాత్రం ఆయన ఉద్దేశం కాదు. ఆయన 30 సంవత్స రాలుగా ఢిల్లీలో ఉంటున్నా, మరో ముప్పై సంవత్స రాలు ఐఏఎస్‌గా అధికారాల్లో ఉంటున్నా వారికి హిందీలో ‘నీచ జాతి’ అనడం ద్వారా నరేంద్ర మోదీ ‘ఉత్కృష్ట జాతి’ వారని చెప్పాలనే ఉద్దేశం. అయితే తన మాతృభాష కాని భాషలో మాట్లాడుతున్నప్పుడు– ఎంత 50 సంవత్సరాల అనుభవం ఉన్నా ‘గొప్ప’ పదానికి ‘నీచ’ పదం దొర్లడాన్ని కేవలం తర్జుమా సమ స్యగానే మనం అర్థం చేసుకోవాలి.

తన ‘నీచ’ ప్రసంగం కార ణంగా రేపు గుజరాత్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌కి ఎట్టి హాని జరిగినా, ఎటువంటి శిక్షనయినా అనుభవిం చడానికి తాను సిద్ధంగా ఉన్నానని అయ్యర్‌ వక్కా ణించారు.
కాగా, నిన్న దినేష్‌ వార్షిణీ అనే కమ్యూనిస్టు నాయకులు ఇంగ్లిష్‌ చానల్‌ చర్చలో ఈ ‘నీచ’ శబ్దం ఇప్పటిది కాదని మనుస్మృతిలో మనువే ఉపయో గించారని వాకృచ్చారు. ఏతావాతా ఈ పదానికి బ్రాహ్మణ మూలాలున్నాయని వారు తేల్చారు. చాలా మంది గుర్తుంచుకోని విషయం మనువు క్షత్రియుడు. చక్రవర్తి. అయితే ఈ దేశంలో కమ్యూనిస్టు నాయకులు కారల్‌మార్క్స్‌ నుంచి మనువుదాకా అందరినీ ఆపో శన పట్టినందుకు మనం గర్వపడాలి.

లోగడ సోనియా గాంధీ కూడా మోదీ విష యంలో ఈ ‘నీచ’ శబ్దాన్ని వాడారట. మరి రాహుల్‌ గాంధీ మణిశంకర్‌ అయ్యర్‌ కంటే ముందు తమ తల్లి గారిమీద క్రమశిక్షణ చర్యని తీసుకోవాలి కదా? అని ఒక నాయకులు ప్రశ్నించారు.

మోదీని కాంగ్రెస్‌ నాయకులు ఇదివరకే ‘గూండా’, ‘నపుంసకుడు’ వంటి ముద్దు పేర్లతో పిలు చుకుని మురిసిపోయారు. అయితే ‘నపుంసకుడు’ అనడంలో వారికి అర్ధనారీశ్వరుడనే స్మృతి ఉన్నదనీ, ‘గూండా’ని 500 బీసీ నాటి ఐతరేయ బ్రాహ్మణంలో ఇదివరకే వాడారని మనకు తెలియకపోవచ్చు. ఈ విష యాన్ని మనం కమ్యూనిస్టు నాయకులనడిగి తెలుసు కోవాలి.
మణిశంకర్‌ అయ్యర్‌ తన క్షమాపణని కుంచిం చుకుపోయి, తలవంచుకుని, కన్నీటి పర్యంతం అయి చెప్పలేదు. గర్వంగా, ధైర్యంగా, స్పష్టంగా తనకు హిందీ తర్జుమా సమస్యలున్నాయని వెన్నెముక నిట్ట నిలువుగా నిలిపి చెప్పారు. ఇది తప్పనిసరిగా కాంగ్రెస్‌ వారసత్వం. కాంగ్రెస్‌ నాయకులు ఏ పని చేసినా కుంచించుకుపోరు. సిగ్గుపడరు. లోగడ 31 కుంభకో ణాల్లో ఏ కాంగ్రెస్‌ నాయకులూ సిగ్గుతో కుంగి పోవ డాన్ని మనం గమనించలేదు. ఇది వారి డీఎన్‌ఏలో ఉన్న శక్తిగా మనం అంగీకరించాలి.

అన్నిటికన్నా గొప్ప బూతుని కాంగ్రెస్‌ నాయ కులు దిగ్విజయ్‌ సింగ్‌ తమ ట్వీటర్‌లో ప్రకటించారు. మోదీ ‘‘.... వారిని భక్తుల్ని చేస్తారు. భక్తుల్ని... గా మారుస్తారు’’ అన్నది వారి తాత్పర్యం. ఈ ‘....’ మాట పత్రికలో ప్రకటించడానికి వీలు లేనంత బూతు. అయితే ‘ఇది నేనన్న మాట కాదు. ఎవరో అన్న మాటని నేను ఉదహరించాను’ అన్నారు సింగ్‌. ఎంగిలి చేసి
నంత మాత్రాన ‘బూతు’కి అర్థం మారదు.

ఈ వ్యవహారం వల్ల ఒక్క విషయం మనకి అర్థమవుతోంది. కాంగ్రెస్‌ వారికి తర్జుమా సమస్య లున్నాయి. వారు– భాష సరిగా రాకపోవడం వల్ల ‘నీచ’ పదాన్ని– కమ్యూనిస్టు నాయకుల మాటల్లో– ‘మనుస్మృతి’లో ఉన్న పవిత్రమైన ‘బ్రాహ్మణ’ పదాన్ని దుర్వినియోగం చేశారని.

ఈ సందర్భంగా నాకు ఈ రాజకీయ నాయ కులకు ఒక సలహా చెప్పాలని అనిపిస్తోంది. ఎప్పుడైనా తమరు ‘నీచ’ వంటి శబ్దాన్ని వాడాలనుకున్నప్పుడు లేదా దిగ్విజయ్‌ సింగ్‌ ప్రకటించినట్టు ‘...’ ప్రచురణకు లొంగని మాట ఏదైనా వాడినప్పుడు కమ్యూనిస్టు నాయకులను సంప్రదించి ఆయా మాటలు ‘పరాశర స్మృతి’, ‘యాజ్ఞ్యవల్క్య స్మృతి’, ‘గౌతమ స్మృతి’, ‘అప స్థంబ స్మృతి’ వంటి వాటిలో ఉన్నాయో లేదో తెలు సుకోవాలని నా మనవి.

నాయకులు ఉచ్చం, నీచం మరచిపోయి, తాము అడుగులకు మడుగులొత్తే పార్టీల కుషామత్తు కోసం బాహ్యస్మృతిని మరిచిపోయి, తర్జుమాల ఇరకాటంలో పడి నోటికి వచ్చింది వాగినప్పుడు–ఇలాంటి స్మృతుల చలివేంద్రాలు అవసరం అవుతూ ఉంటాయి. ఇది ఆయా నాయకుల నీచమైన కుమ్మక్కుకి నిదర్శనం. (ఇక్కడ ‘నీచ’ శబ్దానికి తర్జుమా సమస్య లేదు– తమరు గ్రహించాలి).

గొల్లపూడి మారుతీరావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top