యుయుధానుడు

యుయుధానుడు


గుండె నుంచి అపనమ్మకాన్నీ సంశయాన్నీ నిరుత్సాహాన్నీ విడదీసుకోడానికి పోరాడుతూ తనను విశ్వచైతన్యం దిక్కుగా ఆకర్షించే గుణంతో కలుపుకొనే సాధకుడికి యుయుధానుడు ప్రతీక.

 

ఐదోవేదం : మహాభారత పాత్రలు - 36

యాదవ కులంలో వృష్ణులూ అంధకులూ సాత్వతులూ దాశార్హులూ మాధవులూ మొదలైన తెగలు చాలానే ఉన్నాయి. యాదవ కృష్ణుణ్ని వార్ష్ణేయుడనీ సాత్వతుడనీ దాశార్హుడనీ మాధవుడనీ రకరకాలుగా పిలవడానికి కారణం ఈ తెగల పేర్లే. వృష్ణుల్లో అనిమిత్రుడనే అతనికి నిమ్నుడూ శినీ వృష్ణీ అని ముగ్గురు కొడుకులు పుట్టారు. నిమ్నుడి కొడుకు సత్రాజిత్తు. శినికి కొడుకు సత్యకుడు. ఈ సత్యకుడి కొడుకే సాత్యకి అని చెప్పుకొనే యుయుధానుడు.

 

యుయుధానుడంటే యోద్ధాయోద్ధల కులానికి చెందినవాడని అర్థం. కులమంటే ఒక సమూహమని అర్థం. ‘యు’ అంటే, కలపడమూ విడదీయడమూ అనే రెండు వ్యతిరేక అర్థాలూ ఉన్నాయి. యుయు ధానుడంటే యోద్ధలతో తనను కలుపు కొని, అపనమ్మకాన్నీ పిరికితనాన్నీ తన నుంచి విడదీసుకొన్నవాడని అర్థం. గుండె నుంచి అపనమ్మకాన్నీ సంశయాన్నీ నిరుత్సాహాన్నీ విడదీసుకోడానికి పోరాడుతూ తనను విశ్వచైతన్యం దిక్కుగా ఆకర్షించే గుణంతో కలుపుకొనే సాధకుడికి యుయుధానుడు ప్రతీక.

 

యుయుధానుడు శ్రీకృష్ణ బలరాము లతో సహా అభిమన్యుడి పెళ్లికి మత్స్య దేశానికి వెళ్లాడు. ఉత్తరాభిమన్యుల వివాహమైన తరవాత చుట్టపక్కాలందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లకుండా విరటుడి సభలో పాండవుల భవితవ్యం గురించి ఆలోచించారు. ద్రుపదుడి పక్కనే యుయు ధానుడు బలరాముడితో సహా కూర్చు న్నాడు. విరాటరాజు దగ్గరిగా కృష్ణుడూ యుధిష్ఠిరుడూ కూర్చొని ఉన్నారు. శ్రీకృష్ణుడు అందరినీ ఉద్దేశించి ‘పాండ వులు వాళ్ల రాజ్యాన్ని శకుని ద్వారా పోగొట్టుకొని, షరతుల ప్రకారం పన్నెండేళ్లు వనవాసమూ ఏడాది పాటు కష్టాతికష్టమైన అజ్ఞాతవాసాన్నీ విజయవంతంగా పూర్తిచేశారు.



తిరిగి తమ పైతృక రాజ్యాన్ని పొందడానికి ఇప్పటి దాకా అజ్ఞాతవాసంలో ఇతరులకు సేవ చేస్తూ గడిపారు. ఇప్పుడింక ఏ తీరులో ఈ ధర్మపుత్రుడికీ ఆ దుర్యోధనుడికీ ఇద్దరికీ హితం జరిగేలాగ చేయడం సబబో మీరందరూ నిర్ణయించండి. చిన్న గ్రామానికి మహీపతిత్వమైనా సరే అది ధర్మార్థయుక్తమైతే చాలు యుధిష్ఠిరుడు సంతృప్తి చెందుతాడు. నిజానికి స్వయంగా పాండుపుత్రులే దిగ్విజయం ద్వారా చాలా మంది రాజుల్ని జయించి రాజ్యాన్ని సంపాయించారు. తాము సంపాయించు కొన్న రాజ్యాన్నే వాళ్లు న్యాయబద్ధంగా కోరుకొంటున్నారు. కానీ ఇప్పుడు ఆ కౌరవులకు, ఇన్నాళ్లూ అప్పనంగా రాజ్యాన్ని అనుభవించడంతో, లోభం పెరిగిపోయింది.



కౌరవుల కక్కుర్తినీ యుధిష్ఠిరుడి ధర్మతత్పరతనీ దృష్టిలో పెట్టుకొని, ఏది చేస్తే సబబో మీరందరూ నిర్ణయించాలి. యుద్ధంలో ఆ కౌరవుల నందర్నీ చంపిమరీ రాజ్యాన్ని తీసుకో వలసివస్తుంది. వీళ్లు అల్ప సంఖ్యాకులు గదా వాళ్లమీద వీళ్లెలా గెలవగలరని మీరు అనుకోవచ్చు. తమ హితైషులతో కలిసి పాండవులు కౌరవుల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినా, దుర్యో ధనుడి ఉద్దేశమేమిటో అతనేం చేయ దలుచుకున్నాడో మనకు తెలియదు. అంచేత, ఇక్కణ్నించి ఒక దూతను పంపడం మంచిదని నాకు అనిపిస్తోంది’ అంటూ ముగించాడు.



వెంటనే బలరాముడు దుర్యోధనుడి వకాల్తా తీసుకొన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాటలకు ఉవ్వెత్తున మండిపడుతూ లేచాడు పక్కనే ఉన్న సాత్యకి: ‘మహాత్ముడైన ధర్మజుడికి జూద మాడడంలో నేర్పరితనం లేదు. అయినా సరే, జూదమాడడంలో బాగా చెయ్యి తిరిగినవాళ్లు ఇంటికి పిలిచి మరీ ఆడించి ఓడిస్తే, అది ధర్మపూర్వకమైన విజయం ఏవిధంగా అవుతుంది? ధర్మరాజు తన ఇంట్లోనే తమ్ముళ్లతో జూదం ఆడుతుంటే, అక్కడికి వచ్చి ఆడి ఓడిస్తే అది ధర్మమవు తుందని చెప్పవచ్చు.



పిలిచి మరీ కపట మైన తీర్పులో ఓడించినవాళ్ల పనిని ఎవరైనా శుభమైన పని అని అనగలరా? ఇతనేమో షరతు ప్రకారం నియమాలను తూచా తప్పకుండా పాలించి వచ్చాడు. మరి ఎందుకని తలవంచి రాజ్యాన్ని అడుక్కోవాలో నాకు బోధపడటం లేదు. భీష్ముడూ ద్రోణుడూ విదురుడూ ఇలాగ ఎంతమంది అనునయించి చెప్పినా దుర్యోధనుడు రాజ్యాన్ని ఇద్దామని అనుకోవటం లేదు. నేను వాళ్లను వాడి వాడి బాణాలతో బలవంతంగా ఒప్పించి యుధిష్ఠిరుడి కాళ్లమీద పడేస్తాను. అలాగ చెయ్యకపోతే వాళ్లనందర్నీ యమలోకానికి అతిథులుగా చేసి తీరతాను. అందరూ నా ముందు నిలవడానికి సామర్థ్యం లేనివాళ్లే.



ఆతతాయిలైన శత్రువుల్ని చంపితే అధర్మం కాదు. అటువంటి నికృష్టుల్ని యాచించ డమే సర్వథా అధర్మమూ అకీర్తికరమూను. రణరంగంలో అందరికందరు కౌరవులూ చావవలసిందే’ అంటూ ఉపన్యసించాడు. శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపుదామనే ఉద్దేశంతో కౌరవులకు నచ్చ చెప్పడానికి పాండవ రాయ బారిగా వచ్చినప్పుడు, దుర్యోధనుడు... దుశ్శాసన కర్ణ శకునుల సంగంతో మత్తెక్కి మదించి ‘మనం కృష్ణుణ్ని పట్టుకొని బందీగా చేద్దాం. కృష్ణుడు మన చెరలో ఉన్నాడని తెలియగానే కోరలు విరిగిన పాముల్లాగ నిర్వీర్యులైపోతారు పాండవులు’ అంటూ పరమ దుష్టాలోచనను చేశారు.



ఈ దుష్ట ప్రణాళికను  యుయుధానుడు కృష్ణుడి చెవిన ఈ వార్తను వేశాడు. కృష్ణుడు, ‘ఇదీ మంచిదే. ఈ రోజునే వీళ్లను చాప చుట్టినట్టు చుట్టబెట్టి పాండవులకు అప్ప గించేస్తాను. ఒక్కసారిగా తలనొప్పి వదిలి పోతుంది’ అన్నాడు. యుద్ధభూమిలో సాత్యకి పాండవులకు చివరిదాకా సాయపడ్డాడు. సైంధవుణ్ని వధించి ప్రతిజ్ఞను తీర్చుకోవ డానికి వెళ్తూ అర్జునుడు, తన శిష్యుడైన యుయుధానుణ్ని, ద్రోణుడి బారి నుంచి ధర్మారజన్నయ్యను కాపాడుతూ ఉండ మని మరీ మరీ చెప్పాడు.



అయితే, ధర్మరాజుకు శ్రీకృష్ణార్జునులేమైపోతారో అని ఒకటే బెంగ. దానితో సాత్యకిని అర్జునుడికి సాయంగా వెళ్లమని ‘నీ గురువుకు గురువుగా నిన్ను ఆదేశిస్తున్నా’నని నిర్బంధపెడుతూ, గురువు మాటను జవదాటడం ఇష్టం లేకపోయినా అతన్ని బయలుదేరదీశాడు.  మొదట ద్రోణకృత వర్మలతో యుద్ధం చేస్తూ వాళ్లను తప్పించుకొని కాంబోజుల సేన దగ్గరికి వచ్చాడు సాత్యకి. తిరిగి కృతవర్మ ఎదురొస్తే అతన్ని ఓడించి, త్రిగర్తుల గజసేనను సంహరించాడు. మహాగజంతో అడ్డుపడిన మాగధుడైన జలసంధుణ్ని ఆ ఏనుగుతోసహా తెగేసి ముందుకుపోయాడు. ద్రోణ కృతవర్మలతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడల్లా జయించి దూసుకుపోయాడు.

 

ద్రోణుణ్నీ కృతవర్మనీ రెండు మూడు సార్లు జయించినా తన సారథితో ఏ గర్వమూ లేకుండా, ‘మనం ఇక్కడ నిమిత్త మాత్రులమే. నిజానికి కేశవ ఫాల్గుణులే మన శత్రువులను చంపుతున్నారు. అర్జు నుడు చంపినవాళ్లను మనం తిరిగి చంపు తున్నట్టున్నాం’ అంటూ, శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపిస్తూ, ‘నేను కాలుణ్ని. నేను చంపేసినవాళ్లను నువ్వు నిమిత్తమాత్రంగా చంపి కీర్తిని అనుభవించు’ అని చెప్పిన మాటల్నే ధ్వనింప జేశాడు యుయుధానుడనే గురుభక్తుడు.



అలా అంటూన్నప్పుడే సుదర్శనుడనే రాజకుమారుడు తార సిల్లాడు. అతనితో పెద్ద పోరాటమే జరి గింది. చివరికి అతన్ని వధించి, కాంబో జయ వనసేనలను ఓడించి, దుర్యో ధనుణ్ని అతని తమ్ముళ్లతో సహా పలా యనం చిత్తగించేలాగ ఇబ్బందిపెట్టాడు. ఆ మీద అతిఘోరంగా రాళ్లతో యుద్ధం చేసే మ్లేచ్ఛుల సైన్యాన్నీ సంహరించి అక్కడే పక్కనున్న దుశ్శాసనుణ్ని, అతని సేనతో సహా తరిమి గొట్టాడు. అలంబుషు డనే రాజును వధించి వస్తూంటే కృష్ణుడు అర్జునుడికి సాత్యకి రాక గురించి చెప్పాడు.



అర్జునుడు, ‘ఇతన్ని అన్నగారికి సాయంగా ఉండమని చెప్పి వచ్చాను. ద్రోణుడు అన్నగారిని పట్టుకుంటే, ఈ యుద్ధమంతా దండగే. తిరిగి మేము వనవాసానికి పోవలసివస్తుంది’ అంటూ నొచ్చుకున్నాడు. ఆ సమయంలోనే ఇంత యుద్ధమూ చేసి అలసిపోయి ఉన్న సాత్యకికి భూరిశ్రవసుడు ఎదురయ్యాడు. వాళ్లిద్దరి యుద్ధాన్ని చూస్తూ అర్జునుడు ‘ఇంత కౌరవ సాగరాన్నీ దాటివచ్చి ఇప్పుడు మన సాత్యకి తన అలుపు కార ణంగా, గోష్పాదమంత చిన్ని నీటికుంట లాంటి భూరిశ్రవుడి చేతిలో దెబ్బతినేసే లాగ ఉన్నాడు’ అంటూ వాపోయాడు.



సోమదత్తుడికి వరప్రసాదంగా పుట్టిన భూరిశ్రవసుడు, శిని మనవడు సాత్యకి తలను నరకబోతూంటే అర్జునుడు భూరిశ్రవసుడి కుడిచేతిని ఎగరగొట్టాడు. అతను హతాశుడై మునిలాగ శరాసనం మీద కూర్చొని ఉండగా ఈ సాత్యకి, కృష్ణార్జునులు వద్దంటున్నా వినకుండా, అతని తలను ఖండించాడు.

 తరవాత ద్రోణుడు కూడా అశ్వత్థామ చనిపోయాడన్న మిథ్యావార్తను విని అస్త్రా లను విడిచిపెట్టి రథం మీదనే ధ్యాన మగ్నుడైనప్పుడు, అతన్ని చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడు అతని తలను కోసేశాడు. అది చూసి సాత్యకి ధృష్ట ద్యుమ్నుణ్ని తిట్టాడు.



గదతో మీదకు ఉరికి చంపుతానని బెదిరిస్తూన్న సాత్యకిని భీముడు ఆపాడు. పద్దెనిమిదో రోజున యుద్ధం చేస్తూన్న కౌరవ సైనికులతో ఉన్న సంజయుణ్ని సాత్యకి పట్టుకున్నాడు. అతన్ని చంపుదామనుకుంటూండగా వ్యాసమహర్షి తటాలున అవుపించి ‘ఇతను వధార్హుడు కాడు’ అని చెప్పి సంజ యుణ్ని విడిచిపెట్టేలాగ చేశాడు.       

  - డా. ముంజులూరి నరసింహారావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top