మంచి కుటుంబంతోనే మంచి సమాజం | Relationship of Husband and Wife in Society is The Most Sacred | Sakshi
Sakshi News home page

మంచి కుటుంబంతోనే మంచి సమాజం

Apr 7 2019 1:14 AM | Updated on Apr 7 2019 1:14 AM

 Relationship of Husband and Wife in Society is The Most Sacred - Sakshi

సమాజంలో భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైనది. అసలు ఇదే సృష్టికి మూలం. ఈ బంధం ద్వారానే దైవం మానవజాతిని ఉనికిలోకి తీసుకువచ్చాడు.అందుకే దీనికి ఇంతటి పవిత్రత, ప్రత్యేకత. ఈ బంధం పటిష్టంగా, గౌరవప్రదంగా ఉంటేనే మానవజాతి విజయపథంలో సాగుతుంది. సమాజ నిర్మాణంలో భార్యాభర్తలిద్దరి పాత్రా కీలకమైనదే. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానుబంధాల ద్వారానే మంచి కుటుంబాలు ఉనికిలోకి వస్తాయి. వారిద్దరి సాంసారిక జీవితం, దాని నియమాలు, బాధ్యతలు సరిగా అవగాహన చేసుకుంటేనే ఉత్తమఫలితాల్ని సాధించడానికి వీలవుతుంది. ఆలుమగల మధ్య ఈ విధమైన అవగాహన, పరస్పర ప్రేమానురాగాలు లోపించడం వల్లనే ఈనాడు కుటుంబాల్లో శాంతి కరువైపోతోంది.కుటుంబ జీవితంలో శాంతి కొరవడితే, అది సత్సమాజ నిర్మాణానికి అవరోధంగా పరిణమిస్తుంది. అందుకని భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి.

ఎవరి పరిధుల్లో వారు తమతమ బాధ్యతల్ని నెరవేర్చాలి. స్వేచ్ఛ పేరుతో స్త్రీలు తమ పరిధుల్ని అతిక్రమించకూడదు. అలాగే పురుషులు భార్యలపై పెత్తనం చలాయించకూడదు. సహధర్మచారిణితో సత్పవ్రర్తనతో కూడిన జీవితం గడపాలి. ఆమె హక్కులను విశాల హృదయంతో గౌరవించాలి. ఎందుకంటే, ‘వారితో సత్ప్రవర్తనతో సంసారం చేయండి’(నిసా) అని దైవం ప్రబోధించాడు. భార్య పట్ల సౌమనస్యంతో, ప్రేమాభిమానాలతో ప్రవర్తించాలి. ‘తమ నడవడికలో అందరికంటే ఉత్తములైనవారే విశ్వాసంలో పరిపూర్ణులు. తమ భార్యల పట్ల అత్యంత మంచిగా మెలిగేవారే అందరిలో మంచి నడవడిక కలవారు’(తిర్మిజీ) అని ముహమ్మద్‌ ప్రవక్త ప్రవచించారు:ఒక మనిషి నైతిక ప్రవర్తనను, అతని మంచితనాన్ని గ్రహించడానికి అసలైన గీటురాయి అతడి గృహజీవితమే.

స్వేచ్ఛగా ఉండే గృహజీవితంలోనే మానసిక, నైతిక, ఆర్థిక సంబంధమైన ప్రతి అంశం ముందుకు వస్తుంది. కుటుంబం పట్ల ఔదార్యం, ప్రేమ, దయ కలిగి, కుటుంబానికి మానసిక తృప్తిని, ప్రశాంతతను కలిగిస్తూ ప్రేమాభిమానాలతో ప్రవర్తించినప్పుడే ఒక మనిషి విశ్వాసంలో పరిపూర్ణుడవుతాడు. చిన్న చిన్న విషయాలకే మనసు పాడుచేసుకుంటే కుటుంబాల్లో సుఖసంతోషాలు కనుమరుగైపోతాయి. అందుకని స్త్రీల వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి. అన్ని విషయాల్లోనూ పరస్పర అవగాహన అత్యంత అవసరం. ఈ విధంగా భార్యాభర్తలు ఒకరి హక్కుల్ని ఒకరు గుర్తించి, గౌరవించుకుంటే ప్రాపంచిక జీవితం ఆనందమయం అవుతుంది. పరలోక జీవితమూ సాఫల్యమవుతుంది.
ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement