ఆదివాసీల ఆత్మబంధువు జనార్ధన్‌

Ramakrishna Dhora Writes Article On Biyyala Janardhan Rao - Sakshi

అరవై ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైన వేల ఎందరో తెలంగాణ వీర యోధుల, అమర వీరుల ఆకాంక్షలకు దర్పణం బియ్యాల జనార్ధన్‌ రావు. ఆదివాసీల ఆత్మబంధువుగా మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్‌ జనార్ధనరావు వరంగల్‌ జిల్లా నెల్లికుదురు మండలం మునిగల వీడు గ్రామంలో కిషన్‌రావు, అంజమ్మలకు 1955 అక్టోబర్‌ 12న జన్మించారు. చిన్నతనం నుంచి ఏజెన్సీలోని ఆదివాసీలతో అనుబంధ కారణంగా వారి సంప్రదాయం, జీవన విధానంపై అవగాహన కలిగింది. ఆదివాసీల సమస్యలు, స్వయం పాలన, రాజ్యాంగ రక్షణ, హక్కుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారు. 1983లో కాకతీయ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో పార్ట్‌ టైం అధ్యాపకుడిగా చేరారు. ఆదివాసుల భూముల పరాయీకరణపై 1985లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆదివాసీలపై పరిశోధన చేసి పట్టా పొందిన తొలి గిరిజనేతరుడు జనార్ధన్‌రావు. 1993–2000 మధ్య కాలంలో ఆది వాసీ ఉద్యమాలు, 1/70 చట్టం, పీసా చట్టం, గ్రామీణ సమస్యలపై దృష్టి సారించారు. అమెరికా, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రేలియాలలో జరిగిన సెమినార్లలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ వారి పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోగా ఎంపికయ్యారు. తెలంగాణపై వివక్ష, అణచివేతపై అనేక రచనలు చేశారు. ప్రముఖ కవి కాళోజీ, ప్రొఫె సర్‌ జయశంకర్‌లతో కలిసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేశారు.  పోలవరం ప్రాజెక్ట్‌ పర్యవసానాలు, ఆదివాసీల జీవన విధ్వంసంపై ఎన్నో వేదికలపై చర్చించారు. ఉసిళ్ల పుట్టలై మన పని, పాటల్ని కమ్మేస్తున్న దొంగ టీవీ చానళ్లను తీసేసి, మన జనపదాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎన్నోరకాలుగా ఎండగట్టారు. ఆదివాసీలు రాజ్యాధికారంలో భాగమై, స్వయం పాలన సిద్ధించిన నాడే జనార్ధన్‌ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఆదివాసీ సంఘాలు, మేథావులు జనార్ధ న్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆదివాసీల సమస్యలపై పోరాటాలను ముందుకు తీసుకువెళ్లాలి.

వ్యాసకర్త: ఊకె రామకృష్ణ దొర, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ నేత

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top