సేంద్రియ సాగే విషాలకు విరుగుడు

Devinder sharma writes on organic cultivation - Sakshi

విశ్లేషణ

సుస్థిర లేదా సేంద్రియ వ్యవసాయంపైకి దృష్టిని మరల్చాల్సిన  సమయం ఆసన్నమైంది. ఇలా ఉత్పత్తయ్యే ఆహారంలో 80% స్థానికంగానే వినియోగించుకుంటారు. కాబట్టి వ్యవ సాయం మనగలిగినదిగా, ఆర్థికంగా లాభదాయకమైనదిగా మారుతుంది. పైగా ఇది పంట భూములు, భూగర్భ జలాలు, నదులను విష రసాయన రహితమైనవిగా మార్చ డానికి, ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడుతుంది. సుస్థిర వ్యవసాయాన్ని లేదా వ్యవ సాయ–జీవావరణాన్ని ప్రధాన స్రవంతి ఆర్థిక వృద్ధికి కొలబద్దగా స్వీకరించేట్టు చేయాలి.

‘‘ప్రకృతికి కలుగజేసే హాని ఏదైనాగానీ చివరకు మనల్ని వెంటాడి వేధిం చక మానదు.. మనం ఎదుర్కొనక తప్పని వాస్తవమిది.’’ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అన్న ఈ మాటలకు ఆధారాలు ప్రతిచోటా కనిపిస్తాయి. భూసారం క్షీణించిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. క్రిమి సంహారి ణులు సహా రసాయనిక ఉత్పత్తులు విపరీతంగా వ్యాపించిపోతూ పర్యావర ణాన్ని, మొత్తం ఆహార వలయాన్ని విషపూరితం చేస్తున్నాయి. పంటచేలకు చీడపీడలు పెరిగిపోతున్నాయి. అడవులను నరికేసి పారిశ్రామిక పద్ధతుల్లో చేసే వ్యవసాయాన్ని విస్తరింపజేస్తుండటంతో భూమి పెద్ద ఎత్తున సారాన్ని కోల్పోతోంది. పంట ఉత్పాదకత పెరగకపోవడంతో మరిన్ని రసాయనాలను గుమ్మరిస్తున్నారు. దీంతో పంట పొలాలు మరింతగా విషపూరితం అయి పోతున్నాయి. తేనెటీగలు అంతరించిపోతుండటం జీవావరణానికి సంబం ధించి ప్రమాద ఘంటికలను మోగించింది. అడవులతోసహా మొత్తంగా ఎగిరే కీటకాలు 75% మేరకు నశించిపోయాయని తాజాగా వెల్లడైంది.

సమస్యే పరిష్కారమా?
హరిత విప్లవ సానుకూల ఫలితాలు అంతరించిపోగా దాని దుష్ఫలితాల పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. భారత రైతు ల్లాగే యూరోపియన్‌ రైతులు సైతం ఆత్మహత్యల అంచున నిలిచే పరిస్థితులు దాపురిస్తునాయి. ఇప్పటికే ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో రైతు ఆత్మహత్యలు వేగంగా పెరు గుతున్నాయి. ఇవన్నీ వ్యవసాయ పద్ధతులకు సంబం ధించి ఏదో ఘోరమైన తప్పిదం చేస్తున్నామని స్పష్టం చేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ఈ పరిస్థితు లకు దారితీసిన తప్పుడు వ్యవసాయ పద్ధతులను మరింత ఎక్కువగా ఉప యోగించడాన్నే పరిష్కారంగా చూపుతున్నారు. ప్రతి అంతర్జాతీయ సమావే శమూ పేదరికం, ఆకలి నిర్మూలన గురించి తీర్మానాలు చేస్తుంది, సుస్థిర వ్యవసాయాన్ని ప్రబోధిస్తుంది. 27 దేశాల్లో ఆహారం కోసం అల్లర్లు చెలరేగిన 2008 నాటి ప్రపంచ ఆహార సంక్షోభాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తలెత్త నిచ్చేది లేదని శపథాలు చేస్తారు. ప్రతి సంక్షోభమూ ఒక అవకాశమని, ముందుకు సాగాల్సిన సమయమని చెబుతారు. ఈ దుస్థితి నుంచి గట్టెక్కించ డానికంటూ బోలెడన్ని పరిష్కారాలను, పథకాలనూ పరుస్తారు. అనివా ర్యంగా అవన్నీ ఈ దుస్థితికి కారణమైన వ్యవసాయ పద్ధతులను భారీ ఎత్తున పారిశ్రామికంగా చేపట్టమని చెప్పేవి, ఈ సంక్షోభాన్ని మరింత విషమించే సేవి కావడం విశేషం. 2009 ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో 17 ప్రైవేటు కంపెనీలు ‘‘నూతన వ్యవసాయ దృక్పథాన్ని’’ ఆవిష్కరించాయి. ప్రతి దశా బ్దానికి ఆహార ఉత్పత్తిని 20% పెంచుతామని, హరితవాయువుల విడుదలను 20% మేరకు తగ్గిస్తామని, పేదరికాన్ని 20% తగ్గిస్తామని ప్రకటించాయి. వాస్త వంలో 2008 ఆహార సంక్షోభం ఆ కంపెనీల పాలిటి ప్రపంచస్థాయి లాభ సాటి వ్యాపార అవకాశంగా మారింది. కాబట్టి, ప్రపంచం దేన్ని మారుస్తా నందో దాన్నే తిరిగి చేస్తూ మరింత పెద్ద సంక్షోభం దిశగా పయనిస్తోంది.

అయితే ఆశావహ పరిణామమూ ఉంది. ఈ వ్యవసాయ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా నిలిచే వ్యవసాయ–జీవావరణానికి సంబంధించి గత కొన్నేళ్ల కాలంలో ఏకాభిప్రాయం ఏర్పడింది. ఉదాహరణకు, యాక్షన్‌ ఎయిడ్‌ సంస్థ నివేదిక.. 2050 నాటికి పారిశ్రామిక ఆహార ఉత్పత్తులను పెంచాలని పరుగులు తీయాల్సిన పని లేదు, అందుకు బదులుగా చిన్నతరహా రైతుల, ప్రత్యేకించి వర్ధమాన దేశాలలోని మహిళా రైతుల సుస్థిర వ్యవసాయ పద్ధ తులపైకి దృష్టి కేంద్రీకరణను మరల్చాలని స్పష్టం చేసింది. ఇలా ఉత్పత్తయ్యే ఆహారంలో 80% స్థానికంగానే వినియోగించుకుంటారు. కాబట్టి వ్యవ సాయం మనగలిగినదిగా, ఆర్థికంగా లాభదాయకమైనదిగా మారుతుంది. ఇదే క్రమంలో ఈ సాగుపద్ధతులు, పంట భూములను విష రసాయన రహి తమైనవిగా మార్చడానికి దోహదపడి, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను కల్పిస్తాయి. అందుకు తగినన్ని ఆధారాలున్నాయి. కాకపోతే, సుస్థిర వ్యవసా యంగా ఇప్పటికే ప్రాచుర్యంలోకి వచ్చిన రసాయనాలు వాడని లేదా సేంద్రియ వ్యవసాయాన్ని లేదా వ్యవసాయ–జీవావరణాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన స్రవంతి విధానకర్తలు ఆర్థిక వృద్ధికి కొలబద్దగా స్వీక రించేట్టు చేయాలి. ఈ ఆరు పాయింట్ల పథకాన్ని సూచిస్తున్నాను.

రసాయనిక పురుగు మందులకు స్వస్తి పలకాలి    
హరిత విప్లవంలోని తీవ్రమైన తప్పిదాలను గుర్తించడానికి అంతర్జా తీయ వరి పరిశోధనా సంస్థ(ఐఆర్‌ఆర్‌ఐ)కు మూడు దశాబ్దాలు పట్టింది. వరికి క్రిమిసంహారిణులను వాడటం అనవసరమని, కాలము, డబ్బు వృథా చేయడమేనని ఐఆర్‌ఆర్‌ఐ 2003లో గుర్తించి, ప్రపంచానికి చాటింది. కానీ భారత్‌సహా ఎక్కడా ఏ జాతీయ వ్యవసాయ సంస్థా దీన్ని పట్టించుకున్నది లేదు, రైతులకు తెలిపింది లేదు. ఫలితంగా, మన దేశంలో నేటికీ వరికి 42 రకాల రసాయనిక క్రిమిసంహారిణులను వాడుతున్నారు. తాజాగా ప్రపంచ మానవహక్కుల సంస్థ.. క్రిమిసంహారిణుల వాడకం పర్యావరణంపైన, ప్రజల ఆరోగ్యంపైన, మొత్తంగా సమాజంపైన అత్యంత విపత్కర ప్రభావా లను కలుగజేస్తుందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎంఎస్‌ఏ కార్య క్రమం కింద క్రిమిసంహారకాలు లేని పంటల నిర్వహణ పద్ధతిలో 36 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఇలాంటి స్థానిక అనుభవాలను అంతర్జాతీయ స్థాయి విధానాలలో ఇముడ్చుకుని వ్యవసాయ అవసరాల జాబితాలో క్రిమి సంహారిణులకు తావు లేకుండా చేయాలి.

సేంద్రియ వంగడాలను ఉత్పత్తి చేయాలి
హరిత విప్లవ కాలంలో తొలుత నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్‌(ఎన్‌పీకే) ఎరు వులను అధిక మోతాదుల్లో వాడుతుండటంవల్ల సూర్యకాంతి ప్రభావం చూపని వరి, గోధుమ పొట్టి వంగడాలను తయారు చేశారు. ఫలితంగా ఆ పంటలు అధికంగా క్రిమి కీటకాలను ఆకర్షించేవి. దీంతో రసాయనిక క్రిమి సంహారిణులను చల్లాల్సి వచ్చేది. ఇలా దిగుబడులు పెరగడంతోపాటూ, అదే మోతాదులో పంటలోని పోషకాల విలువలు పెద్ద ఎత్తున క్షీణించిపోతాయి. ఉత్పాదకత పెరగడం అంటే పోషక విలువలు పడిపోవడంగా మారింది. అయితే, రసాయనిక ఎరువుల వాడకం వల్ల పంట ఉత్పాదకతలో పెరుగు దల వేగంగా క్షీణించిపోతూ వస్తోంది. కాబట్టి సేంద్రియ ఎరువులకు స్పందించే మెరుగైన వంగడాలను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటి వంగడాల అభివృద్ధి కార్యక్రమంలో పోషక విలువల భద్రతపై దృష్టిని కేంద్రీకరించడం కూడా కీలకమైనదిగా ముందుకు వస్తుంది. ఈ వంగ డాల సాగు సమగ్ర వ్యవసాయ–జీవావరణ సాగుపద్ధతులను అమల్లోకి తెస్తుంది. చీడపీడల నియంత్రణకు, భూసార పరిరక్షణకు జీవసంబంధమైన పరిష్కారాలకు, నీటిని తక్కువగా వినియోగించే పంటలకు మారగలిగితే వ్యవసాయ–జీవావరణానికి పరివర్తన చెందించడం సాధ్యం అవుతుంది.

సాంప్రదాయక జ్ఞానాన్ని వెలికి తీయాలి
నేర్చుకోవడం, విద్య, జ్ఞానం సుస్థిర వ్యవసాయానికి పరివర్తనలో కీలకమై నవి. ఈ జ్ఞానంలో అత్యధికభాగం విద్యాలయాలకు వెలుపల ఉత్పన్నమ య్యేదే. వ్యవసాయ పరిశోధన లేబరేటరీలకు తరలడంతో స్థానిక రైతుల నైపుణ్యాలు, జ్ఞానం క్షీణించిపోయాయి. ఐసీఏఆర్‌ సాంప్రదాయక వ్యవసా యక జ్ఞానాన్ని పోగుచేసి నాలుగు సంకలనాలుగా రూపొందించిందిగానీ, అవి బూజు పట్టిపోతున్నాయి. కాబట్టి పరిశోధనాశాలల నుంచి పంట పొలా ల్లోకి ఈ క్రమం వెనక్కు మరలాలి. సాంప్రదాయక జ్ఞాన సంపదను తిరిగి కనుగొని, దాన్ని ప్రజలందరిదిగా చేసి, అందుబాటులో ఉంచడం తప్పనిసరి. తిరిగి కనుగొన్న సాంప్రదాయక జ్ఞానాన్ని క్రమపద్ధతిలో ఉంచడం ద్వారా విభిన్న జ్ఞాన వ్యవస్థల మధ్య అనుసంధానాలు ఏర్పడి, వ్యవసాయ– జీవా వరణ ఆవిష్కరణలు అంతటికీ వ్యాప్తి చెందుతాయి.

ప్రజా సేకరణ వ్యవస్థ పునర్నిర్మాణం
డబ్ల్యూటీఓ కోరుతున్నదానికి విరుద్ధంగా మన ఆహార ధాన్యాల ప్రభుత్వ సేకరణ వ్యవస్థను పరిరక్షించుకోవాలి. దేశ ఆహారభద్రతకు అది అత్యంత కీలకమైనది. ఆహార స్వయం సమృద్ధి సాధన కోసం ఎన్నో ఏళ్లుగా జాగ్రత్తగా నిర్మించుకుంటూ వచ్చిన వ్యవస్థ ఇది. సేంద్రియ ఉత్పత్తులకు కూడా దీన్ని అదే విధంగా వర్తింపచేయాలి. దేశంలోని వ్యవసాయ– జీవావరణ వ్యవస్థ లలో వేటికవి ఆ ప్రాంత ఆహార అవసరాలను తీర్చడం అనే ప్రాతిపాదికపై సేకరణ విధానాలను తిరిగి రూపొందించాలి. ఉదాహరణకు, గోధుమ ధాన్యాగారమైన పంజాబ్, సేంద్రియ గోధుమ పిండిని అతి ఎక్కువగా దిగు మతి చేసుకునే రాష్ట్రంగా ఉంది. పంజాబ్‌లోనే సేంద్రియ గోధుమకు ఎక్కువ ధరకు హామీని కల్పిస్తే దిగుమతులపై ఆధారపడనవసరం లేదు. సేంద్రియ రైతు లను ప్రోత్సహించడానికి యూరప్‌ దేశాలు తమ బడ్జెట్ల నుంచి వ్యవ సాయానికి ప్రత్యక్షంగా ఇచ్చే నిధులలో 30 శాతాన్ని ప్రత్యక్ష హరిత చెల్లింపు లకు కేటాయిస్తున్నాయి. అదే పద్ధతిని అనుసరించి మన దేశంలో కూడా సేంద్రియ రైతులకు ఎక్కువ ఆదాయానికి హామీని కల్పించాలి.  

జీవావరణ సేవలను లెక్కించాలి
సేంద్రియ వ్యవసాయం నేలలకే కాదు, జీవావరణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. కాబట్టి జీవావరణపరంగా అది అందిస్తున్న సేవలను పరి గణన లోకి తీసుకుని, వాటిని డబ్బు రూపంలో లెక్కగట్టి రైతులకు డబ్బు రూపంలో లేదా పరిహార పథకాలుగా అందించాలి. చైనా ‘పచ్చదనానికి ధాన్యం’, ‘నీటికి ధాన్యం’ పేరిట ఇలాంటి కార్యక్రమాలను  ప్రవేశపెట్టింది. అమెరికా లోని కొన్ని రాష్ట్రాలు ఇలాంటి చెల్లింపుల ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

సుస్థిర వ్యవసాయం మాత్రమే జీవనోపాధులను సృష్టించగలదు, నిల కడగా కొనసాగించగలదు. వ్యవసాయ–జీవావరణ సాగుకు తిరిగి మర లడం ద్వారా మాత్రమే పంట భూములకు, భూగర్భజలాలకు, నదులకు పట్టిన విషాన్ని వదల్చగలుగుతాం. ఇది మాత్రమే మనకు ఆరోగ్యకరమైన, పోషక విలువలుగల ఆహారాన్ని అందించి, ప్రపంచాన్ని వ్యాధులు, అంటు రోగాల బారి నుంచి కాపాడగలుగుతుంది. వ్యవసాయం మాత్రమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తిరిగి ఊపును ఇవ్వగలుగుతుంది. జీ–20 దేశాల నాయ కత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి, చిమ్మచీకట్లలోని ఈ ఆశా కిరణాన్ని చూసేనా?
(ఢిల్లీలో ఈ నెల 9–11 తేదీలలో జరిగిన ఆర్గానిక్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం)


- దేవిందర్‌శర్మ

వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు, hunger55@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top