సారీ సిస్టర్‌ | women empowerment : special on Sexual Assault | Sakshi
Sakshi News home page

సారీ సిస్టర్‌

Feb 27 2018 11:41 PM | Updated on Jul 23 2018 9:15 PM

women empowerment :  special on Sexual Assault - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఏదైనా మందును కనిపెట్టాక ఎలుకల మీద, పందుల మీద ప్రయోగించి చూస్తారు. దాన్ని ల్యాబ్‌ టెస్టింగ్‌ అంటారు. కాసిన్ని రోజులు ఈ మగాళ్ల బుద్ధి మీద కూడాల్యాబ్‌ టెస్టింగ్‌ చేస్తే... వేధింపులకు విరుగుడు మందు కనిపెట్టేందుకువీలవుతుందేమో!! అప్పుడు మహిళలపై ఈ హెరాస్‌మెంట్‌లు, అత్యాచారాలు తగ్గుతాయేమో! ప్రయోగమేగా.. చేసి చూస్తే ఉపయోగమేగా!

‘‘ఈ నర్సు చాలా బాగా పని చేస్తుంది. తను డ్యూటీలో ఉంటే మాకు మా అనారోగ్యం విషయమే గుర్తుండదు. వేళకి వచ్చి మందులు అందరూ ఇస్తారు. కాని ఈ నర్సు మాత్రం నవ్వుతూ, కబుర్లు చెబుతూ చేదు మందులు మాతో తాగిస్తుంది, నొప్పి తెలియకుండా ఇంజెక్షన్‌ చేస్తుంది’’. నర్సు సమత గురించి ఆ ఆసుపత్రిలో అందరూ అనే మాట ఇది. అలాంటి ‘సేవా’ సమత జీవితంలోకి ఊహించని కష్టం ఒకటి వచ్చింది.  ఆ కష్టాన్ని ‘సాక్షి’తో పంచుకుంది.   

తప్పు చేస్తున్న అతడు నా నుంచి తప్పించుకోవాల్సింది పోయి, ఏ తప్పూ చేయని నేను అతడి నుంచి తప్పించుకోవాల్సి వస్తోంది! 

మాది సాధారణ కుటుంబం. ఇంట్లో అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, నేను ఉంటాం. నాన్న కూలి పని చేస్తారు. అమ్మ ఒక స్కూల్‌లో ఆయాగా పని చేస్తోంది. అన్నయ్య నాన్నతో పాటే కూలి పనికి వెళ్తాడు. అక్కయ్య ఒకరి ఇంట్లో పిల్లల్ని చూసుకునే పనికి కుదిరింది. ఉదయానే వెళ్లి, తిరిగి రాత్రికి ఇంటికి వచ్చేస్తుంది. అందరం కష్టపడితేనే గాని ఇల్లు గడవదు కనుక, నేను కూడా ఉద్యోగం చేయాలని నిశ్చయించుకున్నాను.చిన్నప్పట్నుంచీ నాకు సేవా మార్గం ఇష్టం. నా అభిరుచిని తెలుసుకుని నాకు నర్స్‌ ట్రయినింగ్‌ ఇప్పించారు నాన్న. తెలిసిన వాళ్ల ద్వారా విజయవాడలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా చేరాను. నా మనసుకి నచ్చిన పని దొరకడం వల్ల, అందరికీ నచ్చేట్లు సేవ చేసే భాగ్యం దొరికింది నాకు.  ఉద్యోగంలో చేరిన ఏడాదికే ప్రమోషన్‌ వచ్చింది. జీతం కూడా  పెరిగింది. మా ఇంటి పరిస్థితి కూడా కొద్దికొద్దిగా మెరుగుపడుతూ వచ్చింది. మా ఆసుపత్రి యజమాని.. సిబ్బందిని బాగా చూసుకునేవారు. అందుకే ఏ సమస్య, ఇబ్బంది వచ్చినా ఆయనకు నేరుగా చెప్పుకునేవాళ్లం. ఆయనే పరిష్కరించేవారు. అవసరం అయితే డబ్బు సహాయం కూడా  చేసేవారు. అక్కడ బాగా సౌకర్యంగా ఉండటంతో, ఎంతో హుషారుగా ఉద్యోగం చేసుకుంటున్నాను. ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి.
     
ఉద్యోగం సాఫీగా సాగుతున్న ఆ సమయంలో.. మా హాస్పిటల్‌ లేబరేటరీలో రమేశ్‌ (పేరు మార్చాం) అనే వ్యక్తి టెక్నీషియన్‌గా చేరాడు. వాస్తవానికి నర్సులకి, ల్యాబ్‌ వాళ్లకి సంబంధం ఉండదు. కాని అతడు కావాలని మా వార్డుకి వస్తుండేవాడు. ఏదో ఒకటి కల్పించుకుని నాతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. నేను స్పందించకపోతే, డబుల్‌ మీనింగ్‌ మాటలతో నన్ను వేధించేవాడు. తనని పెళ్లి చేసుకొమ్మని సతాయించేవాడు. అప్పటికే అతడికి పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనవసరంగా గొడవ పడటం ఎందుకని, ‘‘నీకు పెళ్లి అయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు, ఇలా ప్రవర్తించడం సరికాదు’’ అన్నాను. వినలేదు. గట్టిగా చెప్పాను. వినలేదు. తిట్టాను. వినలేదు. ఎంత చేసినా అతడు నన్ను వేధించడం మానలేదు. ఎవరికైనా ఫిర్యాదు చేద్దామంటే, నా దగ్గర సాక్ష్యాధారాలు ఉండాలి. ‘ఇలా అన్నాడు’ అని ఒక స్త్రీ చెబితే నమ్మే లోకమా ఇది! పైగా ఆమెకే తప్పును అంటకడుతుంది. 
  
రోజులు గడుస్తున్నాయి. తప్పు చేస్తున్న అతడు నా నుంచి తప్పించుకోవాల్సింది పోయి, ఏ తప్పూ చేయని నేను అతడి నుంచి తప్పించుకోవాల్సి వస్తోంది! హాస్పిటల్‌కి రావడానికే భయం వేసేంతగా అతడు నన్ను హడలుకొట్టేస్తున్నాడు. నాకెంతో ఇష్టమైన ఉద్యోగాన్ని కూడా అతడు చేసుకోనివ్వడం లేదు. మనశ్శాంతి కరువైంది. స్టాఫ్‌ కూడా నన్ను గమనించారు. ‘‘ఏంటి.. సమతా అలా ఉంటున్నావు?’’ అని అడిగారు. ఏం లేదన్నాను. చెప్పుకునే విషయమా అది. కానీ చెప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని అతడే తీసుకొచ్చాడు. 
  
ఓరోజు రాత్రి నేను డ్యూటీలో ఉన్నాను. ఏదో పని ఉన్నట్లుగా అతడు మా వార్డుకి వచ్చాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ.. నా నడుం మీద చెయ్యి వేశాడు! చేతిని విసిరికొట్టాను. మళ్లీ అలాగే చేయబోయాడు. తీవ్రంగా ప్రతిఘటించాను. అయినా వదల్లేదు. నన్ను గట్టిగా హత్తుకోబోయాడు. అతడి అసభ్య ప్రవర్తన తట్టుకోలేకపోయాను. ఉపేక్షించి లాభం లేదనుకుని, చెప్పుతో చెంప ఛెళ్లుమనిపించాను.దాంతో అతడి ఇగో దెబ్బతిన్నట్లుంది. ఊహించని విధంగా, పక్కనే ఉన్న పూల కుండీని ఎత్తి నా తలపై కొట్టాడు. నేను కళ్లు తిరిగి పడిపోయానని, అతడు అక్కడ నుంచి పారిపోతుంటే తామే పట్టుకున్నామని నా తోటి నర్సులు, మిగతా వార్డు బాయ్స్‌ ఆ తర్వాత చెబితే తెలిసింది. నేను స్పృహలోకి వచ్చాక అక్కడే ఉన్న మిగతా సిబ్బంది నన్ను ఎమర్జెన్సీ వార్డుకి తీసుకువెళ్లారు. చికిత్స చేయించారు. ఇంత గొడవ జరగడంతో విషయం మా పైఅధికారులకు తెలిసింది. తక్షణమే అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించి పోలీసులకు అప్పగించారు. అతడి భార్యబిడ్డలు వీధులపాలవుతారనే ఉద్దేశంతో అన్ని రోజులు నేను ఓపిక పట్టాను. అతడి ప్రవర్తన రానురాను భరించలేని స్థితికి రావడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల వరకు వెళ్లవలసి వచ్చింది. 

యాజమాన్యం గమనిస్తుండాలి
ప్రతి సంస్థలోను లైంగిక వేధింపుల నిరోధక కమిటీ ఉండాలి. అది ప్రభుత్వ సంస్థ అయినా, ప్రభుత్వేతర సంస్థ అయినా ప్రతిచోట తప్పనిసరిగా ఉండాలి. అందులో సంస్థ ఉద్యోగులతో పాటు, ఎన్జీవో సంస్థల నుంచి ఒకరు కౌన్సెలర్‌గా ఉండాలి. ఈ కేసులో నర్సు సమత తలపై ల్యాబ్‌ టెక్నీషియన్‌ పూలకుండీ ఎత్తి పడేసేవరకు వచ్చింది! ముందుగానే పర్యవేక్షణ వ్యవస్థ ఉండి ఉంటే, ఇంతవరకూ వచ్చేది కాదు. స్త్రీలను లైంగికంగా వేధిస్తే, ఎటువంటి శిక్షలు పడతాయో వాటి మీద మగ ఉద్యోగులకు యాజమాన్యమే అవగాహన కలిగేలా చేయాలి. అప్పుడు తప్పు చేయడానికి భయపడతారు. 
– ‘అంకురం’ సుమిత్ర, సామాజిక కార్యకర్త

విచారణ వెంటనే ప్రారంభించాలి
ఆడవాళ్ల విషయం వచ్చేటప్పటికి.. నిప్పు లేనిదే పొగరాదనే సమాజం మనది. ఫిర్యాదు చేసినా బాధితురాలినే అనుమానిస్తారు. ‘నిన్ను లైంగికంగా వేధించాడంటే, నువ్వు ఆ వ్యక్తిని ప్రోత్సహించడం వల్లే జరిగింది’ అని కూడా నిందిస్తారు. మరికొందరు.. ‘ఇష్టం లేని విషయాలను నేను పట్టించుకోకుండా తిరిగితే నా జోలికి రారు. నా రిజెక్షన్‌ అర్థం చేసుకున్నారు, వ్యతిరేకించడం కంటే ఇదే మేలు’ అనే భ్రమలో ఉంటారు. ‘నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నాను’ అనుకుని ఫిర్యాదుకు జంకేవారు మరికొందరు. సాధారణంగా ఏదైనా ఇబ్బంది వస్తే ముందుగా కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో చెప్పుకుంటారు. అంతా విన్నాక వారు... ‘చిన్నచిన్న’ విషయాలు పట్టించుకోవద్దు అని తేల్చేస్తారు. ‘ఇంత చిన్న విషయాన్ని ఇష్యూ చేస్తే మన ఇన్‌స్టిట్యూట్‌కు చెడ్డపేరు వస్తుంది’ అంటారు కంపెనీ పెద్దలు. అవతలివారు అసభ్యంగా మాట్లాడుతుంటే, ‘నాకు ఇష్టం లేదు’ అని చెప్పడం ‘చిన్న విషయం’ కాదు ‘పెద్ద విషయం’ అని తెలియచెప్పాలి. అలా చెప్పకపోగా ఈ సంఘటనను ఎవ్వరూ ఖండించరు. దాంతో ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఉండిపోయే పరిస్థితి వస్తుంది.  ‘సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ప్రివెన్షన్‌ కమిటీ’ ప్రతి ఆఫీసులోనూ ఉండాలనే చట్టం ఇంకా ప్రా«థమిక స్థాయిలోనే ఉండడం కూడా ఇందుకొక కారణం. ఏదైనా కారణం చేత ఆలస్యంగా ఫిర్యాదు చేస్తే, ‘అప్పుడెందుకు ఫిర్యాదు చేయలేదు, ఇప్పుడెందుకు చేస్తున్నావు?’ అని ప్రశ్నించకూడదు. ఎప్పుడు ఫిర్యాదు చేశారు అనేది ప్రధానం కాదు. రిపోర్టు ఇచ్చిన వెంటనే విచారణ చేయాలి. 
– దేవి, సాంస్కృతిక కార్యకర్త
(సమత కేస్‌ స్టడీ) – వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement