అఫిడవిట్‌ రూపంలో వాగ్దానాలు

Madabhushi Sridhar Guest Columns On Recent Assembly Elections - Sakshi

విశ్లేషణ

ఎన్నికల హోరు ముగి సింది. పోటీలో వాగ్దానాల జడివాన గుర్తులు కూడా ఇక కనిపించవు. ఆ వాగ్దానాలు గెలిచిన పార్టీ చేసినవే అయినా, ఓడిన పార్టీ చేసినవయినా, లేక గెలిచిన అభ్యర్థి లేదా ఓడిన అభ్యర్థి చేసిన వాగ్దానాలయినా సరే వాటికి విలువ ఉండాలి కదా. రాజకీయ పార్టీలు కొన్ని వాగ్దానాలు చేస్తాయి. అభ్యర్థులు కూడా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. తమను ఎన్నుకున్న ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని గెలిచిన అభ్యర్థులు అధికార పార్టీలోకి జంప్‌ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఎంత అవినీతికరమైన పనో చెప్పలేం. కనీసం ఫిరాయింపు నిషేధ చట్టం ప్రయోగించడానికి కూడా రాజకీయ నాయకులు ముందుకు రావడం లేదు. పదవుల ఆశ చూపి ఫిరాయింపులు చేయడం ఎందుకు అవినీతికరమైన నేరం కాదో ఆ నాయకులు చెప్పాలి. పదవికోసం తనను నిలబెట్టిన పార్టీకి, ఎన్నుకున్న ప్రజలకు ఏ విధంగా ద్రోహం చేశారో వారే వివరణ ఇచ్చుకోవాలి. 

ఫిరాయించినా, ఫిరాయించకపోయినా ప్రజాప్రతినిధులకు తమను ఎన్నుకున్న ఓటర్ల పట్ల బాధ్యత ఉంటుందని మరవడానికినీ వీల్లేదు. నిజానికి వాగ్దానాలు చేసి ఓడిన అభ్యర్థి కూడా మళ్లీ రాజకీయాల్లో ఉండదలచుకుంటే, మరోసారి బరిలో నిలబడదలచుకుంటే అయిదేళ్లపాటు నియోజకవర్గంలో ఉండి సేవలు చేసి ప్రజాభిమానం చూరగొనాలి. అంతేకాదు. తను ఏ సేవలు చేస్తానని వాగ్దానం చేశాడో, ఆ సేవలు వారికి అందించడానికి ఒక నాగరికుడిగా, నాయకుడిగా కృషి చేయాలి. ఈ ఎన్నికల పోరాటంలో మూడింట రెండువంతుల స్థానాలు గెలిచిన తెలంగాణ రాష్ట్రసమితి కొత్త తెలంగాణ రాష్ట్రానికి రెండో ప్రభుత్వాన్ని ఇవ్వబోతున్నది.  చేసిన వాగ్దానాలన్నింటినీ అమలుచేసి తీరతానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రతిపక్ష స్థానాలకు పరిమితమైన కూటమి కూడా తమ వాగ్దానాలలో అధికార పార్టీ చేసిన వాగ్దానాలతో సమానమైనవి ఏవైనా ఉంటే వాటి అమలుకు కృషి చేయవలసి ఉంటుంది. 

పోటీ చేసే అభ్యర్థుల పూర్తి సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. శాసనసభకు పోటీచేస్తున్న మాజీ ముఖ్యమంత్రి సమాచారం దేశం మొత్తానికి తెలియజేయాలి. శాసనసభ ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు. మొత్తం రాష్ట్రానికి చెందినది. కనుక అందులో సభ్యులుగా ఉండదలచుకున్న వారి నేర చరిత్ర, ఆర్థిక స్థాయి, చదువు సంధ్యల గురించి ప్రతి ఓటరుకు, ప్రతి పౌరుడికీ తెలియవలసిందే అని  2002లో సుప్రీంకోర్టు నిర్దేశిం చింది. ప్రతి అభ్యర్థితో ఈ సమాచారం ఇప్పించేం దుకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయాలని సూచించింది. కానీ అందరూ కలిసి అప్పటి బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ సంకీర్ణం ద్వారా సవరణ చట్టం తెచ్చి, సుప్రీంకోర్టు ఏమి చెప్పినా సరే ఆ సమాచారం ఇవ్వనవసరం లేదన్నారు. మళ్లీ సుప్రీంకోర్టు ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని కొట్టి వేసింది. అప్పటినుంచి పౌరులందరికీ ఈ సమాచారం ఒక హక్కుగా లభిస్తున్నది. 

కానీ పౌరుల బాధ్యత ఏమిటి? పార్టీల బాధ్యత ఏమిటి? పార్టీలయితే నేరగాళ్లను ఎన్నికలలో నిలబెట్టకూడదు. ఒకవేళ నిలబెట్టినా జనం వారికి ఓట్లేయకూడదు. ఈ నేరగాళ్లు చేసిన వాగ్దానాలను ఓటర్లు నమ్మాలా? లేక ఈ నేరగాళ్లను నిలబెట్టిన పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మాలా? వారికే ఓటు వేయాలా? ఇదే జనం ముందున్న సంది గ్ధత. పోటీలో ఉన్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులూ నేరచరితులే అయితే, వారిమీద కేసులు ఇంకా నడుస్తూ ఉండి ఉంటే వారికే ఓటు వేయడం న్యాయమా? నోటా మీట నొక్కవలసిందేనా? అప్పుడు నోటానే గెలిస్తే ఏమవుతుంది?  మళ్లీ ఎన్నికలు జరుగుతాయా? జరిగితే మళ్లీ వీళ్లే పోటీ చేస్తే ఏం చేయాలి? 

చేసిన వాగ్దానాలను నెరవేర్చారా లేదా? అనే సమాచారం కూడా ఈ నేతలు ఇవ్వాలి. సొంతంగా తామే ఇవ్వాలి. అదీ అఫిడవిట్‌ రూపంలో ఇవ్వాలి. నేను లేదా నా పార్టీ గతసారి ఎన్నికల్లో ఈ వాగ్దానాలు చేశాం అని ఒక కాలంలో రాసి, దాని పక్క కాలంలో అమలు చేశాను లేదా చేయలేదు అని కూడా రాయాలి.  ఒకవేళ వాగ్దానాలు అమలు చేయకపోతే ఆ విషయం కూడా జనానికి తెలియజేయాలి. ఎన్నికల కమిషన్‌ అధికారులు దీన్ని పరిశీలించి అమలు చేసిన, చేయని హామీల వివరాలు జనానికి తెలియజేయాలి. ఈ మార్పు వల్ల వాగ్దానాల అమలు ప్రాతిపదిక మీద ఓటర్లకు ఓటు వేసే అవకాశం, అధికారం ఏర్పడుతుంది. అభ్యర్థులు కూడా వాగ్దానాలు అమలు  చేతగాక పోతే. మళ్లీ పోటీ చేయడానికి సిగ్గు పడే స్థితి వస్తుంది. పార్టీ వాగ్దానాలను లెక్క గట్టి అమలుకానివి ఎత్తి చూపి, ఇదీ వీరి స్థితి అని నిలదీసి ఓడించే అవకాశం వస్తుంది.


వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌, కేంద్ర మాజీ సమాచార కమిషనర్‌
ఈ-మెయిల్‌: professorsridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top