మా మంచి వదినమ్మ

Sujatha Who Has Acted in all the Languages of The Actress - Sakshi

బాలనటిగా మురిపించింది. సినిమా నటిగా మెరిపించింది. టీవీ నటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కేరళ కుట్టి అయినా తెలుగమ్మాయే అనిపించింది. ఇప్పుడు తెలుగిళ్లలో ‘మా’టీవీ ద్వారా ‘వదినమ్మ’గా తన స్థానం సుస్థిరం చేసుకోనుంది. ఆ వదినమ్మ పేరు సుజిత. తీరైన కట్టూ బొట్టుతో.. నిండైన రూపంతో ఆకట్టుకుంటున్న సుజిత ‘సాక్షి’ పాఠకులతో పంచుకుంటున్న భావాలు ఇవి.

‘బాలనటిగా, నటిగా అన్ని భాషల సినిమాల్లోనూ చేశాను. కానీ, ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. అలా తెలుగువారికి నేను బాగా కనెక్ట్‌ అయ్యాను. సినిమాల్లో చేసినా నన్ను ఇంటింటికీ చేరవేసింది మాత్రం ‘కలిసుందాం రా’ సీరియల్‌. అప్పడు నేను తొమ్మిదవ తరగతిలో చేరబోతున్నాను. ఆ సమయంలో బాలాజీ టెలీఫిలిమ్స్‌ నుంచి ఈ ఆఫర్‌ వచ్చింది. అంత చిన్న వయసులో కాలేజీ చదివే అమ్మాయిలా, ఆ తర్వాత భార్యగా, ఉమ్మడి కుటుంబంలో కోడలిగా.. లీడ్‌ రోల్‌ పోషించాను. వయసుకు మించి మెచ్యూరిటీ చూపించడం ఆ సీరియల్‌ నాకు నేర్పింది. ఇప్పుడు 30 ఫ్లస్‌లో ఎలా ఉన్నానో అలా ఆ వయసులోనే సీరియల్‌లో కనిపిస్తాను. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, కుటుంబసభ్యులతో ఎలా ఉండాలి... ఇలా ఎన్నో విషయాలను ఆ సీరియల్‌ నాకు నేర్పించింది.

కాలేజీ చదువు మిస్‌ అయ్యాను
స్కూల్‌ ఏజ్‌లోనే సీరియల్స్‌లోకి ఎంటర్‌ అయినప్పటికీ ఎప్పుడూ స్కూల్‌ డేస్‌ని మిస్‌ అవలేదు. అలా ప్లాన్‌ చేశారు అమ్మానాన్న. స్కూల్‌ ఉన్నప్పుడు క్లాస్‌కి, లేదంటే షూటింగ్‌కి అన్నట్టుగా ఉండేది. ఆ తర్వాత కాలేజీ చదువు మాత్రం రెగ్యులర్‌గా వెళ్లడం కుదరక మద్రాస్‌ యూనివర్శిటీ నుంచి ప్రైవేట్‌గా కట్టి చదివాను. మా చెల్లెలి కాలేజీ లైఫ్‌ చూశాక మాత్రం నేను కాలేజీ చదువుని, టీనేజ్‌ లైఫ్‌ని మిస్‌ అయ్యాను అని చాలా బాధపడ్డాను. 

టీవీ వదినమ్మ
‘పండియాన్‌ స్టోర్స్‌’ అని తమిళ్‌లో సీరియల్‌ చేస్తున్నాను. అది 200 ఎపిసోడ్స్‌ వైపుగా వెళుతూ మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సీరియల్‌ను తెలుగులో ‘వదినమ్మ’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఈ ఆఫర్‌ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాను. ఫ్యామిలీతో గడిపే సమయం తగ్గిపోతుందని. కానీ, ఈ విధంగా మరోసారి తెలుగువారికి దగ్గరకావచ్చు అనిపించింది. అదీ గాక వదినమ్మ రోల్‌ నన్ను బాగా ఆకట్టుకుంది. మన సంస్కృతి ప్రత్యేకత అంతా ఉమ్మడి కుటుంబంలోనే ఉంటుంది. అమ్మకు సమానంగా ఉంటుంది ఆ రోల్‌. ఆ కుటుంబం అంతా ఆమె చెప్పినట్టుగా వింటుంది. ‘వదినమ్మ’ సీరియల్‌లో వదిన పాత్ర పేరు ధనలక్ష్మి. పల్లెటూరిలో పుట్టిపెరిగిన అమాయకత్వం గల అమ్మాయి. కుటుంబం అంటే ఎంతో అభిమానం. సంప్రదాయ బద్ధంగా చీరకట్టు, పెద్ద బొట్టు, గాజులు.. చూడగానే దండం పెట్టాల్సినంత గౌరవంగా ఉంటుంది ఆ పాత్ర.

రియల్‌ లైఫ్‌లో వదినమ్మ
మా వారికి తోబుట్టువు ఒక్కరే. అది కూడా తనకు అక్క. మా ఆడపడుచు నాకు వదిన. అమ్మవాళ్లింట్లోనూ అన్నయ్య పెద్ద. (నవ్వుతూ) రియల్‌ లైఫ్‌లో వదినని కాలేకపోయాను. కానీ, వదిన రోల్‌ మాత్రం చాలా విలువైనది. 

వర్క్‌ – ప్యామిలీ బ్యాలెన్స్‌
పెళ్లికి ముందు ఒకే టైమ్‌లో 2–3 సీరియల్స్‌ చేసేదాన్ని. పెళ్లయ్యాక మాత్రం ఒకటే సీరియల్‌ చేస్తూ అది పూర్తయ్యాకనే మరోటి ఎంచుకుంటున్నాను. ఆ విధంగా నెలలో 10 రోజులు వర్క్‌కి, మిగతా 20 రోజులు ఫ్యామిలీకి అనుకున్నాను. ఇప్పుడు మా బాబు తన్విన్‌ యూకేజీ చదువుతున్నాడు. వర్క్‌ పేరుతో వాడిని మిస్‌ అవ్వకూడదు అనుకున్నాను. కానీ, ఇప్పుడు తమిళ్, తెలుగు సీరియల్స్‌ రెండింటి వల్ల వాడిని కొంచెం మిస్‌ అవుతున్నాను అనిపిస్తోంది. అయితే, ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు చేరువ అవుతున్నానని ఆనందంగా ఉంది. ఈ సీరియల్‌ని ఒప్పుకోవడానికి ముందు మా ఆయన ధనుష్‌తో, అమ్మతో మాట్లాడాను. బాబు పెద్దయి హయ్యర్‌ స్టడీస్‌కి వచ్చాక ఎలాగూ వాడికే కేటాయించాలి. అందుకే ఈ టైమ్‌లో ఇలా అవకాశాలు వస్తున్నాయి అనుకున్నాను.

కోడలుగా అత్తగారితో 
మా అత్తగారు పూర్తిగా పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చిన ఆవిడ. ఆమెనూ అమ్మ అనే పిలుస్తాను. ఆమెతో ఏదైనా సరే మాట్లాడటానికి మొహమాటపడను. ఇద్దరమూ చాలా బాగా ఉంటాం. నాకేదైనా నచ్చకపోతే వెంటనే చెప్పేస్తాను. మా అత్తగారు తమిళ్‌ సీరియల్స్‌ బాగా చూస్తారు. సలహాలు మాత్రం ఇవ్వరు. మా వారు మాత్రం నా డ్రెస్సింగ్‌ కలర్‌ కాంబినేషన్స్‌ గురించి చెబుతారు. మా వారు యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌. తన యాడ్‌ మేకింగ్‌లోనూ నా సజెషన్స్‌ ఉంటాయి. 

క్యాస్టింగ్‌ కౌచ్‌
దాదాపు నేను పుట్టిన దగ్గర నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. నాకంతా గ్రీన్‌గానే ఉంది. ఇండస్ట్రీ అద్దం లాంటిది. మనం ఎలా ఉంటే అది అలా చూపెడుతుంది. గౌరవం వదిలేసుకొని ఎవరూ గౌరవించడం లేదనుకోవడం కరెక్ట్‌ కాదు. ఇప్పుడున్న అమ్మాయిలకు సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఎక్కువ. ఫైనాన్షియల్‌ పరంగానూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉండే అవకాశాలు చాలా తక్కువ. 

ఇష్టాయిష్టాలు
ఖాళీ సమయం దొరికితే సినిమా చూడటం బాగా ఇష్టం. ఎంత అలసటగా ఉన్నా సినిమా చూస్తే చాలు రీ ఫ్రెష్‌ అయిపోతాను. సినిమా తర్వాత లాంగ్‌ డ్రైవ్‌ అంటే పిచ్చి. నా లైఫ్‌ యాంబిషన్‌ ఈ లోకం చివరి అంచుల దాకా వెళ్లి చూడాలి. ట్రావెలింగ్‌ అంటే అంత ఇష్టం. ఇప్పటికి కొన్ని ప్లేస్‌లే చూశాను. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఎక్కడకైనా వెళితే నాకు ఫుడ్‌ ప్రాబ్లమ్‌ లేదు, వాతావరణం మార్పుల గురించి చింత లేదు. అందుకే టైమ్‌ దొరికితే ట్రావెలింగ్‌ వైపు మొగ్గు చూపుతాను.’
నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top