
పిల్లలు స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువగా ఆడుకుంటున్నారా? అయితే వారి మెదడులో అసమతౌల్యం ఏర్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు రేడియొలాజిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా శాస్త్రవేత్తలు. సౌత్ కొరియా విశ్వవిద్యాలయ న్యూరోరేడియాలజీ శాస్త్రవేత్త హ్యుంగ్ సుక్ ఒక పరిశోధన నిర్వహించారు. మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ ఎం ఆర్‌ఎస్) సాయంతో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌లకు బాగా అలవాటు పడ్డ యుక్తవయస్కుల మెదళ్లలో జరిగే మార్పులను పరిశీలించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పరీక్షల ద్వారా ఈ ఆధునిక వ్యసనాల ప్రభావాన్ని అంచనా వేసి మరీ వీరిని ఎంపిక చేశారు. స్మార్ట్‌ఫోన్ వ్యవసనం వీరిలో మనోవ్యాకులత, యాంగ్జైటీ, నిద్రలేమి వంటి మానసిక సమస్యలకు కారణమవుతోందని గుర్తించారు.
ఆ తరువాత వారికి మానసిక శాస్త్రవేత్తల ద్వారా చికిత్స (బిహేవియరల్ థెరపీ) అందించారు. చికిత్సకు ముందు, తరువాత వారి మెదళ్లలోని రసాయన ప్రక్రియలను పరిశీలించినప్పుడు రెండురకాల న్యూరో ట్రాన్స్‌మిటర్లలో తేడాలు కనిపించాయి. వీటిల్లో ఒకటి మెదడులోని న్యూరాన్లు బాగా చైతన్యవంతం చేసేదైతే, రెండోది మెదడు సంకేతాలను మందగింపజేసేది. ఈ రెండో న్యూరోట్రాన్స్‌మిటర్ మన దృష్టి, కదలికలను నియంత్రిస్తుందని అంచనా. చికిత్స తరువాత వీరిలో ఈ సమస్య గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం.