రంగస్త్రీలం | special story to stage artist Jamunarayalu | Sakshi
Sakshi News home page

రంగస్త్రీలం

May 2 2018 12:39 AM | Updated on May 2 2018 12:39 AM

special story to stage artist Jamunarayalu - Sakshi

జమునారాయలు 

పాత్రలోకి వచ్చాక తమను తాము మర్చిపోయినవారే నటులుపాత్రలో పాత్ర కనపడుతుందిపాత్ర వెనక జీవితంలో ఉన్న కష్టం కప్పి పుచ్చుతుందిఆడుతున్న గుండె మీద బంగారపు పూత పూసినట్టు
గుండె పగిలిపోతున్నా ధగధగమని మెరవవలసిందేపూత అన్నం పెట్టింది... పాత్ర కీర్తినిచ్చిందికానీ గర్భం ఇంకా దుఃఖస్మృతులతో కన్నీరు పెడుతూనే ఉందిపాత్రను చూసి చప్పట్లు కొట్టేవాళ్లు ప్రేక్షకులైతే జమునారాయల జీవితం చూసి చప్పట్లు కొట్టేవాళ్లం మన మందరం.

ఆమె తాను పుట్టిన 21వ రోజునే ఊయలలో కృష్ణుడి వేషంతో రంగస్థల ప్రవేశం చేశారు.ఎనిమిది సంవత్సరాల వయసుకే ఇంటికి ఆధారం అయ్యారు.వయసు వచ్చాక, అందమైన అమ్మాయి ఎదుర్కొనే సమస్యలన్నీ ఎదుర్కొన్నారు.తెర ముందు నారదుడి వేషం వేస్తూనే తెర వెనుక పసిబిడ్డకు పాలిచ్చారు.నాటకాలు వేస్తూనే తల్లి అయ్యారు... ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్నారు.పురుషాధిక్యంతో ఎంతో నష్టపోయారు. అయినా దీక్ష విడిచిపెట్టలేదు.ఆమె సురభి జమునా రాయలుహైదరాబాద్‌లో ఇటీవల శ్రీకృష్ణుడు, సత్యభామ అర్ధనారీశ్వర వేషం వేసిన సందర్భంగా  సాక్షితో పంచుకున్న అనుభవాలు ఆమె మాటలలోనే.‘‘సురభిలో కుటుంబంలో పుట్టిన ప్రతివారు అన్ని రకాల పాత్రలు పోషిస్తారు. కృష్ణుడిని తట్టలో పెట్టుకుని వసుదేవుడు గోకులానికి బయలుదేరిన సీన్లో నేను బాలకృష్ణుడిగా రంగ ప్రవేశం చేశాను. అప్పుడు నా వయసు 21 రోజులు. ఆ తరవాత చాలా బాల వేషాలు వేశాను. నాన్నగారి దగ్గర హరికథలు నేర్చుకున్నాను. పద్నాలుగు సంవత్సరాలకే వివాహం కావడంతో ‘గజపతి నాట్య కళా సమితి’ కుటుంబంలో ఐదవ కోడలిగా అడుగు పెట్టాను. ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేసరికి ఐదుగురు పిల్లలు పుట్టుకొచ్చారు. కాని మిగిలింది ఇద్దరు మాత్రమే’’. 

దవడ వాచిపోయింది...
‘‘ఒకసారి నారద పాత్ర పోషిస్తున్న సమయంలో, పసిపిల్లకు పాలివ్వడం కోసం లోపలకు, బయటకు తిరిగాను. ఆ హడావుడిలో ఒక చిడత ఎక్కడో వదిలేశాను. ఒక్క చిడత మాత్రమే ఉంది. రెండో చిడత వెతుక్కుని రంగస్థలం మీదకు కొంచెం ఆలస్యంగా వచ్చాను. వేదిక అని కూడా చూడకుండా మా పెద్దవాళ్లు నా చెంప ఛెళ్లుమనిపించారు. వాచిన బుగ్గతోనే నారదుడి పాత్ర వేశాను. నాటకాల పట్ల నిబద్ధత పెరగడానికి ఇలాంటి క్రమశిక్షణ కారణం’’

దుస్తులు తడిసిపోయాయి... 
‘‘నేను నాటకాలలో అన్నీ పురుష పాత్రలే ధరించేదాన్ని. అందువల్ల  స్త్రీ సహజ లక్షణాలు కనపడకుండా   వస్త్రాలు బాగా బిగించి ధరించేదాన్ని. ఆరోజు నేను మగ పాత్ర వేయాలి. మేకప్‌ వేసుకోవడానికి ముందే మా చిన్నమ్మాయికి పాలిచ్చాను. మేకప్‌ వేసుకుని,  రంగస్థలం మీదకు వచ్చాను. చాలాసేపటి వరకు లోపలకు వెళ్లలేకపోయాను. ఆకలికి పసిపాప గుక్క పెట్టి ఏడుస్తోంది. మాతృ సహజమైన మమకారం లోపల నుంచి పొంగుకొచ్చింది. నా దుస్తులన్నీ క్షీరధారలతో నిండిపోయాయి. బిడ్డ ఆకలిని తీర్చలేకపోతున్నందుకు నేను ఎంత నరకం అనుభవించానో. నాటకం చూస్తున్న ప్రేక్షకులలో నుంచి ఒకరు, ‘అమ్మా! మీరు లోపలకు వెళ్లండి, పసిబిడ్డ ఏడుస్తోంది, ఆ బిడ్డకు పాలిచ్చి రండి’ అన్నారు. మేం నమ్ముకున్న వృత్తి కోసం ఎంత బాధపడతామో, ఎంత కష్టపడతామో తెలియచెప్పడానికే ఈ విషయం చెబుతున్నాను.

ఎన్ని చేదు అనుభవాలో...
‘‘అప్పుడు నిండు చూలాలిని. స్టేజ్‌ మీద మన్మధుడి వేషం వేస్తున్నాను. మన్మధుడి పాత్ర అంటే రంజింపచేయాలి. ఒకవైపు నొప్పులు వస్తున్నాయి. కళ్లలో నుంచి  చుక్క నీరు కూడా రావడానికి వీలులేదు.  నన్ను లోపలకు పిలిచి ఏదో కషాయం ఇచ్చారు. తాగుతానే నొప్పులు ఆగిపోయాయి. అలాంటి కష్టమైన సమయాల్లో కూడా నటించాను. మరో సంఘటన – ఒక వారం రోజులు వరుసగా నాటకాలు ఒప్పుకున్నాను. అప్పటికే నన్ను నమ్ముకుని లక్షరూపాయల టికెట్లు అమ్మారు. నాటకం ఇంకా మూడు రోజులుందనగా  మూడో పాప యాక్సిడెంట్‌లో మరణించింది. తల్లిగా నా హృదయం రోదించింది. నాటకం వేసి తీరాలి. మనసు బండరాయిగా మార్చుకున్నాను. బాధను కడుపులోనే మింగి వరుసగా నాటకాలు ప్రదర్శించాను. అవి కూడా సతీసావిత్రి, వర విక్రయం, సత్యహరిశ్చంద్ర నాటకాలు. మూడు నాటకాలలోనూ మరణ సన్నివేశాలున్నాయి. ఆ సన్నివేశాలలో నా పాప గుర్తుకొచ్చి ఎంత ఏడ్చానో చెప్పలేను’’

సహించలేకపోయారు...
నేను నమ్ముకున్న వృత్తి నాటకం. కృష్ణుడి పడక సీన్‌ నుంచి రాయబారం వరకు అన్ని వేషాలు వేశాను.   ద్రౌపది పాత్ర పోషించి, అందరి ప్రశంసలు అందుకున్నాను. కాని బయటి నాటక సమాజాలు నాకు వేషం ఇవ్వలేదు. ఇటువంటి ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి. 

స్త్రీలను ప్రోత్సహించిన సురభి...
130 సంవత్సరాల చరిత్ర కలిగిన సురభి నాటక సంస్థ స్త్రీ అభ్యుదయానికి, అభ్యున్నతికి, స్త్రీ స్వేచ్ఛకి పెట్టింది పేరు. స్త్రీని ఉన్నతంగా చూపారు. స్త్రీ పాత్రలు స్త్రీలే వేయాలని, కుటుంబ స్త్రీలు బయటకు రావాలన్నారు. నేడు మాత్రం ఆడవారు ప్రశంసలు పొందితే, పురుషులు సహించలేకపోతున్నారు. వెనక్కు లాగే చేతులు ఉంటాయి.  ముందుకు వెళ్లాలి మనం. అందుకే నేను ఈ రంగంలో విజయం సాధించగలిగాను.

విలక్షణ ప్రయోగం...
నాటకరంగ చరిత్రలో ఎవ్వరూ చేయని ప్రయోగం చేశాను. ఒక పక్క సత్యభామ, మరోపక్క కృష్ణుడు... రెండు పాత్రలను నేనే గంటసేపు నటించాను. డ్రెస్సింగ్, మేకప్, అన్నీ నేనే. అందరూ మెచ్చుకున్నారు, ఒప్పుకున్నారు. కాలేజీలలో డెమో ఇవ్వాలనుకున్నాను. ఏ యూనివర్సిటీలవారు నాకు అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశ చెందాను. 

నా జీవితమే నా చదువు...
‘‘డిగ్రీలు చదవకపోయినా, జీవితాన్ని బాగా చదివాను. జీవితం నుంచి నేర్చుకున్నదే పాత్రలుగా మలుచుకున్నాను. కాని నాటకం అన్నిసార్లు అన్నం పెట్టలేదు. సురభి కంపెనీ మూసేశాక పిల్లలు, భర్తతో బయటకు వచ్చేసి, నా దగ్గర ఉన్న బంగారం అమ్మి, నా భర్తకు ఆటో కొని ఇచ్చాను. కాని లాభం లేకపోయింది. అటువంటి పరిస్థితిలో నేను ఇతర కంపెనీలలో ఔత్సాహిక కళాకారులతో పనిచేయడం ప్రారంభించాను. అక్కడ కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను.
– సంభాషణ: డా. పురాణపండ వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement