కనపడని పుండు

Kisfaludy Karoly Story Kanapadani Pundu - Sakshi

కథాసారం

డాక్టరుగారింకా పక్కమీంచి లేవలేదు, నౌకరు వచ్చి చెప్పాడు, ఎవరో తక్షణం చూడాలనుకుంటున్నారని. డాక్టరు తొందరగా డిస్పెన్సరీ గదిలోకి వచ్చాడు. రోగి ఘరానావ్యక్తిలా కనిపిస్తున్నాడు. తీవ్రమయిన బాధ అనుభవిస్తున్నాడని పాలిపోయిన మొహం చెపుతోంది. కుడిచేతిని గుడ్డతో కట్టాడు. బాధ సయించుకునేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా మధ్య మధ్య మూలుగుతూనే ఉన్నాడు.
‘‘వారం దినాలయిందండి. కంటిమీద కునుకు లేదు. రాచకురుపో ఏమో? మొదట్లో లక్ష్యపెట్టలేదు. కానీ క్షణం కూచోలేకపోతున్నాను. గంటసేపు ఇలాగేవుంటే పిచ్చెత్తిపోతాను. వెంటనే ఆపరేషన్‌ చేసెయ్యండి.’’ డాక్టరు ధైర్యం చెప్పాడు. ‘‘ఆపరేషను అవసరమే కాకపోవచ్చు.’’రోగి కష్టం మీద కట్టువిప్పి మళ్లీ అన్నాడు. ‘‘ముందే చెపుతున్నాను. పుండుగానీ వాపుగానీ కనిపించదు. ఇలాంటి రోగం బహుశా మీరు చూసే వుండరేమో!’’ ‘‘కొత్త జబ్బు చూసి ఆశ్చర్యపోయే అలవాటు నాకు లేదు’’ అన్నాడు డాక్టరు. కానీ పరీక్ష చేసిన తరువాత నిజంగా ఆశ్చర్యపోయాడు. తన చేతిలోంచి రోగి

చెయ్యి జారిపోయింది. ‘‘ఏమిటిది? రోగం గుర్తన్నా కనిపించదే! కురుపు కాదు, చిన్న పొక్కన్నా అవుపించదే?’’ రెండు నరాల మధ్య చేతిని చూపాడు రోగి. అతడు చూపిన చోట వేళ్లతో మెల్లగా నిమురుతూ అడిగాడు డాక్టరు. ‘‘ఇక్కడా?’’ ‘‘ఆ.. ప్రాణం పోతున్నాది.’’ డాక్టరు తల వూపేసి పెదవి విరిచాడు. ‘‘చిన్న మచ్చయినా కనిపించదు. నాడీలో సహా ఏ లోపమూ లేదు.’’
‘‘ఇదిగో, ఇక్కడ, రక్తంలా ఎర్రగా.’’ రోగి మొహం తేరిపార చూశాడు డాక్టరు. పిచ్చివాడేమో అని సందేహం కలిగింది. ‘‘మీరు నన్ను పిచ్చివాడనుకుంటున్నారేమో. ఈ పుండు నన్ను బతకనివ్వడం లేదు. అంచేత ఇక్కడ ఆపరేషను చెయ్యండి’’ అంటూ జేబులోంచి (వెయ్యి ఫ్లారిన్‌ బ్యాంకు) నోటు తీసి బల్లమీద పెట్టాడు. ‘‘లక్ష ఇచ్చినా అకారణంగా ఆపరేషన్‌కి సాహసించలేను. నన్ను మూర్ఖుడి కింద జమకడుతుంది లోకం. నిందలపాలయిపోతాను.’’ ‘‘పోనీ నేనే స్వయంగా కోసేసుకుంటాను. ఎడమచేత్తో సరిగ్గా కోయలేనేమో. అంచేత మీరు కొంచెం సరిచేసి కట్టు కట్టిపెట్టండి’’ అంటూ రోగి,

జేబులోంచి చప్పున చాకు తీశాడు. ‘‘ఆగండి, ఏమిటిది? తప్పనిసరి అయితే ఆ కోయడమేదో నేనే కోస్తాను.’’ రోగిని మొహం తిప్పుకొమ్మన్నాడు డాక్టరు. రక్తం కళ్లపడితే భయం కలగడం సహజమని. రోగి అవసరం లేదన్నాడు. కదలకుండా కూచున్నాడు. ఆపరేషను పూర్తయ్యాక నిట్టూర్పు విడిచాడు. ‘‘బాధని కోసి పారేసినట్టు హాయిగా వుంది. బాగా వుక్కపోసిన తరువాత చల్లగాలి తగిలితే ఎలావుంటుందో అలావుంది.’’ తరువాత డాక్టరు రోగిని అతడు బస చేసిన హోటల్లో చూస్తూవచ్చాడు. రోగి ఘరానా కుటుంబం వాడూ, విద్యావంతుడున్నూ కావడం చేత అతడి మీద గౌరవం అభిమానం హెచ్చవుతూ వచ్చాయి. గాయం నయం కాగానే రోగి తన స్వగ్రామం వెళ్లిపోయాడు. మూడు వారాలు గడిచాయి. మళ్లీ డాక్టరు దగ్గరికి వచ్చాడు. మొదటిలాగే చేతికి గుడ్డకట్టు కట్టాడు. మొదటిలాగే బాధపడుతున్నాడు. ‘‘సరిగా అదేచోట బ్రహ్మాండమైనంత బాధగా వుంది. మీరు లోతుగా కొయ్యలేదు. నా చావు దగ్గరపడిందో ఏమో. దయచేసి మళ్లీ ఆపరేషను చెయ్యండి.’’

లోగడ గాయం మానిపోయింది. నాడిలో కూడా ఏ దోషమూ కనిపించలేదు. ‘‘ఇలాంటి జబ్బు నేను ఎన్నడూ చూడలేదు, విననైనాలేదు’’ అన్నాడు డాక్టరు. మళ్లీ ఆపరేషను జరిగింది. అతడి మొహంలో నవ్వు కనిపించలేదు. ‘‘బతికేవుంటే మళ్లీ నెల లోపునే వస్తానేమో.’’ ‘‘ఎందుకలా అధైర్యపడతారు?’’ ‘‘నాకు తెలుసు, అంచేత.’’ డాక్టరు తన స్నేహితుల్తో ఈ వింతసంగతి చెప్పాడు. ఎవరూ తృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. ఒక నెల గడిచింది. రోగి రాలేదు. ఒకనాడు రోగికి బదులు ఉత్తరం వచ్చింది. రోగి పూర్తిగా ఆరోగ్యం పొందివుంటాడన్న ఆనందంతో ఉత్తరం విప్పాడు. ‘‘డాక్టరు గారూ, నా రోగ మూలకారణం విషయంలో మిమ్మల్ని సందేహంలో వుంచదలచుకోలేదు. నా బాధ రెండింతలు, మూడింతలు పెరిగిపోయింది. ఆరు మాసాల క్రితం నా అంత అదృష్టవంతుడు లేడు. ముప్పయి సంవత్సరాల యువకుడికి ఆనందం కలిగించడానికి ఏవేవి కావాలో అవన్నీ నాకున్నాయి. సంవత్సరం కింద పెళ్లి చేసుకున్నాను. నా భార్య అందమైన అమ్మాయి. రేరాణిలాంటి నిర్మలమైన పిల్ల. మా దేశం రాణీగారికీ ఆమెకీ స్నేహం.

ఆమె ప్రేమే నా జీవనంగా ఉండేది. ఆ సౌఖ్యం ఎలా చెప్పేది? ప్రతీదినమూ, గతించిన దినం కంటే బావుండేది. నేను బైటికి వెళితే నా కోసం కిటికీ దగ్గర నుంచుని వుండేది. నేను కళ్లబడగానే గులాబీపువ్వులాగ కళకళ లాడిపోయేది. ఎంచేతో తెలీదు, అదంతా నటన అని నాకు అనుమానం మొదలైంది. మనిషి తన మహానందంలోంచే మూఢుడై దుఃఖాన్ని పైకి తీస్తాడు.  నా భార్య దగ్గర వొక చిన్న టేబుల్‌ వుండేది. దాని సొరుగు తాళాలు ఎప్పుడూ వేసేసి వుంచేది. అది నాకు కష్టంగా వుండేది. ఇంత జాగ్రత్తగా నా దగ్గర దాచుకునే వస్తువ ఏమిటయి వుంటుంది? ఈ సందేహం నన్ను పిచ్చివాణ్ని చేసింది. ఆమె సరళమయిన కనులమీదా నాకు సందేహం పెరిగిపోయింది. ఇదంతా నటన! మోసం!! ఒకనాడు రాణీ మా ఇంటికి వచ్చింది. తనతో కాలక్షేపం చెయ్యడం కోసం నా భార్యని కోటలోకి ఆహ్వానించింది. నన్ను కూడా రమ్మంది. నేను వెళ్లలేదు. సాయంకాలం వస్తానని వుండిపోయాను. వాళ్ల బండి మా గేటు దాటగానే నా భార్య టేబుల్‌ తెరవడానికి ప్రయత్నించాను. కష్టం మీద సొరుగు తెరిచాను. ఆడవాళ్లు వాడుకునే వస్తువులతో నిండివుంది. వాటిల్లో పట్టురుమాలుతో కట్టిన ఉత్తరాలకట్ట వొకటి దొరికింది. చూడ్డంతోనే ప్రణయ లేఖలని తెలిసిపోతుంది. గులాబీరంగు రిబ్బనుతో అందంగా కట్టివున్నాయి.

ఆడవాళ్ల చిన్నప్పటి వస్తువులు పరికించకూడదన్న సంగతి నేను భావించనేలేదు. మా పెళ్లి తరువాతనే ఈ ఉత్తరాలు వచ్చివుంటాయనే నా నిశ్చయం. వొక్కొక్కటే చదవటం మొదలుపెట్టాను. భర్తని మోసం చేస్తూ, నమ్మకద్రోహం చేస్తూ ఘోరంగా వున్నాయి. రాసినవాడు నా స్నేహితుడే. ప్రేమా, పరస్పర సంబంధం ప్రతీ పంక్తిలోనూ కనిపిస్తోంది. నా గుండెల్లో రేగిన తుఫాను వర్ణించలేను. ఉత్తరాలన్నీ యథాస్థానంలో పెట్టేశాను. తాళం వేసేశాను. నాకు తెలుసు, నేను వెళ్లకపోతే నా భార్య ఇంటికి వచ్చేస్తుంది. అలాగే జరిగింది. నేను ఏమీ ఎరగనట్టే నటించాను. భోజనాలయ్యాక పడకగది చేరాము. నాకు మాత్రం నిద్ర రాలేదు. ఎలా వస్తుంది? రాత్రి గంభీరంగా వుంది. అంతటా నిశ్శబ్దం. ఆమెని చంపెయ్యాలి. లేచాను. కుడిచెయ్యి, ఆమె పీకమీద వేశాను. బలమంతా ఉపయోగించి దబాయించి నొక్కాను. ఆమె వొక్కసారే కళ్లు విప్పింది. తెల్లబోతూ నా మొహం చూసింది. మెల్లిమెల్లిగా ఆ కళ్లు మూసుకుపోయాయి. తప్పించుకోవడం కోసం ప్రయత్నించలేదామె. పెనుగులాడలేదు. ఆమె పెదవుల మీంచి వొక రక్తం చుక్క పైకి వచ్చింది. నా చేతి మీద పడింది. రక్తం పడ్డచోటు మీకు తెలుసు.

అంత్యక్రియలు నిరాడంబరంగా ముగించాను. ఎలా చనిపోయిందని ఎవ్వరూ అడగలేదు. హత్య అని అనుమానపడలేదు. శ్మశానం నించి తిరిగివచ్చాక రాణీ మా ఇంటికి వచ్చింది. చెప్పరానంత దుఃఖంతో వుంది. నన్ను వోదార్చడం కోసం ఎన్నో మాటలు చెప్పింది. నాకు వోదార్పు అవసరమే లేదు. కొంతసేపయాక, ‘‘మీతో వొక రహస్యం చెప్పవలసి వుంది. నేను మీ భార్య దగ్గిర వొక వుత్తరాల కట్ట దాచాను. అవి మా ఇంట్లో వుంచడం కుదరlలేదు. దయచేసి అవి నాకు ఇచ్చెయ్యాలి’’ అంది. ‘‘ఏమిటా ఉత్తరాలు?’’ అని అడిగాను. రాణీ కొంచెం కోపం తెచ్చుకుంది. ‘‘మీ భార్య ఉత్తమురాలు. ఏమిటా ఉత్తరాలు అని అడిగిన పాపాన పోలేదు. వాటిని తాను చూడనని కూడా మాట ఇచ్చింది’’ అంది. నేను సిగ్గుపడ్డాను. ‘‘మీ ఉత్తరాలు ఎక్కడున్నాయి?’’ ‘‘తన టేబుల్‌ సొరుగులో వుంచానని చెప్పింది. గులాబీ రంగు రిబ్బనుతో కట్టివుంటాయి పట్టుగుడ్డలో. చూడగానే పోల్చుకుంటాను. అన్నీ మూడు వందల ఉత్తరాలు.’’ ఉత్తరాల కట్ట ఇచ్చేశాను. భయంతో మొహం మీది కెత్తలేదు.  ఆమెని చంపిననాటి రాత్రి రక్తం పడ్డచోట, వారం దినాల తరువాత తేలు కుట్టినట్టు సలుపు మొదలైంది. అనంతరం జరిగినదంతా మీకు తెలుసు. నాకు ఈ శిక్ష కావలసిందే. దీన్ని బాగు చేయించుకోవడానికి ప్రయత్నించను. ఆమె దగ్గరికే వెళ్లిపోతాను. క్షమాపణ చెప్పుకుంటాను. ఆమె నన్ను క్షమిస్తుంది. ఎప్పటిలాగే ప్రేమిస్తుంది. డాక్టరు గారూ, వెళ్లుతున్నాను. సెలవు.’’

కిస్‌ఫలూడీ కరోలి
కిస్‌ఫలూడీ కరోలి (1788–1830) రాసిన ‘కనపడని పుండు’ కథకు ఇది సంక్షిప్తం. సౌజన్యం: నవచేతన పబ్లిషింగ్‌ హౌజ్‌. ఈ కథను 1955లో తెలుగులోకి అనువదించినవారు పురిపండా అప్పలస్వామి. హంగరీ దేశానికి చెందిన కరోలి ప్రసిద్ధ నాటక రచయిత. ఈయన అన్న సాండోర్‌ కిస్‌ఫలూడీకి హంగరీ తొలి భావకవి అని పేరుంది. ముందు గేయాలు, కవితలతో తన కరియర్‌ ఆరంభించిన కరోలి, కొంతకాలం సైన్యంలో పనిచేశాడు. ఎనిమిది మంది సంతానంలో చిన్నవాడు. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. తండ్రితో సంబంధం బాగుండేది కాదు. ఒకమ్మాయిని ప్రేమించినా అది పెళ్లివరకు పోలేదు. పెయింటింగులోనూ కొంతకాలం కృషి చేశాడు. రచయితగానూ చిత్రకారుడిగానూ ముప్పై ఏళ్లవరకూ నిలదొక్కుకోలేదు. ఇంకో అమ్మాయిని ప్రేమించినా అదీ వైవాహిక బంధం కాలేదు. 

కానీ ‘ద తాతార్స్‌ ఇన్‌ హంగరీ’, ‘ఇల్కా, ఆర్‌ ద క్యాప్చర్‌ ఆఫ్‌ ద బెల్‌గ్రేడ్‌’ నాటకాలతో ఒక్కసారిగా గుర్తింపొచ్చింది. తండ్రితో సంబంధాలు మెరుగైనాయి. అరోరా అనే పత్రికను స్థాపించాడు. ఆ కాలపు కొత్త రక్తపు రచయితలు, తర్వాత ప్రసిద్ధులవబోయే ఎందరో కవులకు ఇది వేదిక అయింది. 42 ఏళ్ల వయసులో క్షయతో మరణించేవరకూ కరోలి కూడా తన పత్రికకు విస్తృతంగా రాస్తూనేవున్నాడు. ఐరీన్, ద సూటర్స్‌ ఆయన ఇతర నాటకాలు. ‘ది ఇన్విజిబుల్‌ వూండ్‌’ పేరుతో ఈ కథ ఆంగ్లానువాదం ఆన్‌లైన్‌లో దొరుకుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top