అసలు నేరస్తులు ఎవరు?

Madabhushi Sridhar Article About Disha incident - Sakshi

దిశను దారుణంగా హతమార్చిన దుర్మార్గులకు మరణ దండన విధించాలనేవారు కొందరయితే, వాళ్లను ఇంకా ఎందుకు బతకనిస్తున్నారు వెంటనే చంపేయండి, లేకపోతే మీకు తుపాకులెందుకు అని పోలీసులను రెచ్చ గొట్టేవారు ఇంకెందరో. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అడ్డూ అదుపులేకుండా నోటికి వచ్చింది రాస్తున్నారు. మరణదండన వద్దనే వారిని తిడుతున్నారు. లైంగిక నేరాల బాధితులను వివరించే చిత్రాలను చూపవద్దని, వారి పేర్లు వెల్లడి చేయవద్దనే నియమాలను పట్టించుకోకుండా హతురాలి పేరు రాసి, ఫొటోలు వేసి నేరాలు చేసినవారు కోకొల్లలు.

సభ్యత సంస్కారాలు కనీస జ్ఞానం కూడా లేకుండా చదువుకున్నవారు, రచయితలు, కవులు, ఫేస్‌బుక్‌ నీతివంతులు కూడా ఇష్టంవచ్చినట్టు అనవసరంగా ఈ నేరాలు చేస్తూ, రేప్‌ నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని కోరే అర్హత ఉందా? చాటుమాటుగా సాగిన అత్యాచారాన్ని మాటలతో మళ్లీ చేయడంతో సమానం–బాధితురాలి వివరాలు ఫొటోలు ప్రచురించడం. నాలుగైదు రోజులపాటు మీడియాలో, సోషల్‌ మీడియాలో బాధితురాలి వివరాలను బాధ్యతారహితంగా వాడిన తరువాత పోలీసు ఉన్నతాధికారి సజ్జనార్‌  ఆమె పేరు దిశ అని మార్చి పుణ్యం కట్టుకున్నారు.

రేప్‌ బాధితురాలు బతికి ఉంటే ఆమెను వైద్యంపేరుతో మెడికల్‌ రేప్‌నకు గురిచేస్తారు. పోలీసులు దర్యాప్తు రేప్‌నకు పాల్పడతారు. తరువాత కేసు విచారణ పేరుతో లాయర్లు లీగల్‌ రేప్‌తో బాధిస్తారు. ఇక సందర్భం వచ్చిన ప్రతిసారీ పత్రికల కలం వీరులు టీవీల కెమెరా వీరులు మీడియా రేప్‌ సాగిస్తూ ఉంటారు. సందర్భం ఉన్నా లేకపోయినా వారి వివరాలు రాస్తూ ఫేస్‌బుక్‌ వగైరాలలో మాటల అత్యాచారాలు నిర్వహించే నీతిమంతులకు లెక్కే లేదు.  

ఇటువంటి వాటికి అందరినీ జైళ్లలో పెట్టడం సాధ్యం కాదు. కానీ లైంగిక నేరాల బాధితులైన బాలికలు, మహిళల పేర్లు వెల్లడి చేస్తే రెండేళ్ల కఠిన లేదా సాధారణ కారాగార శిక్ష విధించాలని సెక్షన్‌ 228ఏ వివరిస్తున్నది. ఐపీసీ సెక్షన్లు 376, 376ఏ, 376బి, 376సి, 376డిలో లైంగిక నేరాల నిర్వచనాలు ఉన్నాయి, ఈ నేరాలలో బాధితురాలి పేరును ప్రచురించినా, లేదా మరేరకంగానైనా వెల్లడించినా (వచన కవితలతో సహా) రెండేళ్ల కఠిన లేదా సాధా రణ కారాగార శిక్షను, దాంతోపాటు జరిమానా కూడా విధించవచ్చు.

పరిశోధనకు దర్యాప్తునకు అవ సరమనుకున్నపుడు పోలీసు అధికారి లిఖితపూ ర్వక అనుమతితో బాధితురాలి పేరును ప్రస్తావించ వచ్చు. లేదా బాధితురాలు లిఖితపూర్వక అనుమతితో ప్రచురించవచ్చు. బాధితురాలు జీవించి లేకపోతే లేదా మానసిక స్థిమితం లేకపోతే ఆమె దగ్గరి బంధువు లిఖిత పూర్వకంగా సంబంధిత సంక్షేమ సంస్థ అధ్యక్షుల ద్వారా అనుమతి ఇచ్చి ఉంటే ప్రచురించవచ్చు. కోర్టు వ్యవహారాలలో పేరు రాయడం తప్పనిసరి అనుకుంటే కోర్టు అనుమతితో ప్రచురించవచ్చు. ఈ సెక్షన్‌ కింద ఇచ్చిన ఒక వివరణలో, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులో బాధితురాలిపేరు ప్రచురించడం నేరం కాదని పేర్కొన్నారు. అంటే సుప్రీం కోర్టు హైకోర్టు కాకుండా మరే కోర్టు తీర్పులోనైనా బాధితురాలి పేరు రాయడం నేరమే అవుతుందని చాలా స్పష్టం.

క్రిమినాలజీ అని ఒక బోధనాంశం ఉంది. అందులో నేరాలు చేయడానికి సామాజిక కారణాలు ఏమిటి అని పరిశోధిస్తారు. బోధిస్తారు.  చాలా కాలం కిందట అక్కినేని నాగేశ్వరరావు నిర్మించి నటించిన సుడిగుండాలు సినిమాలో కుటుంబంలో పరిస్థితులు, సమాజంలో బలహీనతలు, లోపాలు, పత్రికలు, డిటెక్టివ్‌ లేదా అశ్లీల నవలలు  (ఆనాటి మీడియా) లో వచ్చిన రాతలు, నిరుద్యోగం వల్ల పనిలేని తనం, విచ్చల విడిగాపారే మద్యం, టోకు మద్యం దుకాణాలుగా మారిపోయి, ఆ సొమ్ముమీద బతికే అవినీతి ప్రభుత్వాలు ఏ విధంగా ఒక కౌమార వయస్కుడైన జులాయిని హత్యచేసే స్థాయికి దిగజార్చాయో వివరిస్తూ,  అతని నేరానికి దోహదం చేసిన వారు నేరగాళ్లు కారా, అయితే ఎవరెవరిని, ఎందరిని, ఉరి తీయాలి? అని ప్రశ్నిస్తాడు కథానాయకుడు. దిశ విషయంలో కలం వీరులు బాధితురాలి ఫొటో చూపడానికి కారణాలేమిటి? ఈనేరానికి వేలాదిమందిని రెండేళ్ల పాటు జైళ్లలో పెట్టడానికి ముందుగా జైళ్లు కట్టాలి. కడదామా? తరువాత మేపడానికి తిండి ఏర్పాట్లు చేయాలి. చేద్దామా?

వ్యాసకర్త
మాడభూషి శ్రీధర్‌,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌,
madabhushi.sridhar@gmail.com.

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top