ఈ ఊరోళ్లు... కుంగ్ ఫూ కింగ్‌లు!

ఈ ఊరోళ్లు... కుంగ్ ఫూ కింగ్‌లు! - Sakshi


పర్యాటక ఆసక్తికి భౌగోళిక అందాలు, విశిష్టతలు మాత్రమే కాదు...‘ప్రత్యేకతలు’ కూడా ప్రాముఖ్యత వహిస్తాయని చైనాలోని చిరు గ్రామం గంక్సీ డొంగ్ చెప్పకనే చెబుతుంది. ఒక్కరు కాదు... ఇద్దరు కాదు... ఆడా మగా తేడా లేదు... ఆ ఊరు ఊరంతా కుంగ్ ఫూలో నిపుణులే!

 సెంట్రల్  చైనాలోని పచ్చటి తీయాంఝా కొండల మధ్యలో రహస్యంగా దాచినట్లుగా ఉంటుంది గంక్సీ డొంగ్. డొంగ్ తెగకు చెందిన ప్రజలు ఈ గ్రామంలో నివసిస్తుంటారు.డొంగ్ ప్రజలు అనగానే వ్యవసాయంతో పాటు రకరకాల చేతికళా వృత్తులు గుర్తుకు వస్తాయి.



చిత్రకళలో కూడా వీరికి మంచి ప్రావీణ్యం ఉంది. దైవం మీద ఎంత నమ్మకం ఉందో దెయ్యం, దుష్టశక్తుల మీద కూడా అంతే నమ్మకం ఉంది వీరికి. ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు ‘ఇది దుష్టశక్తి కుట్ర’ అనుకుంటారు వాళ్లు.

 

ఆర్కిటెక్చర్‌లో అందమైన ప్రయోగాలు చేసే డొంగ్ ప్రజలకు తమవైన ప్రత్యేక పండగలు ఉన్నాయి. అయితే చైనాలోని మిగిలిన ప్రాంతాల్లో నివసించే డొంగ్ ప్రజలకు లేని ప్రత్యేకత... గంక్సీలో నివసించే డొంగ్‌లకు ఉంది. అదే కుంగ్ ఫూ! గంక్సీ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ కుంగ్ ఫూ నేర్చుకుంటారు. అయితే ప్రత్యేకతలో ప్రత్యేకత ఏమిటంటే, అందరూ ఒకేరకంగా కుంగ్ ఫూ చేయరు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్.



ఇక్కడా అక్కడా అనే తేడా లేదు... ఏ ప్రదేశంలో అయినా సరే కుంగ్ ఫూ సాధన చేస్తారు. కొన్నిసార్లు ఆ సాధన బహిరంగ ప్రదేశాల్లో ఉండొచ్చు, కొన్నిసార్లు జలజల పారుతున్న సెలయేటి నీటిలో ఉండొచ్చు, పచ్చటి కొండలపై కూడా ఉండొచ్చు! కుంగ్ ఫూ విద్యకు తమదైన సృజననాత్మకను అద్దుతున్నారు ఈ గ్రామస్తులు. అడవిలో నివసించే ఈ అడవి బిడ్డలు... పాము కదలికల్లో నుంచి, పులి పరుగుల నుంచి స్ఫూర్తి పొందుతూ... కుంగ్ ఫూలో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చేస్తున్నారు. నిజానికి గ్రామస్తుల ప్రధానవృత్తి వ్యవసాయమే అయినప్పటికీ... కుంగ్ ఫూయే తమ జీవనాధారం అన్నంతగా సాధన చేస్తారు.

 

‘‘ప్రకృతి శక్తిని, ప్రకృతిలోని అందాలను, కుంగ్ ఫూలోని సమస్త వైవిధ్యాలనూ కలిపి ఒక్కచోటే చూడాలంటే ఈ గ్రామాన్ని సందర్శించాల్సిందే’’ అంటున్నాడు అమెరికాకు చెందిన హ్యారిసన్ అనే పర్యాటకుడు.

 కుంగ్ ఫూ అంటే ఈ గ్రామస్తులకు ఎందుకంత ఇష్టం, ఈ ఇష్టం, ఆసక్తి, అంకితభావం  వెనుక ఉన్న అసలు కారణమేమిటి అనేదానికి రకరకాల కారణాలు వినిపిస్తాయి. అందులో ప్రధానమైనవి రెండు.

 

మొదటిది: ఒకప్పుడు గ్రామంలోకి క్రూర జంతువులు ప్రవేశించి తీవ్రమైన ఆస్తి నష్టం, ప్రాణనష్టం కలిగించేవట. అలాంటి  సమయంలో గ్రామపెద్దలు ఒక యువ దళాన్ని తయారుచేసి, కుంగ్ ఫూలో శిక్షణ ఇప్పించారు. నాటి నుంచీ గ్రామ రక్షణ బాధ్యతలను ఆ యువదళం తీసుకుంది. అడవి జంతువుల నుంచి గ్రామానికి ఎలాంటి నష్టం కలుగకుండా ఈ దళం కాపాడసాగింది.

 

కాలక్రమంలో ఈ యువదళ సభ్యుల కుంగ్ ఫూ నైపుణ్యం... ఊళ్లోని ఆబాల గోపాలన్నీ ఆకట్టుకుంది. దాంతో అందరూ కుంగ్ ఫూ నేర్చుకోవడమే కాదు... ఆ విద్యలో తమదైన ప్రత్యేకతను ప్రదర్శించడం ప్రారంభించారు.

 

రెండవది: డొంగ్ ప్రజలు గ్రామాన్ని నిర్మించు కుంటోన్న తొలిరోజుల్లో తరచూ దొంగల బారిన పడేవారట. ఈ దొంగల బెడదను  తట్టుకోలేక వేరే ప్రాంతం నుంచి ఇద్దరు కుంగ్ ఫూ నిపుణులను రప్పించుకొని ఊళ్లో అందరూ కుంగ్ ఫూలో శిక్షణ తీసుకున్నారట. ఆ పరంపరే ఇప్పటికీ కొనసాగుతుందనేది ఒక కథనం. కుంగ్ ఫూ నేర్చుకోడానికి కారణాలు ఏవైనా... ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో  పర్యాటకులు పనిగట్టుకుని ఈ చిట్టి గ్రామాన్ని వెతుక్కుంటూ రావడానికి కారణం మాత్రం కుంగ్ ఫూయే!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top