అప్పుల సుస్తీ–అభివృద్ధి నాస్తి

C Manikyala Rao Article On TDP Government White Paper - Sakshi

శ్వేతపత్రం–10

రాష్ట్ర ఆర్థిక రంగంపై విశ్లేషణ

రాష్ట్ర ఖజానా నుంచి ఇష్టానుసారం దోచేస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేసిన ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అవాస్తవాలతో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ, దుబారాకు, ప్రచార ఆర్భాటాలకు, ఈవెంట్లకు పెద్దఎత్తున వ్యయం చేశారు. ప్రాజెక్టుల పాత అంచనాలను పెంచేసి ఎస్కలేషన్‌ పేరుతో కాంట్రాక్టర్లకు చెల్లిస్తూ ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున కమీషన్లు పొందుతున్నారు. నీరు–చెట్టు పనులన్నీ నామినేషన్‌పై అధికార పార్టీ నేతలకు పంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్‌ అండ్‌ మీన్స్, ఓవర్‌ డ్రాప్టులను చెల్లించనందున నాలుగేళ్లలో రూ.124.31 కోట్ల మేర వడ్డీని చెల్లించాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది. కాగా, రాష్ట్ర ఖజానాను సొంత ఖజానాగా సర్కారు మార్చేసిందని సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ప్రజాధనానికి ధర్మకర్తగా ఉంటూ ప్రతీ పైసాకు జవాబుదారీగా పాలన అందించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు పూర్తి భిన్నంగా  వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్లలో అప్పుల్లో భారీ వృద్ధిని చంద్రబాబు సాధించారు. ఆర్థిక వ్యవస్థను, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ మరో పక్క రాష్ట్ర ఖజానా నుంచి దోచేస్తూ సొంత జేబులు నింపుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అధికార యంత్రాంగమే కోడై కూస్తోంది. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ఖజానా నుంచి ఇష్టానుసారం దోచేస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేసిన ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అవాస్తవాలతో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

తాత్కాలిక నిర్మాణాలు, ఐటీ పేరుతో భారీగా అనుత్పాదక వ్యయాన్ని చేశారు. అంతేకాకుండా చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ, దుబారాకు, ప్రచార ఆర్భాటాలకు, ఈవెంట్లకు పెద్దఎత్తున వ్యయం చేశారు. దీంతో రాష్ట్ర అప్పులు ప్రమాదకర స్థాయికి చేరిపోయాయి. నాలుగేళ్లలో ఏకంగా 1,63,670 లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 25.9 శాతానికి మించరాదు. అయితే ముఖ్యమంత్రి అస్థవ్యస్థ ఆర్థిక నిర్వహణ కారణంగా, స్థోమతకు మించి అప్పులు చేయడంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు ఏకంగా 32.03 శాతానికి చేరాయి.

రాష్ట్ర విభజన నాటికి 13 జిల్లాలకు కలిపి ఏపీ అప్పు 96 వేల కోట్ల రూపాయలు ఉండగా ఇప్పుడు 2017–18 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అకౌంటెంట్‌ జనరల్‌ గణాంకాల మేరకే 2,59,670 లక్షల కోట్ల రూపాయలకు చేరింది.  వివిధ కార్పొరేషన్ల పేరుతో భారీఎత్తున అంటే ఏకంగా 71,815 కోట్ల రూపాయల మేర వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేస్తూ ఆ అప్పులకు గ్యారెంటీ కూడా ఇచ్చేసింది. ఇందులో ఇప్పటికే ఏకంగా 35,768 కోట్ల రూపాయలను అప్పులు చేశారు. ఈ విధంగా చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా ప్రాజెక్టుల్లో పాత అంచనాలను పెంచేసి ఎస్కలేషన్‌ పేరుతో కాంట్రాక్టర్లకు చెల్లిస్తూ ఆ చెల్లింపుల నుంచి ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున కమీషన్లు పొందుతున్నారు.

నీరు–చెట్టు పనులన్నీ కూడా నామినేషన్‌పై అధికార పార్టీ నేతలకు పంచేశారు. ఇప్పటివరకు ఏకంగా 16 వేల కోట్ల రూపాయల పనులు పంచేశారు. ఈ పనులకు సంబంధించిన బిల్లులను అప్పులు చేసి చెల్లింపచేస్తున్నారు. ఇన్ని కోట్లు వ్యయం చేసినప్పటికీ రాష్ట్రంలో సగం జిల్లాలు కరువుతో అల్లాడుతుండటంతో రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నిత్యం వేస్‌ అండ్‌ మీన్స్, ఓవర్‌ డ్రాప్టులతోనే కొనసాగేది. ఇప్పుడు గత రికార్డులను అధిగమించి మళ్లీ గత నాలుగేళ్ల నుంచి వేస్‌ అండ్‌ మీన్స్‌ ఓవర్‌ డ్రాఫ్టుల్లో రికార్డు సృష్టించింది. మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతీ ఆర్థిక సంవత్సరంలో 1500 కోట్ల రూపాయల మేర వేస్‌ అండ్‌ మీన్స్‌ సౌకర్యాన్ని ఆర్‌బీఐ కల్పించింది. ఈ సౌకర్యాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకుని 14 రోజుల్లోగా చెల్లిస్తే ఎటువంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్‌ అండ్‌ మీన్స్, ఓవర్‌ డ్రాప్టులను సకాలంలో చెల్లించనందున గత నాలుగేళ్లలో 124.31 కోట్ల రూపాయల మేర వడ్డీని చెల్లించాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది. చేబదుళ్లకు వడ్డీ చెల్లించిందంటే ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎంత అస్థవ్యస్థంగా ఉందో అద్దం పడుతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనలో కూడా ఏడాదిలో 365 రోజుల్లో అత్యధికంగా 230 రోజులు చేబదుళ్లలోనే నడిపిన చరిత్ర ఉంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ, ద్రవ్య లోటులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధి సాధించడం గమనార్హం.

2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాల్లో రెవెన్యూ లోటు –415.80 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత రెవెన్యూ లోటు –16,772.83 కోట్ల రూపాయలకు వెళ్లింది. అలాగే బడ్జెట్‌ అంచనాల్లో ద్రవ్య లోటు –23,054.44 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ద్రవ్య లోటు –33,591.92 కోట్ల రూపాయలుగా తేలింది. ద్రవ్య, రెవెన్యూ లోటులు ద్రవ్య జవాబు దారీ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలకు మించి ఉండటం గమనార్హం. ‘మళ్లీ ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుందాం’ అనే రీతిలో చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

వచ్చే ప్రభుత్వానికి ఆర్థి కంగా వెసులుబాటు లేకుండా చేసే విధంగా చంద్రబాబు సర్కారు అప్పులు చేస్తోందని, ఇందుకు ఉదాహరణ ఇప్పటికే బడ్జెట్‌ పరిమితికి మించి అప్పులు చేసిన సర్కారు ఇప్పుడు మరీ బరితెగించి వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్‌ బయట ఏకంగా 71,815 వేల కోట్ల రూపాయలు అప్పు చేయడమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ బయట కార్పొరేషన్ల పేరు మీద అప్పులు చేయడానికి సర్కారు గ్యారెంటీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ గత ఆర్థిక సంవత్సరంలో సొంత ఆదాయంలో 90 శాతం మేర అప్పులకు గ్యారెంటీ ఇవ్వవచ్చునని, అయితే ఇప్పుడు ఆ పరిమితి కూడా పూర్తి అయ్యేలాగ బడ్జెట్‌ బయట అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ  ఇచ్చేసింది.

ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో గ్యారెంటీ పరిమితి కూడా మించిపోవడంతో ఇటీవల మున్సిపల్‌ ఆస్తులు తాకట్టు పెట్టి బడ్జెట్‌ బయట వాణిజ్య బ్యాంకుల నుంచి 11,340 కోట్ల రూపాయల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్యారెంటీ పరిమితి మించిపోవడంతో కేవలం 3,000 కోట్ల రూపాయల అప్పునకే సర్కారు గ్యారెంటీ ఇస్తూ మిగతా మొత్తానికి తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో గ్యారెంటీ ఇస్తామని ప్రభుత్వం జారీచేసిన జీవోలోనే స్పష్టం చేసిందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంత వరకు చంద్రబాబు సర్కారు దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో సీఆర్‌డీఏకు వాణిజ్య బ్యాంకులు, బాండ్లు ద్వారా 14,275 కోట్ల  రూపాయలు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అలాగే సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి 30 వేల కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయించి ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు.

గత నాలుగేళ్లలో ఆస్తుల కల్పన వ్యయానికి కేవలం 49,367 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు ఇటీవల 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలోనే స్పష్టం చేసింది. అంటే గత నాలుగేళ్లలో 1,63,670 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేస్తే ఆస్తుల కల్పనకు 49,367 కోట్ల రూపాయలే వ్యయం చేసినట్లు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పేర్కొన్నందున మిగతా అప్పుల మొత్తం 1,14,303 లక్షల కోట్ల రూపాయలు అనుత్పాదక రంగాలకు వ్యయం చేసినట్లు స్పష్టం అయింది. ఆస్తుల కల్పనకు చేసిన వ్యయంలో నీరు–చెట్టు, ఎస్కలేషన్‌ తాత్కాలిక సచివాలయం, జల్సాలు, ఈవెంట్లు, దుబారాల కోసం మొత్తం 27,101 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఇందులో పెద్ద మొత్తంలో ప్రభుత్వ పెద్దలు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందారని స్పష్టం అవుతోంది.

ఖజానా నుంచే దోపిడీకి పాల్పడటంలో ఈ సర్కారు అందెవేసిన చేయిగా మారిపోయిందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. కాంట్రాక్టర్లకు జీవో 22 ప్రకారం అంచనాలను పెంచేసి ఎస్కలేషన్‌ పేరుతో ఏకంగా 9,100 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. దీనివల్ల అదనంగా ఎటువంటి ఆస్తి సమకూరకపోగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల జేబులు మాత్రం కమీషన్ల రూపంలో నిండాయనేది జగమెరిగిన సత్యం అని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఆస్తుల కల్పనకు చేసిన వ్యయంలో ఇప్పటివరకు ఒక్క శాశ్వత ఆస్తిని కూడా కల్పించకపోగా తాత్కాలిక సచివాలయం పేరుతో 1,000 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. అలాగే ఈవెంట్లు, ముఖ్యమంత్రి భవనాలు మరమ్మతులు, లగ్జరీ జల్సాల కోసం గత నాలుగేళ్లలో ఏకంగా 2,615 కోట్ల రూపాయలు వ్యయం చేశారు.

ఈ సొమ్ము వ్యయాన్ని నివారించదగినదని, అయితే ఒక పక్క ప్రజల నుంచి విరాళాలను సేకరిస్తూ మరో పక్క పెద్దఎత్తున జల్సాలకు వ్యయం చేయడాన్ని అధికార వర్గాలు తప్పుపడుతున్నాయి. మరో పక్క ఐటీ పేరుతో ఎటువంటి ఆస్తులు ఒనగూరని రంగానికి భారీగా వ్యయం చేస్తున్నారని ఆర్థిక శాఖ వర్గాలు తప్పుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులను కాదని ప్రైవేట్‌ సంస్థలు చేయాల్సిన పనులకు రాష్ట్ర ఖజానా నుంచి నిధులను వెచ్చిస్తున్నారని, ఇందులో భారీ దోపిడీ జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ఖజానాను సొంత ఖజానాగా సర్కారు మార్చేసిందని, లెక్కాపత్రం లేకుండా వ్యవహరిస్తోందని సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇంత అప్పు చేసిన రాష్ట్ర సర్కారు  కేవలం తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక పట్టిసీమ తప్ప ఎటువంటి శాశ్వత ఆస్తులను కల్పించలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇంత అప్పులు చేసినా శాశ్వత ఆస్తి కల్పించకపోయినా కేంద్రం నుంచి గత నాలుగేళ్లలో రాష్ట్రానికి నిబంధనల మేరకు పన్నుల వాటా రూపంలో రావాల్సిన నిధులు 88,214 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇదే కాకుండా వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు, రెవెన్యూ లోటు రూపంలో కేంద్రం నుంచి గత నాలుగేళ్లలో గ్రాంటు రూపంలో 84,245 కోట్ల రూపాయలు వచ్చినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అంటే కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో, గ్రాంటు రూపంలో నాలుగేళ్లలో 1,72,428 కోట్ల రూపాయలు వచ్చినట్లు స్పష్టమైంది. కేంద్రం గ్రాంటు రూపంలో పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన నిధులను కూడా వెచ్చించకుండా ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది.

అంతే కాకుండా పట్టణ పేదలకు సబ్సిడీపై మూడు లక్షల రూపాయల వ్యయంతో ఇంటి నిర్మాణం చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు లక్షల రూపాయలు పేదవాడి పేరు మీద అప్పు చేయిస్తోంది. అలాగే రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన 1500 కోట్ల రూపాయల నిధులను శాశ్వత భవనాలకు కాకుండా తాత్కాలిక భవనాలకు వెచ్చించారు. అంతే కాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థకు ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుకు వెచ్చించడం లేదు. దీనికి అదనంగా రాష్ట్ర సొంత, పన్నేతర ఆదాయం ఎలాగా ఉంది. ఉద్యోగుల జీత భత్యాలు, ఇతర నిర్వహణ వ్యయం పోగా మిగతా మొత్తాన్ని ఆస్తుల కల్పనకు వెచ్చించకుండా దుబారాకు, కమీషన్లు వచ్చే రంగాలకు వెచ్చిస్తున్న విషయం తేటతెల్లం అవుతోంది. మరో పక్క రెవెన్యూ వ్యయం ఏటేటా భారీగా పెరిగిపోతోంది.
-సి. మాణిక్యాలరావు, సాక్షి ప్రతినిధి  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top