శాక రాజం – వంకాయ

Special story to Brinjal - Sakshi

ఆయుర్‌ ఫ్యాక్ట్స్‌

వంకాయకు మన భారతదేశమే పుట్టినిల్లు. ప్రాచీన కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ శాక రాజం, ఆధునిక యుగంలో కూడ అగ్రస్థానంలో నిలిచింది. తెలుగువారితో విడదీయరాని బంధం ఏర్పరచుకొంది. ‘వంకాయ వంటి కూరయు, లంకాపురి‡ వైరి వంటి రాజుంగలడే...’ అన్న ఒక చాటువులోని పద్య పాదాలు ఈ కూర ఔన్నత్యానికి ప్రతీకలు. ఆయుర్వేదంలో కూడా దీనికి విశిష్ట స్థానం ఉంది. 
సంస్కృతంలో పర్యాయపదాలు...వృంతాక, నీలఫలా, రక్తఫలా, శాకబిల్వ, రాజ కూష్మాండ, వంగణ, అంగణ, సింహీ మొదలైనవి. దీనినే వార్తాక అని కూడా అంటారు. అయితే ఆయుర్వేదంలో, వాకుడు (కంటకారీ) మొక్కని కూడా వార్తాకమంటారు. ఇది గుర్తుంచుకొని సందర్భోచితంగా అర్థం చేసుకోవాలి. ఇది లె లుపు, ముదురు + లేత నీలి రంగులలోనూ లభిస్తుంది. చిన్నవిగాను, పెద్దవిగాను, గుండ్రంగాను, కోలగా కూడా ఉంటాయి. వంకాయను అమెరికా, ఆస్ట్రేలియాలలో ‘ఎగ్‌ ఎలిఫెంట్‌’ అనీ, దక్షిణాఫ్రికా, ఆసియా ఖండాలలో ‘బ్రింజాల్‌’ అనీ పిలుస్తుంటారు. పోర్చుగీసు భాషలో దీనిని ‘బెరింగేల’ అంటారు. వీటి వ్యాపార సమయంలో వారు పలికే భాష రూపాంతరం చెంది ‘బ్రింజాల్‌’గా మారింది. వంకాయలోని పోషక ఔషధ విలువల్ని ఆయుర్వేద సంహితాకారులు ఈ విధంగా వివరించారు...

వృంతాకం స్వాదు తీక్షో›్ణష్ణం కటుపాకమపిత్తలం
జ్వరవాత బలాసఘ్నం దీపనం శుక్రలం లఘు...
శ్వేత వృంతాకం కుక్కుటాండ సమం భవేత్‌ 
తత్‌ అర్శస్సు విశేషేణ హితం...

వంకాయ రుచికరంగా ఉండి, ఉష్ణకరమై, ఆకలిని పుట్టించి వాత కఫ దోషాలను హరిస్తుంది. తేలికగా జీర్ణమౌతుంది. వీర్యవర్థకం. స్థూలకాయులలో బరువు తగ్గడానికి చక్కటి ఆహారం.నూ¯ð తో వేయించి ఉప్పు కలిపి సేవిస్తే మాత్రం శరీర బరువు పెరుగుతుంది. (ఉడికించిన కూర మంచిది).(తదేవహి గురు స్నిగ్ధం సతైలం లవణాన్వితం)తెల్ల వంకాయ: దీని పోషక విలువలు, కోడిగుడ్డుతో సరిసమానం. ఇది మూలవ్యాధి (అర్శస్సు – పైల్స్‌) తగ్గడానికి చాలా ఉపయుక్తం. దీనితో పోలిస్తే నీలం రంగు వంకాయలో పోషక విలువలు మరింత అధికం.ఆధునిక జీవరసాయన శాస్త్రం: వంకాయలో కొవ్వులు శూన్యం. మాంసకృత్తులు నామమాత్రంగాను, పిండి పదార్థాలు ఓ మోస్తరుగాను ఉంటాయి. 3.5 శాతం శర్కర, మూడు శాతం పీచుపదార్థాలు ఉంటాయి. బీ కాంప్లెక్సు, ఫోలేట్లు, సి, కె, ఎ విటమిన్లు చక్కగా లభిస్తాయి. ఒక శాతం ఐరన్, మూడు శాతం మెగ్నీషియం ఉంటాయి. సోడియం శూన్యం, క్యాల్షియం సమృద్ధిగాను, పొటాషియం అత్యధికంగాను లభిస్తాయి. కాబట్టి బలకరం, స్థౌల్యహరం, సుఖ విరేచనకారి. రక్తపోటుని అదుపు చేసి గుండెకు మేలు చేస్తుంది.

వంకాయను ఎలా వండుకోవాలి...
వేపడం అంత మంచిది కాదు. రుచికరంగా ఉన్నా, నూనెను వేడి చేయడం, ఉప్పు కలపడం ద్వారా మంచి గుణాలు మరుగున పడిపోతాయి. ఉడికించి వండటం శ్రేష్ఠం. దీనిలో కలిపే మసాలాల వైరుధ్యాన్ని బట్టి కూరను పిలిచే పేరు మారుతుంది. ఉదా: కొత్తిమీర, అల్లం కారం, జీలకర్ర కారం, మెంతి కారం, ఉల్లి కారం, వంకాయ + బంగాళ దుంప ముద్ద కూర మొదలైనవి. ఈ రోజుల్లో కనిపించే ‘బగారా బైంగన్‌’ కూరలో మసాలా ఎక్కువగా ఉంటుంది. వంకాయను వెతుక్కోవలసి వస్తుంది. దీనివలన ప్రయోజనం శూన్యం. వంకాయపై (పెద్ద సైజువి) కొంచెం నూనె పూసి, నిప్పులపై కాల్చి, అనంతరం తొక్కను తొలగించి, గుజ్జులా పిసికి, దానికి ‘చింతపండు రసం, ఉప్పు, పచ్చి మిర్చి తగుపాళ్లలో కలిపి, ఇంగువ పోపు, కొత్తిమీర చేర్చి పచ్చడి చేస్తారు. దీనిని ‘వంకాయ పులుసు పచ్చడి’ అంటారు. చింతపండు రసం కలపకుండా చేసే దానిని  ‘చప్ప పచ్చడి’ అంటారు. దీంట్లోకి... వేయించిన అల్లం ముక్కలు, చిన్న సైజు గుమ్మడి లేక పిండి వడియాలు కూడా జోడిస్తారు. ఉత్తర భారతంలో ఈ చప్ప పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, టొమాటో వేయించి కలుపుతారు. దీనిని ‘భడ్తా’ అంటారు. వంకాయతో చుక్కకూర కలిపి వండిన కూర చాలా రుచికరం. తేలికగా జీర్ణమై వాతహరంగా పని చేసి ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద భావప్రకాశ సంహితాకారుడు ఉటంకించాడు.
‘‘చుక్రికా స్యాత్తు పత్రామ్లా రోచనీ శతవేధినీ
... స్వాద్వీ వాతఘ్నీ కఫ పిత్తకృత్‌
రుచ్యా లఘుతరా పాకే వృంతాకేన అతి రోచనీ’

అపోహలు:
చాలామంది వంకాయను ఆరోగ్యానికి శత్రువుగా పరిగణిస్తారు, తినరు కూడా. ఎలర్జీ కలుగుతుందంటారు. ఆయుర్వేద మందులు వాడుతుంటే, ‘వంకాయ, గోంగూర (పుంటి కూర)’ తినకూడదని భావిస్తుంటారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. సత్య దూరం, అశాస్త్రీయం.
గమనిక: ఏ కూరలకైనా పండించిన ప్రదేశం, పోసిన నీరు, వేసిన ఎరువు, ఇతర వాతావరణ పరిస్థితుల్ని బట్టి పోషక విలువలు పోయి, అనారోగ్య కారకమవుతుంది, చేదుగా కూడా ఉంటుంది.

ఆరగించుyì ! వంకాయననుదినంబు
శాకరాజంబు బల్యంబు లోకమందు
తెల్ల వంకాయ గుణముల తీరు జూడ
అర్శ మొలలను పూర్తిగ నణచి వేయు

ఇక అపోహ వలదు సుమ్మి, హృద్యమదియ
పులుసు పచ్చడి రుచి చూడ ముదము గాదె
కూర నుడికించి చేయుము కూర్మి మీర
సమ్మతంబిది! శ్రీరామచంద్ర సమము.
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top