వివరం: నడిపించే దైవం

వివరం: నడిపించే దైవం


తన ప్రతిరూపం పురుడు పోసుకోబోతుంటే...

ఆ రూపం కళ్ల ముందు కదలాడుతుంటే...

తన వారసత్వానికి కొనసాగింపు కలుగుతోందంటే...

తాను కొన్నియుగాల వరకు జీవించి ఉంటాననుకుంటే...

ఆ ఊహే ఎంతో తియ్యగా మరెంతో మధురంగా ఉంటుంది.

అలా ఆ తండ్రి జన్మజన్మలకీ చిరంజీవే...

అంతటి జీవితసారం తెలిసిన తండ్రి...

కన్నకూతురు అల్లుడి చేయి పట్టుకుని అత్తవారింటికి బయలుదేరుతుంటే...

కన్న కొడుకు విద్యాభ్యాసం కోసం సుదూరప్రదేశాలకు పయనమవుతుంటే...

బాధకు లోనవుతాడు...

బేలగా మారతాడు... కన్నీరుమున్నీరవుతాడు...

బయటకు శబ్దం వినపడకుండా...లోలోపలే కుమిలిపోతాడు...

తండ్రి అంతరంగాన్ని మరో తండ్రి మాత్రమే వర్ణించగలడేమో...

ఇవాళ ఫాదర్స్ డే. ఈ సందర్భంగా...

పురాణాలలోని కొందరు తండ్రుల గురించి ఈవారం ‘వివరం’.


 

 పిల్లలను గారం చేయడం తల్లి లక్షణం. క్రమశిక్షణలో ఉంచడం తండ్రి బాధ్యత. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటాడు తండ్రి. జన్మనిచ్చినవాడు జనకుడు మాత్రమే. జన్మనివ్వటమే కాక రక్షణ కల్పిస్తేనే తండ్రి. ‘పాతీతి పితా’ అని నిర్వచనం. కన్న సంతానం యొక్క వ్యక్తిత్వ నిర్మాణ విషయంలో తండ్రిది ప్రథమ స్థానం. పసితనం నుంచి పిల్లల మీద కన్ను వేసి ఉంచుతాడు తండ్రి. పిల్లలు సక్రమంగా పెరగకపోవడానికి పూర్తి బాధ్యత తండ్రిదే.

 పాలయేత్ పంచవర్షాణి

 దశవర్షాణి తాడయేత్

 ప్రాప్తేతు షోడశే వర్షే

 పుత్రం మిత్ర వదాచరేత్... అని శాస్త్రం చెబుతోంది.

 పదహారు సంవత్సరాలు వచ్చిన పిల్లలు పరిపక్వత సాధించినవారితో సమానం. ఎదిగిన పిల్లలకు బాధ్యతలన్నీ అప్పగించి, దూరం నుంచి గమనించే స్థితికి చేరుకోవాలి తండ్రి. పిల్లలకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా ‘నా మాటే చెల్లాలి’ అనుకోకుండా, బాధ్యతలన్నీ వారికి వదిలేసినప్పుడు మాత్రమే తండ్రికి గౌరవం దక్కుతుంది.

 

 ‘తండ్రి హరి చేరుమనియెడి తండ్రి తండ్రి’ అని భాగవతంలో ప్రహ్లాదుడు పలుకుతాడు. ‘నేను హరి లేడ న్నాను కాబట్టి, నువ్వు కూడా హరి లేడనే పలుకు’ అన్నాడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు. అందుకే ఆయనకు తండ్రి స్థానం దక్కలేదు. మంచి పనులు చేయమని చెబుతూ, పిల్లలను సక్రమమార్గంలో నడపగల పరిపక్వ స్థితిలో ఉండాలి తండ్రి.

 

 ధర్మవ్యాధుని కథలో కౌశికుడు మహర్షి అయి ఉండీ, కోపిష్టిగా మారి కొంగను శపించాడు. అందుకు ఆయనను ‘నువ్వు ఎందుకిలా అయ్యావు’ అని ప్రశ్నిస్తే... ‘తండ్రికి పెద్దవాడి మీద, తల్లికి చిన్నవాడి మీద ప్రేమ ఉంటుంది. మధ్యముడనైన నా మీద వారికి ప్రేమ లేదు. తల్లిదండ్రుల ప్రేమలో పెరుగనివారు ఎలా మారినా మారవచ్చని చెబుతాడు. ‘తనయుడు దుష్టయిన తండ్రి తప్పు’ కొడుకు దుర్మార్గుడు కావడానికి కారణం తండ్రి... అని నృసింహ శతకకారుడు చెబుతున్నాడు.

 

  వసుదేవుడు

 గృహ నిర్బంధం నుంచి వసుదేవుడు పిల్లవాడిని రక్షించడం కోసం శిశువును బుట్టలో ఉంచుకుని, పరవళ్లు తొక్కుతున్న యమునా నదిని  నడిరేయి వేళ దాటి, గోకులానికి వె ళ్లి నందుడికి అప్పగించాడు. తన కుమారుడు క్షేమంగా, సుఖంగా పెరగాలనే ఉద్దేశ్యంతోనే అంతటి కష్టానికి సిద్ధమయ్యాడు వసుదేవుడు. అంతేనా... పిల్లవాడి సంరక్షణార్థం గాడిద కాళ్లు పట్టుకున్నట్లుగా ప్రాంతీయ కథ ఒకటి ప్రచారంలో ఉంది. వసుదేవుడు ‘అంతటి వాడు’ అయిన శ్రీకృష్ణుడిని రక్షించడం కోసం గాడిద కాళ్లు పట్టుకున్నాడట. ‘పిల్లలు ఏమైతే నాకేం’ అని తండ్రులు ఏమీ పట్టనట్లు ఉండకుండా, అవసరమనుకుంటే ఆ పిల్లల సంరక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలంటూ తండ్రి బాధ్యతలను గుర్తు చేస్తుంది ఈ కథ.

 

 రామాయణంలో...

 రాముడి ముఖ కవళికలను బట్టి అతడి ధర్మాన్ని కనిపెట్టేవాడట దశరథుడు. అందుకే రాముడి  దగ్గర... మాట తేడా రాకుండా, జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం కోసం దశరథుడు బాగా ఆలోచించేవాడట. పిల్లల పెంపకం విషయంలో తండ్రి ఆధిపత్యం చలాయించాలనుకోకూడదు. పిల్లలతో పెద్దలు జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే దశరథుడు అంత ఆలోచించి మాట్లాడాడట రాముడితో. అదీ పితాపుత్రానుబంధం.

 

 అందుకే - అంతటి శ్రీరామచంద్రుడు... శివుని విల్లు విరిచి జానకిని పరిణయమాడే సమయంలో, తండ్రి అయిన దశరథ మహారాజుకి విషయం తెలియచేయమన్నాడు. ‘నా వివాహం నా ఇష్టం’ అనలేదు. పెంపకాన్ని బట్టి వారి మనోవికాసం ఏర్పడుతుంది. చిన్ననాటి నుంచి దశరథుడు అలా ఉన్నాడు కనుకనే, రాముడికి తండ్రి మీద గౌరవం ఏర్పడింది. అంతేకాదు... జానకి ని వివాహం చేసుకోవడానికి, ఆమె మీద అంత ప్రేమానురాగాలు ఉండటానికి కారణం... జానకి తన తండ్రి అయిన దశరథుడు అంగీకరించిన అమ్మాయి కావడమే. ‘దారాః పితృకృతా ఇతి..  సీతను తన భార్యగా తండ్రి నిశ్చయించాడు’ అనిపిస్తాడు వాల్మీకి రాముడి చేత.

 

 వృద్ధాః శిష్యాః గురుర్యువాః అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు చెప్పారు. గురువు అంటే తండ్రి. తండ్రి యొక్క ఆలోచన యువతరం వైపు ఉంటూ, వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలి. అప్పుడు ఇరువురి మధ్య అనుబంధం కొనసాగుతుంది. ‘పితాశ్రుతం’ అంటున్నాయి శాస్త్రాలు. శ్రుతం అంటే విద్య, జ్ఞానం అని అర్థం. అంటే... తండ్రి స్థానంలో ఉండేవారు ముందుగా ఆలోచించవలసింది పిల్లలకు జ్ఞానం, విద్య నేర్పడం అని.

 

 భారవి కథ

 భారవి రచనలు చూసినవారంతా ప్రశంసలతో ముంచెత్తుతుంటే, తండ్రి మాత్రం భారవిని పొగడలేదు. దాంతో భారవికి తండ్రి మీద కోపం ఏర్పడి, ఆయనను చంపేయాలనుకుని, అటక మీద కూర్చుని ఆయన రాక కోసం ఎదరుచూస్తూ ఉంటాడు. తండ్రి అదే అటక కింద కూర్చుని భోజనం చేస్తుండగా, భార్య కొడుకు ప్రస్తావన తీసుకు వస్తుంది.

 

 ‘పిల్లలను పెద్దలు పొగిడితే వారి అభివృద్ధి ఆగిపోతుంది’ అని తండ్రి చెప్పడంతో, తాను తండ్రిని తప్పుగా అర్థం చేసుకుని, ఆయనను హతమార్చడానికి కూడా వెనకాడకుండా పెద్ద తప్పు చేశానని బాధపడతాడు. అందుకు తగిన శిక్ష విధించమని తండ్రిని కోరతాడు. ‘ఆరు నెలలు అత్తవారింటికి వెళ్లు’ అంటాడు తండ్రి. అత్తవారింట్లో కొన్నిరోజులు మర్యాదలు, భోగాలు అనుభవించాడు. ఆ తరువాత నుంచి అవమానాలు మొదలయ్యాయి. తీవ్ర మనస్తాపంతో భారవి ‘కిరాతార్జునీయం’ వ్రాశాడని ప్రతీతి. ఆ కావ్యంలోని సహసా విదధీత నక్రియాం అవివేకః పరమాపదాం పదం (తొందరపడి ఏ పనీ చేయకూడదు, అవివేకం ఆపదలకు మూలం) అన్న వాక్యానికి భారవికి ప్రపంచమంతా నీరాజనం పలికింది. ముందుచూపు ఉన్నవాడు కావడం వల్లే, భారవికి అత్తవారి ఇంట ఉండమని శిక్ష విధించాడు తండ్రి. తన బిడ్డ క్షేమం కోసం గుండెను రాయి చేసుకుని, కఠినంగా ప్రవర్తిస్తాడు తండ్రి. కన్న సంతానాన్ని రక్షిస్తూ, వారిని సక్రమ మార్గంలో నడపడమే తండ్రి గొప్పదనం.

 

 ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః


 ... అని వేదం చెబుతోంది. అంటే ఒక తరం నుంచి ఒక తరానికి వంశం తాడులా కొనసాగాలని అర్థం. సంతానాన్ని కనిపారేస్తే సరి కాదు. పితాపుత్ర అనుబంధం కొనసాగాలి. అది పితృత్వంలో బాధ్యత. ఆ పరంపరకు మూలం వ్యాసుని వంశం.

 వ్యాసం వశిష్ఠ నప్తారం

 శక్తేః పౌత్రమకల్మషమ్

 పరాశరాత్మజమ్ వందే

 శుకతాతం తపోనిధిం॥

 వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు... ఈ వంశంలో ఇంతమందీ పితృపరంపరను కొనసాగించారు. తండ్రిగా వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఒక  వంశంలో ఈ పరంపరను కొనసాగించడం విశేషం.

 రఘువంశంలోని వారు కూడా ఆ పరంపరను కొనసాగించారు. రఘువంశీయుల రాజ్యంలో తండ్రులు ‘కేవలం జన్మ హేతవః’ అన్నట్లుగా ఉండేవారట. అంటే తండ్రులు సంతానానికి జన్మను మాత్రమే ఇచ్చేవారట. వారి పోషణపాలనలంతా రాజులే భరించేవారట. ఆ విధంగా ఆ వంశంలోని రాజులందరూ ప్రజలకు తండ్రులయ్యారు. అలా కూడా వారు పితృపరంపర కొనసాగించారు.

 

 ద్రోణుడు జాతి పిత...

 ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ, ప్రియశిష్యుడు అర్జునుడు. అశ్వత్థామ కంటె అర్జునుడి మీదే ద్రోణాచార్యుడు ప్రేమ చూపడానికి కారణం అర్జునుడిలో ఉన్న ఏకాగ్రత. ‘అర్జునుడిని అందరికంటె ఉత్తముడిగా తీర్చుతానన్న ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు. అదీ గురువు లక్షణం. ‘జాతి పిత’ అనే పదం అందుకే వచ్చింది. పరిపాలకుడు, విద్యను నేర్పే గురువు... తండ్రి స్థానంలో ఉండాలి. సంతానం పట్ల పక్ష పాతం ప్రదర్శించకూడదు. మరి ద్రోణుడు గొప్ప తండ్రి అవుతాడా! గొప్ప తండ్రి కనుకనే అశ్వత్థామలో ఉండే ఆవేశాన్ని గుర్తించి, అశ్వత్థామకు అవసరమైన మేరకే విద్య నేర్పాడు. ఆయన పుత్ర ప్రేమ కురుక్షేత్ర యుద్ధ సమయంలో బయట పడుతుంది. అశ్వత్థామ చిరంజీవి అని తెలిసినప్పటికీ, ధర్మరాజు ‘అశ్వత్థామ హతః’ అనగానే ద్రోణుడు ప్రాణత్యాగం చేసేశాడు. అదీ తండ్రి హృదయం అంటే.

 

 పితృవాత్సల్యం...

మహాభారతంలోని ధర్మవ్యాధుడు (మాంసం అమ్ముకునే వ్యక్తి) తన తల్లిదండ్రుల వల్లే తనకు జ్ఞానం కలిగిందని కౌశిక మహామునికి చెబుతూ తల్లిదండ్రుల ఔన్నత్యాన్ని వివరిస్తాడు.

 

 వీరె దైవమ్ము వీరి సేవించుకొనుటె

 దైవసేవ వీరు వసించు తావె దైవ

 మందిరమ్మన్న భక్తితోనుందునయ్య

 నాదు సంపత్తికిదె కారణమ్ము నిజము

 - పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

 (ధర్మభిక్ష ,ఉపదేశ ఖండం)

 

 తండ్రి ఔన్నత్యం

యాశ్యత్యద్య శకుంతలే తి హృదయం సంస్పృష్టముత్కంఠయా

 కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషశ్చింతాజడం దర్శనం

 వైక్లబ్యం మమ తావ దీదృశమహో స్నేహాదరణ్యౌకసః

 పీడ్యంతే గృహిణః కథం ను తనయావిశ్లేషదుఃఖై ర్నవైః

 (కాళిదాస విరచిత అభిజ్ఞాన శాకుంతలం, చతుర్థాంకం)

 ఈరోజు శకుంతల అత్తవారింటికి వెళ్లిపోతోందంటే నా హృదయం ద్రవిస్తోంది. కన్నీరు ఏకధాటిగా వస్తూండటం వల్ల గొంతు గాద్గదికమవుతోంది. నా చూపుకి జడత్వం వచ్చింది. ఆ బాధతో నా శరీరం పనిచేయడం లేదు.  

 

 వీరూ తండ్రులే

తనర జనకుండు అన్నప్రదాతయును

 భయత్రాతయును ననగ నింతులకు మువ్వురొగిన గురువులు

 వీరలనఘ యుపనేత కియ్యేవురుననయంబును గురువులు...  

 అని ఐదుగురికి తండ్రి స్థానం ఉందని శకుంతల దుష్యంతుడికి చెబుతుంది.

 (మహాభారతం) (ఇక్కడ గురువు అంటే తండ్రి అని అర్థం)

 జన్మనిచ్చినవారు, అన్నం పెట్టినవారు, భయాన్ని పోగొట్టినవారు... స్త్రీలకు ఈ ముగ్గురూ తండ్రులతో సమానం. పాపం చేయకుండా కాపాడేవాడు, ఉపనయనం చేసినవాడు... వీరిద్దరూ మగవారికి తండ్రితో సమానం. హరిశ్చంద్రుడికి లేక లేక కలిగిన సంతానానికి మరణ భయం ఏర్పడడంతో, అతడిని కాపాడటానికి విశ్వామిత్రుడు తన తపశ్శక్తినంతా ధారపోసి అతడికి భయాన్ని పోగొట్టి భయత్రాత అయ్యాడు. అలా విశ్వామిత్రుడు తండ్రి అయ్యాడు. రఘువంశీయులు ప్రజలను కన్నబిడ్డలుగా చూసి, వారూ తండ్రులే అయ్యారు. సీతకు జనకుడు జన్మనివ్వకపోయినా, ఆమెను పెంచి పోషించి, విద్యాబుద్ధులు నేర్పి... తండ్రి అయ్యాడు.

 

 పితృస్వభావం


పుత్రుల్ నేర్చిన నేరకున్న  జనకుల్ పోషింతురెల్లప్పుడున్

 మిత్రత్వంబున బుద్ధి శక్తి దురితోన్మేషంబు వారింతురే శత్రుత్వంబు దలంపరు...  

 (భాగవతం సప్తమ స్కంధం - 126ప)పిల్లలు చదివినా, చదవకున్నా తండ్రి వారిని పోషిస్తాడు. స్నేహంగా ఉంటూ వారికి బుద్ధి నేర్పుతాడు. కష్టం కలగకుండా కాపాడతాడు. శత్రుత్వం వహించడు... ఇవి తండ్రి లక్షణాలని భాగవతం చెబుతోంది.

 

 ఆమె మీద పెంచుకున్న ప్రేమ కారణంగా నేనిలా అయిపోతున్నాను. ఆశ్రమవాసిని, సన్యాసిని అయిన నేనే ఇలా బాధపడుతున్నానంటే, కన్నతండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో కదా!  అంటాడు కణ్వుడు. తండ్రి హృదయాన్ని ఎంతో సున్నితంగా చిత్రించాడు ఈ శ్లోకంలో కాళిదాసు. భారతీయ సాహిత్యంలో తండ్రి ఔన్నత్యాన్ని చిత్రించే శ్లోకం ఇంతకు మించినది మరొకటి లేదని విమర్శకారులు అంటారు. ఎంత  గంభీరంగా ఉండేవారైనా, ఎంతటి వేదాంతి అయినా సంతానం దగ్గర లొంగిపోతారనడానికి ఇదే నిదర్శనం.

 

 ఉండదగినవి...

 తండ్రి విషయంలో... ఉత్తమ తండ్రుల పరంపర కొనసాగాలి. పాలకుల విషయంలో... రఘువంశ మహారాజులలాగ ప్రజలను కన్నబిడ్డలుగా చూసేవారు ఉండాలి. ఋషుల విషయంలో... ఋషి అంటే జ్ఞానాన్ని బోధించి శిష్యులను తండ్రిలా కాపాడేవారు ఉండాలి. అలా ఈ పరంపరలన్నీ కొనసాగాలి.

 

 ఇలా ఉండకూడదు...

 ధృతరాష్ర్టుడు... తన సంతానం ఎన్నిఅరాచకాలు చేస్తున్నా వారి తప్పులను సమర్థించడంతో కౌరవులు తప్పులు చేస్తూ, వంశనాశనానికి కారకులయ్యారు. ఆదిలోనే ధృతరాష్ర్టుడు వారి తప్పులను ఖండించి, శిక్షించి ఉంటే ఆ వంశ పరంపర కొనసాగేది. గుణనిధి తండ్రి అయిన యజ్ఞదత్తుడు రాచకార్యాలలో మునిగిపోయి, పిల్లవాడి బాగోగులు పట్టించుకోలేదు. గుణనిధి దులవాట్లకు బానిసయ్యాడు. పిల్లవాడి మీద వాత్సల్యంతో గుణనిధి తల్లి, పిల్లవాడి తప్పులను కప్పిపుచ్చింది. తండ్రులు ఎన్ని బాధ్యతలలో తలమునకలైనా, పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని ఈ వృత్తాంతం చెబుతోంది.తండ్రి అంటే డబ్బు సంపాదించి, అవసరాలు తీర్చేవాడు మాత్రమే కాదు. పిల్లలను ఎప్పటికప్పుడు సంరక్షించేవాడని అర్థం చేసుకోవాలి.

 

 ముగింపు

 జరుగుతున్న మార్పుని సహజమని భావించాలే గాని, గతంతో పోల్చడం సరికాదు. ‘మా రోజుల్లో ఇలా ఉండేది కాదు’ అంటూ, పిల్లలను నిందించకూడదు. జరుగుతున్న దానిని పరిణామంగా భావించాలి. పతనం అనుకోకూడదు పెద్దలు. సంతానానికి ఒక వయసు వచ్చాక బాధ్యతలను అప్పగించి, దూరం నుంచీ వారిని గమనిస్తూ వానప్రస్థ ఆశ్రమాన్ని పెద్దలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది.

 - డా. పురాణపండ వైజయంతి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top