న్యాయవ్యవస్థకు అగ్నిపరీక్ష

Political Leaders Power On Indian Law System - Sakshi

జాతిహితం

జడ్జీలు రాజకీయ శక్తిని కొంత కోల్పోవడమేగాక,  నైతిక బలాన్ని చేజేతులా వదులుకున్నా రని రాజకీయ నాయకులకు తెలుసు. చేతికందిన ఏ అవకాశాన్నీ వదులుకోని రాజకీయ నేతలు న్యాయమూర్తులు వదులుకున్న న్యాయక్షేత్రాన్ని ఆక్రమించుకోవడానికి సన్నద్ధ మౌతున్నారు. ఈ ధోరణి కేవలం పాలకపక్షానికే పరిమితం కాలేదు. న్యాయవ్యవస్థ ఇలా డీలా పడిన స్థితి కారణంగానే లోక్‌సభలో పది శాతం కూడా ఎంపీలు లేని ఓ రాజకీయ పక్షం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)అభిశంసనకు సాహసించింది.

వరుస ఘటనలు, చర్యల ఫలితంగా భారత న్యాయవ్యవస్థ నేడు చిక్కుకున్న ప్రమాదకర స్థితిని మనం ఏమని వర్ణించాలి? భారత అత్యున్నత న్యాయ మూర్తులు ఎదుర్కొంటున్న సంక్షోభం ఎంత తీవ్రంగా ఉంది? జడ్జీలు తమలో తాము వాదించుకుంటున్నారు. వ్యవస్థపై ప్రజా విశ్వాసం సన్న గిల్లింది. కార్యనిర్వాహక వ్యవస్థ గుట్టుచప్పుడు కాకుండా న్యాయవ్యవస్థతో రాజీకి సిద్ధమౌతోంది. ఇదంతా ఒకింత నాటకీయంగా కనిపించవచ్చు.

విషయం వివరిస్తాను. ఓ పేద మహిళ హక్కులు హరిస్తే, లేదా ప్రభుత్వం ఆమెపై దాడి చేస్తే ఆమె చివరికి ఎక్కడికి పోవాలి? దేశ సర్వోన్నత న్యాయ స్థానానికే అదే ప్రభుత్వ రక్షణ అవసరమైనప్పుడు ఆమెకు వ్యవస్థపై ఉన్న విశ్వాసం ఏమవుతుంది? భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ వారం కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు ఆవేశంతో సమర్ధించింది. ప్రధాన న్యాయ మూర్తి పాత్ర నాటకీయంగా మారిపోయిందని మీకు అర్థమౌతుంది. అంతే కాదు, ఇదే వారం సుప్రీంకోర్టు జడ్జీ పదవికి ఆయన నేతృత్వంలోని కొలీ జియం సూచించిన ఇద్దరిలో ఒకరి నియామకాన్ని ఆమోదిస్తూ, రెండో సిఫా ర్సును మరోసారి పరిశీలనకు తిప్పిపంపుతూ ఆయనకు కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ రాశారు.

రెండో జడ్జీ పేరు వెనక్కి పంపడానికి కేరళకు చెందిన చాలా మంది జడ్జీలు ఉన్నారని లేదా సీనియారిటీ తగినంత లేదని చెప్పిన కారణాలు నమ్మదగ్గవిగా లేవు. అంటే, రాజ్యాంగం అధికారాలను సమంగా పంపిణీ చేసినాగాని తనదే తుది అధికారమని ప్రభుత్వం న్యాయవ్యవస్థకు ఇలా గుర్తుచేసింది. జడ్జీలు రాజకీయ శక్తిని కొంత కోల్పోవడమేగాక,  నైతిక బలాన్ని చేజేతులా వదులుకున్నారని రాజకీయ నాయకులకు తెలుసు. చేతి కందిన ఏ అవకాశాన్నీ వదులుకోని రాజకీయ నేతలు న్యాయమూర్తులు వదు లుకున్న న్యాయక్షేత్రాన్ని ఆక్రమించుకోవడానికి సన్నద్ధమౌతున్నారు.

ఈ ధోరణి కేవలం పాలకపక్షానికే పరిమితం కాలేదు. న్యాయవ్యవస్థ ఇలా డీలా పడిన స్థితి కారణంగానే లోక్‌సభలో పది శాతం కూడా ఎంపీలు లేని ఓ రాజ కీయపక్షం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)అభిశంసనకు సాహసించింది. నిజంగా ఈ అభిశంసన తీర్మానం ఆనాలోచితమైనదేగాక అనుచితమైనది. ఈ తీర్మానం ఎలాంటి రాజకీయ ప్రయోజనం సాధించలేదు. ఇది కేవలం సుప్రీం కోర్టును, మరీ ముఖ్యంగా సీజేఐని మరింత బలహీనపరిచింది.

న్యాయవ్యవస్థపై పట్టుకోసం ‘రాజకీయం’
బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పరం ఎంత ద్వేషించుకుంటున్నాగాని న్యాయ వ్యవస్థపై పెత్తనానికి మాత్రం రెండూ ఏకమయ్యాయి. ప్రధాన పార్టీల మధ్య కీచులాట లున్న ఈ పార్లమెంటు శరవేగంతో జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్జేఏసీ) ఏర్పాటుకు  చట్టం చేసింది. అత్యున్నత న్యాయవ్యవస్థ ముఖ్యంగా జడ్జీల నియామకంలో కొలీజియం అధికారాలకు కత్తెర వేయడానికి ఈ చట్టం ఆమోదించారు. సుప్రీంకోర్టు కూడా అంతే హడావుడిగా ఈ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటిస్తూ కొట్టివేసింది. రాజకీయ వ్యవస్థ మొత్తం తన అధికారాలు తగ్గించడానికి ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టింది.

రెండు ప్రధాన పార్టీలూ పరస్పరం పోరు సాగిస్తున్నట్టు నటిస్తూ ఉమ్మడి ప్రత్యర్థి అయిన న్యాయవ్యవస్థను దెబ్బదీస్తున్నాయి. ఎన్జేఏసీ చట్టాన్ని ఐదుగురు జడ్జీల బెంచీ 4–1 మెజారిటీ తీర్పుతో చెల్లకుండా చేయడమేగాక కార్య నిర్వా హక వర్గానికి న్యాయవ్యవస్థ నిరంతరం ‘రుణపడి ఉండేలా’ చేయజాలమని వ్యాఖ్యానించింది. జడ్జీల నియామకానికి సంబంధించిన తమ సిఫార్సులకు విలువ లేక పోవడంతో కొలీజియంలోని మిగిలిన నలుగురు సీనియర్‌ జడ్జీల నుంచి ఎదు రౌతున్న ప్రశ్నలు, జడ్జీ బీహెచ్‌ లోయా మృతి కేసు, వైద్య కళాశాలల కేసుల్లో తీర్పులను నిరసిస్తూ సమరశీల లాయర్ల విమర్శలు, కాంగ్రెస్‌ ప్రతిపాదించిన అభిశంసన తీర్మానం, సుప్రీంకోర్టును సమర్థిస్తూ బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రక టనలతో ప్రధాన న్యాయమూర్తి ఆత్మరక్షణలో పడ్డారు.

ఇంత రభస జరిగాక న్యాయవ్యవస్థ కోసం ఆయన తిరిగి పోరాడగలరని ఆశించగలమా? అసంతృ ప్తితో ఉన్న సోదర న్యాయమూర్తులతో ఓ అంగీకారానికి రావడానికి ఆయన సిద్ధంగా లేరు. ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేయగలరని అంచనా వేయ గలం? రాజకీయనేతలు న్యాయవ్యవస్థను పీడిస్తున్న కొత్త బలహీనతలన్నిం టినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. కూపీలాగుతున్నారు. జడ్జీల పదవులకు కొలీ జియం సిఫార్సుల ఆధారంగా నియామకాలను జాప్యం చేయడం సర్వ సాధారణ విషయంగా మారింది. ఇప్పుడు ఓ హైకోర్టు జడ్జీ పదవీకాలానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్పును ప్రభుత్వం మార్చేసింది. కొలీ జియం దాన్ని సహించింది.

దీంతో దూకుడు పెంచిన కేంద్రసర్కారు సుప్రీం కోర్టుకు జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ నియామకం సిఫార్సును మరోసారి పరిశీలనకు వెనక్కి పంపింది. మరోసారి ఈ విషయంలో కొలీజియం మిన్నకుండిపో యినా లేదా తమలో తాము కీచులాడుకున్నా ప్రభుత్వం న్యాయవ్యవస్థను పలుచన చేసే మరింత దుందుడుకు చర్యకు సిద్ధమౌతుందని మీరు నిస్సందే హంగా భావించవచ్చు. సుప్రీంకోర్టు నీరస పోకడలు ఇలాగే కొనసాగితే ప్రభు త్వం జడ్జీల సీనియారిటీ సూత్రానికి తిలోదకాలిస్తుంది. మరుసటి సీజేఐగా అత్యంత సీనియర్‌ అయిన జస్టిస్‌ రంజన్‌ గోగోయ్‌ నియామకానికి అంగీ కారం తెలపకపోయే ప్రమాదం పొంచి ఉంది.

న్యాయమూర్తులపై చిన్నచూపుతో మరింత ప్రమాదం
ప్రస్తుతం న్యాయవ్యవస్థ ప్రజల సానుభూతిని చాలా వరకు కోల్పోయిం దని ప్రభుత్వం భావించడంలో ఆశ్చర్యం లేదు. ఓ పక్క విచారణకు నోచుకో కుండా వేలాది కేసులు పడి ఉండగా, మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కే తొందరలో న్యాయవ్యవస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్‌) స్వీకరి స్తోంది. ఎన్జేఏసీ చట్టం చెల్లదంటూ వేగంగా తీర్పు ఇవ్వడం వల్ల  జడ్జీలు తమ ప్రయోజనాలు కాపాడుకునే సందర్భాల్లోనే త్వరగా నిర్ణయాలు ప్రకటిస్తారనే భావన బలపడింది. లోయా కేసు తీర్పును విమర్శించేవారిపై చర్యకు డిమాండ్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌(పిల్‌)ను ప్రధాన న్యాయమూర్తి విచార ణకు తీసుకుంటే పై అభిప్రాయం జనంలో మరింత బలపడే ప్రమాదముంది.

న్యాయవ్యవస్థ అందరినీ కాపాడే సంస్థగా కాకుండా తన కోసమే తాను పోరాడే వ్యవస్థగా దిగజారినట్టు కనపిస్తుంది. ఈ విషయంతోపాటు జడ్జీల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఉమ్మడి ప్రయోజనాలు కాపాడే విషయంలో  భారత ప్రజలతో న్యాయవ్యవస్థకున్న సామాజిక అంగీకారాన్ని దెబ్బదీస్తాయి. అందుకే తన అధికారాల విషయంలో ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకోవడానికి న్యాయవ్యవస్థకు ఇదే సరైన సమయం. 

ఆత్మగౌరవం కోసం పాడాల్సిన పాట
న్యాయవ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి ఆలోచిస్తుంటే స్వాతంత్య్ర పోరాటం తొలి దశలోని ఓ అధ్యాయం నాకు గుర్తుకొస్తోంది. భూమి యజమానుల ఆస్తులపై తమకు తిరుగులేని అధికారాలిచ్చే కాల నైజేషన్‌ బిల్లును బ్రిటిష్‌ పాలకులు 1906–1907లో తీసుకొచ్చారు. భూము లున్న ఏ రైతు(పంజాబ్‌లో సొంత భూములున్న రైతును జాట్‌ అని పిలిచే వారు) పొలాలనైనా సొంతం చేసుకోవడానికి ఆంగ్ల సర్కారుకు అధికారం ఇచ్చే దుర్మార్గమైన నిబంధన ఈ బిల్లులో పొందుపరిచారు. లాలా లజపత్‌ రాయ్, భగత్‌సింగ్‌ చిన్నాన్న అజిత్‌సింగ్‌ ఈ నిబంధనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నడిపారు.

ఈ జనాందోళనకు స్ఫూర్తినిచ్చే పోరాట గీతాన్ని ల్యాల్‌ పూర్‌ (ఇది నేటి పాక్‌ నగరం ఫైసలాబాద్‌)కు చెందిన పత్రికా సంపాదకుడు బంకే దయాళ్‌ రాశారు. ‘‘పగ్డీ సంభాల్‌ జాట్టా, పగ్డీ సంభల్‌ ఓయే– తేరా లూట్‌ నా జాయే మాల్‌ జాట్టా’’ (తల పాగా బిగించే ఉంచు, రైతు సోదరా, లేకుంటే నీ సంపదను, ఆత్మగౌరవాన్ని వారు లూటీ చేస్తారు) అంటూ దయాళ్‌ రాసిన పాట ఉద్యమాన్ని ముందుకురికించింది. అందుకే ఈ ఉద్యమం పగ్డీ సంభల్‌ జాట్టా ఆందోళన అనే పేరుతో చరిత్రలో భాగమైంది.

బ్రిటిష్‌ పాలకులు లాలా లజపత్‌రాయ్, అజిత్‌సింగ్‌ను బర్మాలోని మాండలే జైలుకు పంపించారు. అయినా ఈ పోరు గీతం భగత్‌సింగ్‌ కాలం వరకూ జనం గుండెల్లో నిలిచే ఉంది. తర్వాత అనేక తరాల భారతీయులు ఈ పోరాట పాటను భగత్‌సింగ్‌తో ముడిపెడతారు. అత్యంత జాగ్రత్తతో, గొప్ప ఆలోచనాత్మకత, సావధానతలతో నేను దీన్ని రాస్తున్నాను. ఇది భారతీయ న్యాయవ్యవస్థకు సంబంధించి ‘‘çపగ్డీ సంభాల్‌ జాట్టా’’ను పాడవలసిన క్షణం. నిబద్ధ న్యాయవ్యవస్థ కోసం ఇంది రాగాంధీ వెదుకులాట, 1973 తర్వాత అదే నిబద్ధతను పెకిలిస్తూ పోయిన ఘటనల పర్యవసానాల తర్వాత మన న్యాయవ్యవస్థ ఇప్పుడు మళ్లీ అత్యంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.

కులబంధనాలతో కూడిన కొలీజి యంను సంస్థాగతం చేయడం ద్వారా తాను సురక్షితంగా ఉన్నానని న్యాయ వ్యవస్థ భావించి ఇప్పటికి రెండు దశాబ్దాలయింది. కానీ పేలవమైన నియా మకాలు చేయడం, సత్వర సంస్కరణలను నిర్లక్ష్యపర్చడం, న్యాయ ప్రక్రి యలో జాప్యం పట్ల సాధికారత కలిగిన బృందాల్లో పెరుగుతున్న అసహ నాన్ని గ్రహించడంలో విఫలం కావడం, న్యాయమూర్తుల బలహీనతలను గమనించడంలో సంశయానికి గురికావడం వంటి పరిణామాలతో న్యాయ వ్యవస్థ రాన్రానూ తన్ను తాను బలహీనపర్చుకుంది.

అయితే ఈ విషయాలను మళ్లీ చెప్పి న్యాయవ్యవస్థను బాదటానికి ఇది సందర్భం కాదు. ఈ పోరాటంలో న్యాయవ్యవస్థ నష్టపోయినట్లయితే, ఆ శాశ్వత నష్టం నుంచి కోలుకోవడం కష్టం. న్యాయవ్యవస్థే కాదు పౌరులుగా మనందరమూ నష్టపోతాం. ప్రధాన న్యాయమూర్తి ఇష్టపడినా ఇష్టపడకపో యినా.. సుప్రీంకోర్టు కోసం, తన కొలీజియం కోసం పోరాడి తీరవలసిన స్థితిలో తను ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ అంశంపై చర్చ జరప డానికి కూడా నేను సిద్ధపడను.

సీజేఐ సోదర జడ్జీలకు సంబంధించినంత వరకు 1973–77 నాటి చరిత్ర జ్ఞాపకం వారిని కాస్త సంతృప్తిపర్చవచ్చు. ఇందిరాగాంధీ తీసివేత చర్యల ఫలితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ ర్తిగా ఎదిగివచ్చిన ఆ న్యాయమూర్తి పేరును కూడా ఇప్పుడు ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు. కానీ ఆమె తప్పు నిర్ణయానికి నిరసనగా పదవికి రాజీ నామా చేసిన న్యాయమూర్తి మాత్రం భారత న్యాయవ్యవస్థ చరిత్రలో శిఖర స్థాయిలో నిలబడిపోయారు. అలాంటి పరీక్షకు మళ్లీ సిద్ధపడేందుకు మన న్యాయమూర్తులలో కొందరయినా ముందుకు రావడానికి ఇష్టపడవచ్చు.

శేఖర్‌ గుప్తా 
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top