కొంగుముడి..

Telangana Accent Story In Sakshi Funday By Saraswati Rama

‘‘ఎప్పుడడిగినా ఇగో అస్తడు.. అగో అస్తడంటిరి? ఏడి? లగ్గం మూర్తం టైముకి కూడా జాడలేకపాయే?’’ కోపాన్ని తమాయించుకుంటూ అతను. 
‘‘నిజంగనే అస్తడనుకున్నం. చూస్తుండ్రు గదా.. మా బావ కోసం మేం జేయని ప్రయత్నం లేదు’’ పరిస్థితిని అర్థం చేయించే ప్రయత్నంలో అంజయ్య.
‘‘ఎంత సౌదిల ఉంటే మాత్రం ఒక్కగానొక్క ఆడివిల్ల పెండ్లికి రాకుంట ఉంటడా ఏ తండ్రి అయినా?’’ నిష్టూరంతో అతను. 
‘‘నువ్వన్నది నివద్దే. మా బావకు సుత రావాల్ననే ఉంటది కదా అన్నా. గాయన లేకుండ పెండ్లి జేసుడు మాకు మాత్రం గమ్మతా చెప్పు! గివన్నీ మాట్లాడుకుంట జిలకర్రబెల్లం మూర్త ఎత్తిపోగొట్కోవద్దన్నా.. ఈడిదాకా ఓపిక వట్టిండ్రు.. గాయింత గీ అక్షింతలు వడేదాకా సబర్‌ వట్టుండ్రి జెర’’ బతిమాలుకున్నడు అంజయ్య. 

‘‘మీ అక్క ఒక్కతే కూసోని కాళ్లెట్ల గడుతదయ్యా?’’ రాజీకొచ్చేస్తూ అతను. 
‘‘అవునుల్లా..!’’ ఆలోచనల్లో పడ్డాడు అంజయ్య.
అంతలోకే ఏదో తట్టినట్టయి ‘‘మేనమామను నేను కడుగుతా నా భార్యతో కూసోని’’ అంటూ లోపలికి వెళ్లాడు వాళ్లక్కకు చెప్పడానికి. 

పంచాయతీ ఆఫీస్‌నే పెళ్లి కోసం ఫంక్షన్‌ హాల్‌గా తీసుకున్నారు. ఆవరణలో పందిరి వేశారు. పంచాయతీ ఆఫీస్‌లోని రెండు గదులు, హాలును విడిదిగా చేసుకున్నారు.∙∙ 
‘‘ఊకో బిడ్డా.. మీ నాన్న అస్తడు’’ అంటూ తన మేనకోడలిని బుదిరికిస్తున్న తన అక్కను పిలిచాడు అంజయ్య.. ‘‘అక్క ఒకపారిట్రా’’ అంటూ!
‘‘ఏమైందిరా అంజిగా..’’  ఉలిక్కిపడ్డట్టు ఒక్కసారిగా బిడ్డ మీద నుంచి తమ్ముడి మీదకు దృష్టిమరల్చింది లక్ష్మమవ్వ. 

‘‘మీ ఇయ్యంకుడు కాళ్లెవరు కడ్గుతరు అని అడుగుతుండు’’ చిన్నగా చెప్పాడు అక్కకు. 
‘‘అమ్మా..! నాన్న లేకుండా నేను ఈ పెండ్లి జేసుకోనే!’’ కుమిలి కుమిలి ఏడ్వసాగింది పెళ్లికూతురు. 
‘‘అట్లనకు బిడ్డా! నోరెట్లాడితే నొసలట్లాడ్తదంటరు! నీ కాళ్లు మొక్కుతా’’ కూతురి తలను తన ఛాతిలో దాచుకుంటూ ఓదార్చింది లక్ష్మవ్వ. 
‘‘సూడ్రా.. ఏం జెప్పాలే మీ బావ కథ. పిల్ల లగ్గం కుదరంగనే అస్తా అన్నడు. పదిహేర్రోజులల్లనే పెండ్లి జేసేద్దమే.. ఎక్వతక్వ ఛుట్టీలు దొర్కయ్‌ నాకు అని జెప్పిండు. ‘‘ఏమాయె

ఎప్పుడొస్తున్నవ్‌’’ అని పోరంగా పోరంగా..‘‘ రేపే ఎల్తున్ననే.. సేటు ఆపిండు అర్జెంట్‌ పనుందని’’ అని జెప్పినోడు జిలకరబెల్లం టైమ్‌ దాకా కూడా పత్తా లేకపోతే ఏమనుకోవల్రా? ఇద్దరు కొడుకుల నడుమ పుట్టిన పిల్లని ఎంత పావురంతో పెంచుకున్నడు! బిడ్డ మంచి ఇంట్ల వడాల్నని ఎంత కష్టవడ్డడు! బిడ్డ పెండ్లి ఇట్ల్ల జేద్దమే.. అట్ల జేద్దమే.. ఆళ్లను విలుద్దం.. ఈళ్లను విలుద్దమని.. అస్సల్‌ టైమ్‌కి ఆయననే రాకపోతే ఎట్లరా? ’’ అంటూ లక్ష్మవ్వా కన్నీళ్లొత్తుకుంది. 
 చివుక్కుమంది అంజయ్య మనసు. 

‘‘ఊకోవే అక్కా.. మేమంతా లేమా? ’’ అంటూ లక్ష్మవ్వ వీపు నిమిరాడు ఓదార్పుగా. 
ఇంకోవైపు పెళ్లికూతురూ ఏడుస్తూనే ఉంది..తన సెల్‌ ఫోన్‌లో స్క్రీన్‌సేవర్‌గా ఉన్న వాళ్ల నాన్న ఫోటోను చూసుకుంటూ!
లక్ష్మవ్వ తేరుకుని చీర కొంగుతో కళ్లు తుడుచుకుంటూ ‘‘ ఇయ్యంపులోల్లేమన్నా లొల్లి వెడ్తుండ్రా?’’ తమ్ముడిని అడిగింది
‘‘ఆ..! బిడ్డ పెండ్లికి మించిన పన్లేముంటయ్‌ అయ్యకు? కాళ్లెవలు కడ్గుతరు? అని అడుగుతుండు మీ వియ్యంకుడు’’ చెప్పాడు అంజయ్య. 

‘‘నా బిడ్డ పెండ్లికి నేను కడ్గగ ఇంకోల్లు కడ్గుతరుల్లా..’’ పైట అంచును బొడ్లో దోపుకుంటూ గదమాయించింది ఆమె. 
 ‘‘బావ లేకుండా నువ్వెట్లా కాళ్లు కడ్గుతవే?’’ అయోమయంతో అంజయ్య 
‘‘ఎట్లేంది?ఆయన తువ్వాలు బొడ్ల చెక్కుకుంటా. ఇంకొక కొనను నా కొంగుకు ముడేసుకుంటా. ఇంకా మాట్లాడ్తే... పక్కపొంటి పీట మీద ఆయన ఫోటో వెట్కుంట’’ కచ్చితంగా చెప్పింది లక్ష్మవ్వ.
అక్క తాపత్రయం ఆ తమ్ముడి కంట నీరు తెప్పించింది.
ఆ మాటవిన్న పెళ్లికూతురైతే తల్లిని, మేనమామను పట్టుకొని ఏడ్చేసింది. 
 ‘‘నడువుండ్రి.. నడువుండ్రి.. మూర్తం ఎత్తిపోదిక్కి! పంతులు లొల్లివెడ్తడు మల్ల..’’ అంటూ అక్క, మేనకోడలి భుజాలు పట్టుకొని ముందుకు నడిపించాడు అంజయ్య. 
అప్పటికే పందిట్లో బ్రాహ్మడి హడావిడి మొదలైంది.. 

‘‘లక్ష్మవ్వా కన్యాదానం చెయ్యాలే..’’అంటూ తొందరపెట్టాడు పంతులు
‘‘అస్తున్న పంతులూ ’’ అంటూ మళ్లీ లోపలికి పరిగెత్తి.. భర్త ఫోటో, పెళ్లికోసమని అతనికి తెచ్చిన కొత్తబట్టల్లోని ఉత్తరీయాన్ని గబగబా తెచ్చింది లక్ష్మవ్వ. 
ఈలోపు పెళ్లి కూతురును పందిట్లోకి తీసుకొచ్చాడు మేనమామ అంజయ్య. 
పీట మీద భర్త ఫొటో పెట్టుకొని, బొడ్లో ఉత్తరీయం కొసను దోపుకొని, మరో కొసను కొంగుకు ముడివేయించుకొని కన్యాదాన కార్యక్రమానికి ఉపక్రమించింది లక్ష్మవ్వ. 
మండపంలో ఉన్న వాళ్లందరి మనసులూ భారమయ్యాయి ఆ దృశ్యం చూసి.. అందరి కళ్లలో నీటి చెమ్మ.

ఆ వేడుకకు ఆవల.. కొంత దూరంలో.. 
ఓ వ్యక్తి.. పెళ్లికూతురు అన్నకు ఒక బ్యాగ్‌ ఇస్తూ ‘‘బ్యాంక్‌ అకౌంట్‌ చెక్‌ చేసుకున్నవా? పెండ్లయిపోయినంక ఒకసారి కాల్‌ చేయమన్నడు సేటు’ అని చెప్తున్నడు ఆ వ్యక్తి.
‘‘ఊ... ’’ అంటూ బ్యాగ్‌ అందుకుంటున్న పెళ్లికూతురి అన్నకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది.  బ్యాగ్‌లో మొహం దాచుకుని గుండెపగిలేలా ఏడ్వసాగాడు. ఆ కుర్రాడిని ఎలా ఓదార్చాలో అర్థంకావట్లేదు వచ్చిన వ్యక్తికి. 

‘‘మీ చెల్లె కోసమని సేఠ్‌ భార్య బంగారం పంపింది’’ అంటూ బ్యాగ్‌ని తడిమాడు అందులో ఆ బంగారం భద్రంగా ఉంది అన్నట్టుగా. ‘‘ఏడ్వకు పిల్లగా.. నువ్వే గిట్లయితే మీ అమ్మ, చెల్లె, మీ తమ్ముడ్ని ఎవరు ఊకోవెడ్తరు చెప్పు..’’ అంటూ ఆ పిల్లాడిని సముదాయించ చూశాడు. ఆ మాటతో మరింత దుఃఖం పెరిగింది ఆ పిల్లాడికి. 
‘‘ఏడ్వకు పొల్లగా.. అందరికి అనుమానమొస్తది. ఎట్ల జెప్పాల్నో తెలుస్తలేదు.. శ..వం.. రాతందుకు పదిహేను రోజులైనా..’’ అని ఆగిపోయాడు ఆ వ్యక్తి. అంతే ఆ మాటకు బ్యాగ్‌ కిందపడేసి ఆ వ్యక్తిని పట్టుకొని మళ్లీ బోరుమన్నాడు ఆ అబ్బాయి. 

‘రేపు ఇండియాకస్తడనంగా సైట్‌కి వోయిండు.. పై నుంచి కిందవడ్డడు.. నెత్తివగిలి ఆడ్దాన్నే ప్రాణమిడ్శిండు. ఈ సంగతి మీ చెల్లె పెండ్లి అయ్యేదాకా బయటవెట్టొద్దని సేఠే జెప్పిండు మీ ఊరోళ్లతోని’’ అంటూ జరిగింది మరోసారి చెప్పాడు ఆ వ్యక్తి..
అక్కడ పందిట్లో జీలకర్ర బెల్లం తంతు అయిపోయి.. అంక్షితలు పడ్తున్నాయేమో ఒక్కసారిగా బాజాభజంత్రీలు మోగసాగాయి గట్టిగా! 
-సరస్వతి రమ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top