దక్షిణనియ్యి!  వద్దొద్దు! నాకెందుకు నీ దక్షిణ!?

Sai patham Antarvedam 22 - Sakshi

సాయిపథం – అంతర్వేదం 22

డా. మైలవరపు శ్రీనివాసరావు 

ఎక్కడైనా సరే కన్నతల్లిని చూస్తే తన బిడ్డ కళ్లలోకి అలా చూసి క్షణం ఆగి గట్టిగా హత్తుకుని పెద్ద ముద్దు పెట్టుకుంటుంది. ఈ ఇద్దరిలోనూ కన్పించే తేడా ఏమిటి? తేడా ఏమిటో కన్పించనితనమే!కన్నతల్లి తన బిడ్డ కళ్లలోకి చూస్తూ ఎంత ఎదురుచూసేలా చేశావురా? బొజ్జలో ఉండి ఎన్ని తన్నులు తన్నావురా? ఎన్ని తినరాని(మట్టి సుద్ద మరీపులుపు..) వాటిని ఇష్టంగా తినిపించావురా? ఒకసారి నేను కూడా దక్కని పరిస్థితిని కల్పించి ఎంత గాభరా పుట్టించావురా? అనుకుంటూ ఆ పసివాడి కళ్లలోకి ఈ భావాన్నంతటినీ వ్యక్తీకరిస్తూ ఆ ఆనందాతిశయాన్ని భౌతికంగా వ్యక్తీకరిస్తూ ‘గాట్టి పెద్ద ముద్దు’ని పెడుతుంది.అదే మరి పక్కనున్న మరొక ఆమె అయితే.. బోసినవ్వు ఎంత బాగుంది? గిరజాలెంత చక్కగా ఉన్నాయి? బుగ్గలెంత బూరెల్లా కనిపిస్తున్నాయి..! అంటూ ముద్దెట్టుకుంటుంది. ఇద్దరూ చేస్తున్నదీ చేసిందీ ఒకే పని అయినా ఎంత వ్యత్యాసముంది?ఇదే తీరుగా ఏదో బాబాని దర్శించేయడం కాకుండా ‘బాబా! నన్నెంత తలకిందులైన పరిస్థితి నుండి ఊహాతీతంగా బయటపడేశావ్‌? పూర్తిగా ఎండిన చెట్టులా ఉన్న నన్ను చిగిర్చి పుష్పించేలా చేశావు?’ అనుకుంటూ చూసేవారికి బాబా మరింత ఆనంద అనుగ్రహదర్శనాన్నిస్తాడు. ఏదో పదిమందితో వెళ్లాం కదా! అని చూస్తే కనిపిస్తాడు తప్ప దర్శనాన్ని ఇవ్వడు. ఇది అనుభవం ద్వారా మాత్రమే తెలిసే విషయం.ఇక్కడ ఈ మాటలెందుకనుకోవచ్చు! బాబాని దర్శించడానికి వెళ్లే ముందు బాబా గురించిన ఎంతో సమాచారాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నట్టుగా తెలుసుకుని గాని దర్శించుకున్నట్లయితే ఆ చూసే చూపులో లోతుదనమే వేరు. అలా కాక కేవలం దర్శించి నమస్కరించేస్తే పై ఉదాహరణలో కన్నతల్లి కాని ఆమె పొందినది ఆనందమే అయినా అది కన్నతల్లి ఆనందంలాంటిదెలా కాదో.. కాలేదో.. అలాగే ఉంటుంది. 15 రూపాయలివ్వు!

 సాయి దర్శనం కోసం గోవా నుంచి ఇద్దరు పెద్ద వయసువాళ్లొచ్చారు. సాయి దర్శనాన్ని చూస్తూనే చెప్పలేని ఆనందంతో పాదాభివందనాన్ని వినమ్రులై చేశారు. ఇద్దరూ కలిసే వచ్చారు. ఇద్దరూ కలిసే పాదాభివందనాన్ని చేశారు. అయితే సాయి మాత్రం మొదటివాణ్ని చూస్తూ ‘నాకో 15 రూపాయల దక్షిణనివ్వు!’ అని అడిగాడు. సాయి దర్శనం లభించడమే అదృష్టకరమైన అంశమనుకుంటూ ఉంటే ఆయనే దక్షిణ అడిగి మరీ తీసుకోవడం అనేది మరింత అదృష్టకరమైన అంశమనుకుంటూ వెంటనే 15 రూపాయలనీ ఇచ్చేశాడు మొదటి వ్యక్తి.‘అయ్యో! ఆయన అడక్కుండానే దక్షిణనిచ్చి ఉంటే ఎంత బాగుండేది?’ అనుకుంటూ రెండవ వ్యక్తి 35రూపాయల దక్షిణని సాయికివ్వబోతే వద్దు అంటూ చేతి సంజ్ఞని చేస్తూ సాయి తిరస్కరించాడు.ఇతని దగ్గర అడిగి తీసుకోవడమేమిటి? అతను తనంత తానుగా ఇంతకంటే ఎక్కువనియ్యబోతే తిరస్కరించడమేమిటి? అని అక్కడున్న భక్తులందరికీ, వచ్చిన గోవాభక్తులిద్దరికీ సంశయం కలిగింది. బాబాని అడగాలంటే భయం, సంకోచం కాబట్టి ఎవ్వరూ అడగలేకపోయారు. గానీ ‘శ్యామా’మాత్రం బాగా చనువున్నవాడు కాబట్టి సాయికి నమస్కరించి ‘ఈ సంశయాన్ని ఆయన ముందు పెట్టి అనుమానాన్ని తీర్చవూ?’ అని అడిగాడు సాయిని.బాబా శ్యామా ముఖంలోనికి చూస్తూ.. ‘శ్యామా! నాకు కుటుంబం ఉందా?’ అని అడిగాడు. ‘లేదు లేదు’ అన్నాడు శ్యామా.‘భార్య, పుత్రులు, దత్తులు ఉన్నారా?’‘లేరు లేరు..!!’‘తీర్చుకోవలసిన బాధ్యతలూ చేసిన అప్పులూ ఏమైనా ఉన్నాయా?’‘లేనే లేవు..!’‘మరి నాకు డబ్బెందుకు?’ అన్నాడు సాయి.వెంటనే శ్యామా ‘బాబా! మరి నువ్వేకదా దక్షిణ అడిగావు! ఒకరి వద్ద తీసుకున్నావు. మరొకరియ్యబోతుంటే వద్దన్నావు! అదీ కాక నీకు సొమ్ము అవసరమే లేకపోతే మరి కొందరి దగ్గర కూడా దక్షిణ అడిగి తీసుకు రమ్మంటుంటావు. తెచ్చాక తీసుకుంటావు కదా!’ అని చుట్టూ ఉన్న అందరి భక్తుల అనుమానాలన్నింటినీ కలిపి అడుగుతున్నా అన్నట్లు ధైర్యంగా అడిగాడు.

సాయి చిరునవ్వు నవ్వుతూ ‘శ్యామా! చేసిన అప్పు, శత్రుత్వం, చంపితీరాలనే పగా అనేవి జన్మలెన్ని ఎత్తినా తీర్చుకోనంత కాలం అవి వెంట వస్తూనే ఉంటాయి. నీకు ఏ రుణమూ లేదు. అందుకే నాకింత సన్నిహితుడివిగా ఉంటున్నావు. ఒక్కమాటలో చెప్పాలంటే... రుణవిముక్తి కోసమే నా దగ్గరి కొస్తారు. రుణ విముక్తిని చేసుకుంటారు. ఇక నాకు అతుక్కుని అలా వస్తూ పోతూనే ఉంటారు’ అన్నాడు బాబా.శ్యామాతో పాటు భక్తులంతా అర్థమైనట్టూ బాబా చెప్పినమాటలు కానట్టూ ఉండగానే బాబా చెప్పడం మొదలెట్టాడు వివరంగా.‘ఇదుగో! ఈ భక్తుడున్నాడే! ఒకప్పుడితనికి ఉద్యోగం లేదు. తీవ్రమైన సంకట పరిస్థితుల్లో ఉన్నాడు. నిరుపేద. ఒకరోజున మొక్కుకున్నాడు. ఉద్యోగం వస్తే మొదటి జీతం ఇస్తానని. మొక్కుకున్నట్లే ఉద్యోగం వచ్చింది. మొక్కుబడి విషయాన్ని మరచిపోయాడు. 15.. 30.. 50... అలా పెరిగిన జీతం ఈ రోజున 700 అయ్యింది. అదుగో ఆ వచ్చిన ఈ వ్యక్తి నాకు రుణగ్రస్తుడు కాదూ! అందుకే అతను ఇస్తానని ఆనాడు ఒప్పుకున్న ఆ 15 రూపాయలని మాత్రమే అడిగి తీసుకున్నాను. ఇప్పుడు 700 కావచ్చు. అది నా కొద్దు. అది అతని మొదటి జీతం కాదు గదా! కాబట్టి ఇతన్ని అడిగి తీసుకున్న 15 రూపాయలు నాకు చెల్లించవలసిన బాకీపడిన పైకం మాత్రమే’ అన్నాడు. అంతా ఆశ్చర్యచకితులయిపోయారు.30,000 రూపాయల చౌర్యం‘శ్యామా! నేనొకప్పుడు సముద్రపు ఒడ్డున తిరుగుతున్నాను. అలా నడుస్తూ ఉంటే ఓ సుందరమైన భవనం కనిపించింది. అదొక సద్‌బ్రాహ్మణునిది అని ఆ భవనానికున్న నామఫలకం  చెప్తోంది. మంచి జాతి కదా అని గ్రహించి ఆ భవనానికున్న వరండాలో కూర్చున్నాను. ఆ యజమాని నన్నేమీ అనలేదు సరికదా నన్ను లోనికి పిలిచి చక్కని భోజనాన్ని పెట్టి మంచి వసతిగా ఉన్న శుభ్రమైన పడకగదిలో పడుకోబెట్టాడు కూడా! నేనెంత గాఢంగా నిద్రపోయానో నాకే తెలియదు. అయితే తెల్లవారిన తర్వాత చూసుకుంటే నా జేబులో ఉన్న 30 వేల రూపాయల కరెన్సీ కాగితాలు చౌర్యానికి గురయ్యాయని అర్థమయింది. ఆయన సద్‌బ్రాహ్మణుడే కాక సకాలంలో ఆదుకున్నవాడు. ఆయన్ని అనుమానించడం మహాపాపం. ఆయన ఈ విషయాన్ని విని చాలాసేపు నన్ను ఓదార్చాడు. పొగిలి పొగిలి ఏడుస్తూనే ఉన్నాను. ఒకరోజు రెండ్రోజులు కాదు. అదే బ్రాహ్మణుని ఇంటి వరండాలో 15 రోజుల పాటు రోజూ చేసేపని ఏడవడమే.

ఆ మరుసటి రోజున కూడా ఇలాగే తలుచుకు తలుచుకు ఏడుస్తూ ఉంటే ఎక్కడి నుండో ఓ ఫకీరొచ్చాడు. ఉర్దూలో రెండురెండు పాదాలు మాత్రమే ఉండే ద్విపదల్లాంటివి పాడుతూ నా దగ్గరికే వచ్చాడు.‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. జరిగిందంతా చెప్పాను. ‘ఇంతేగా! నీకో ఫకీరు పేరు చెబుతాను. ఆయన ఉండే చోటు కూడా చెప్తాను. ఆయనకి మొక్కుకో! ‘నీ డబ్బు మొత్తం నీకు తిరిగొచ్చి నీకు చేరే వరకూ ప్రతిరోజూ నువ్వుతింటున్న వరి అన్నాన్ని తిననే తిననని ఆ ఫకీరుకి పూర్తి శరణాగతుడివి అయి ఆయన నామాన్నే జపించుకుంటూ ఉండు’ అని.మరేమీ తోచలేదు. ఆ ఫకీరు చెప్పినట్లే పూర్తి నిష్ఠతో నామాన్ని జపిస్తూ  ఉండిపోయాను. సరిగ్గా కొన్నిరోజులు జపించానో లేదో ఆ దొంగిలింపబడ్డ సొమ్ము నా వద్దకొచ్చింది. ఆనందంతో ఆ బ్రాహ్మణుని ఇంటిని విడుస్తూ ఆయనకి ధన్యవాదాలు చెప్పి సముద్రం దగ్గర కొచ్చాను. స్టీమర్‌ (నౌక) వచ్చింది. దాన్నిండా జనం. ఎవరో ఒక సిపాయి నాకు అడ్డుపడి లోనికి తీసుకుపోయి నాకు చోటునిచ్చి మరీ కూర్చోమన్నాడు. నౌక సముద్రం ఆ ఒడ్డుకి చేరింది. అక్కడి నుంచి రైలెక్కాను. ఇదిగో ద్వారకామాయి’ కొచ్చానన్నాడు బాబా.శ్యామాతో పాటు భక్తులందరికీ ఈ 2వ కథ అగమ్యగోచరంగా ఉండేసరికి ఆశ్చర్యంగా వింతగా చూడసాగారు బాబా వైపు. వెంటనే శ్యామాని చూస్తూ బాబా ‘శ్యామా! ఈ అతిథుల్ని నీ ఇంటికి తీసుకెళ్లు. మంచి భోజనాన్ని పెట్టి విశ్రాంతినిప్పించు’ అన్నాడు.శ్యామా ఆ ఇద్దరినీ తనింటికి తీసుకెళ్లాడు. చక్కగా భోజనాన్ని పెట్టాడు. వాళ్లు తినడం ముగించాక! బాబా చెప్పిన కథ మీకేమైనా అర్థమయిందా? బాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. ఉన్నాడు. ఆయనేమిటి? సముద్రపు ఒడ్డేమిటి? బ్రాహ్మణగృహంలో ఉండటమేమిటి? ఆయన దగ్గర 30 వేల రూపాయలుండటం, అవి ఓ దొంగ చేతికి చిక్కడం, ఆయన దుఃఖిస్తూ ఉండిపోవడం, తిరిగి సొమ్ము ఆయనకి రావడం... ద్వారకామాయికి రావడం... ఇదంతా అగమ్యగోచరంగా ఉంది నాకు. మీ ఇద్దరూ వచ్చాక బాబా ఈ కథని చెప్పాడంటే ఈ కథకి తుదీ మొదలూ మీకే తెలిసుండాలి’ అన్నాడు.

దాంతో ఆ ఇద్దరి కంఠాలు గద్గదమైపోతూ ఉంటే మొదటి ఆయన చెప్పాడు. ఆ కథ నాదే. చిచిఘాట్‌ నా జన్మస్థానం. నిరుపేదనైన నేను సముద్రపు ఒడ్డున తిరుగుతూ ఉద్యోగం కోసం ప్రయత్నించసాగాను. దత్తాత్రేయుణ్ని కొలుస్తూ ఉద్యోగం రాగానే మొదటి జీతాన్ని సమర్పించుకుంటానన్నాను. చిత్రమేమంటే నా మొదటి జీతం 15. నేటి జీతం 700. అన్నాను గానీ మొదటి జీతాన్ని మొక్కుగా చెల్లించుకోవాలనే మాటను మరచాను. సరిగ్గా బాబా నేటి జీతాన్ని 700 అని చెప్తూ నాటి జీతమే (15 మాత్రమే) కావాలని నేను చెప్పకుండా ఈయకుండా ఉంటే ‘అడిగి మరీ తీసుకున్నాడు’. ఆయన ఓ దైవం. సర్వజ్ఞుడు.దోషాన్ని మనకి మనమే గుర్తించేలా చేసి క్షమించే దైవం అని ముగించాడు.కాబట్టి కంచికామకోటి పరమాచార్యులవారు ఓ మాటని చెప్తూ ఉండేవారు. ఎవరైనా దైవానికి మొక్కుకుని ఉంటే ప్రతిరోజూ డైరీలోనూ మొదటివాక్యంగా ఈ మొక్కు వివరాలను రాసుకుంటూ ఉండాలని. అది ఎంత గొప్పమాట. సత్యనారాయణస్వామి వ్రతంలో మొక్కుని మరిచిపోవడం, షావుకారుకి భార్య గుర్తు చేసినా వాయిదా వేయడం, చివరికి తప్పుని అంగీకరించి ఒడ్డునపడటం.. అనే ఆ కథ ఎంతటి కనువిప్పునిస్తుంది మనకి! గమనించుకోవాలి! అనుకోకుండా వచ్చిన క్రమక్రమ ఆపదలలో మొక్కేసుకోవడం ఇన్ని సంఖ్యలో ఉన్న మొక్కుల్లో దేన్నో మర్చిపోవడం లేదా మొక్కుకున్న వివరం గుర్తులేకపోవడం వంటివి జరుగుతూ ఉండటం సర్వసాధారణం. సాయి దయార్ద్రహృదయుడు కాబట్టి మనం చేసిన దోషాన్ని గుర్తుచేసి మరీ మనచేత తీర్పించుకుంటాడన్న మాట. అలాగని ఆయనే గుర్తు చేస్తాడు కదా! అహంకార నిర్లక్ష్యభావాన్ని చూపిస్తే మనకి ఫలితం బాగా అర్థమయ్యేలా చేస్తాడు కూడా! కాబట్టి సకాలంలో మొక్కుని సరిగా తీర్చుకోవాలి తప్పదు!

రెండవది నా కథే!
రెండవ ఆయన కన్నీళ్లు తన్నుకుంటూ వస్తూంటే తన కథని చెప్పసాగాడు. ‘నేనొక వర్తకుడ్ని. వ్యాపారపు పనుల కారణంగా కుదరదనుకుని ఒక బ్రాహ్మణజాతి వంటవాడ్ని ఏర్పాటు చేసుకున్నాను. 35 ఏండ్ల నుండే మా ఇంట్లో తలలో నాలుకగా అయిపోయాడాయన.ఎవరో ఒక నీచుని సహవాసం వచ్చింది. దాంతో నేను పడుకునే గదిలో డబ్బు దాచుకునే బీరువా ఏ గోడలో బిగింపబడి ఉంటుందో తెలిసిన అతను ఓ నాటి రాత్రి ఆ గోడకి అమర్చబడిన బీరువాకి అటు ఇటూ ఉండే ఇటుకల్ని తొలగించి బీరువాకి రంధ్రాన్ని చేసి 30,000 రూపాయల సొమ్ముని కాజేశాడు. వ్యాపారపు పెట్టుబడి సొమ్మంతా దొంగతనానికి గురైందని తెలిసి ఇవ్వవలసినవారికి ఎలా ఇయ్యాలో.. సరుకుని ఎలా కొనుగోలు చేయాలో?... ఏం దిక్కుతోచక బావురుమంటూ ఏడుస్తూ 15 రోజుల పాటు కంటికీ మింటికీ ధారగా ఏడుస్తూనే గడిపాను రాత్రింబవళ్లని.15 రోజుల పాటూ మరో పనిలేదు. ఏడుపే ఏడుపే. 15 రోజులు నిండాక ఓ ఫకీరు నా దగ్గర కొచ్చాడు. ఏడుస్తున్న నన్ను దగ్గరికి తీసుకుంటూ కారణాన్ని అడిగాడు. చెప్పాను. వెంటనే తరుణోపాయాన్ని (కష్టాన్ని దాటగల ఉపాయాన్ని) చెప్పాడు. ‘కీపర్‌గాంవ్‌ అనే తాలూకాలో షిరిడీ అనే కుగ్రామం ఉంది. అక్కడ ‘సాయి’ అనే ఓ జాలియా (నియమ బద్ధమైన జీవితాన్ని గడిపే జ్ఞాని అయిన ఫకీరు) ఉన్నాడు. ఆయనకి మొక్కుకో! ‘నీ సొమ్ము నీకు వచ్చేలా చేయవలసిందనీ సొమ్మొచ్చే వరకూ వరి అన్నాన్ని (నిత్య ఆహారం) ముట్టనే ముట్టననీ సొమ్ము లభించాక దర్శనానికొస్తాననీ, ఈలోగా నామజపాన్ని చేస్తూనే ఉంటాను’ అని మొక్కుకో అన్నాడు. ఆ ఫకీరు చెప్పిన మాటల్నే మంత్రంగా భావించి అలాగే చేయసాగాను.

ఆశ్చర్యకరంగా ఆ బ్రాహ్మణజాతి వంటవాడు వచ్చి 30 వేల రూపాయలనీ ఇచ్చేసి.. మతిభ్రమించి ఏం చేశానో ఆ సమయంలో తెలియలేదు. తిరిగి ఈ సొమ్మునిచ్చే వరకూ మనశ్శాంతి లేక ఇలా వచ్చాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎన్నిమార్లు వెదికినా నాకు ఈ కోపర్‌గాంవ్‌ జిల్లాలోని షిరిడీ కుగ్రామంలోని సాయి వద్దకి వెళ్లవలసిందనీ ఆహార నిషేధాన్ని పాటించవలసిందనీ నామజపాన్ని కానిస్తూండవలసిందనీ చెప్పిన ఆనాటి ఫకీరు కనపడనే లేదు. అలాంటి వ్యక్తి ఎవరికీ కనపడలేదని కూడా అందరూ చెప్పారు.ఈ రోజున ఇక్కడికి వచ్చాను. ఆ ఫకీరు చెప్పిన సాయి ఈయనయే. నా చరిత్ర మొత్తం అలా కళ్లకి కట్టినట్టు చెప్పడం.. 30 వేలు మాత్రమే అని చెప్పగలగడం. నా 15 రోజుల శోకం.. ఇదంతా అక్షరాక్షర సత్యం అని ఆనందాశ్రువుల్ని రాల్చాడు.సొమ్ము 30 వేలూ నాకు లభించాక కూడా నేను మరింత వ్యాపారాభివృద్ధికి ‘కొలాబా’ అనే ప్రదేశానికి వెళ్లాను. సాయి నాకు స్వప్నంలో కనిపించాడు. అంతే! బుర్ర పాడయిపోయింది. ఇంత సొమ్ములభింపజేసిన సాయి దర్శనం కంటే వ్యాపారం ముఖ్యమా? అనుకుంటూ సముద్రపు నౌక దగ్గరికి రాగానే అడ్డుకున్నాడు సరంగు(కెప్టెన్‌). ఒక సిపాయి–తనకి నేను బాగా తెలుసునని చెప్తూ లోనికి ఎక్కనిచ్చాడు. ఇలా రాగలిగాను బుద్ధివంకరని పోగొట్టుకుని. ఆయనకి నేను 35 రూపాయలని ఇయ్యబూనడమా? ఎంత అవివేకిని? అంటూ బిగ్గరగా ఏడ్చాడు. గమనించుకోవాలి! మనం మొక్కుని ఎప్పుడు తీర్చుకోకుండా ఉంటామో అప్పుడు మన అపరాధాన్ని తెలియజేసే కరుణార్ద్రహృదయుడాయన. అహంకరిస్తే అథఃపాతాళానికి తొక్కే సాహసపరాక్రమవంతుడూ ఆయనే.
– సశేషం 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top