చుట్టూ దేవుళ్లే!

Discrimination against womans - Sakshi

‘‘వస్తావా!’’ ఇదీ ప్రేమించిన వాడి దగ్గర్నుంచి ఇప్పటి దాకా తను విన్న మగవాడి కూత. కానీ, తనకు ఆ వికృత పిలుపు గుర్తులేదు. ‘‘నేనున్నాను’’ అన్న దైవత్వమే గుర్తుకు ఉంది. ఆమె శరీరాన్ని పీక్కుతినే రాక్షసులను మరచి ఆత్మనెరిగిన వారిలో దైవత్వాన్ని చూసింది.

పుట్టడం చావడం మధ్యలో బతుకు ఎంత భయంకరమైనదో వేశ్యావృత్తినే ఆసరాగా చేసుకొని బతుకులు ఈడుస్తున్నవారిని కలిస్తే ఇట్టే అర్థమైపోతుంది. వీరు తమకు తాముగా ఈ వృత్తిలోకి వచ్చినవారు కాదు. బతకడానికి మరో మార్గం తెలియక బలవంతంగా ఈ రొంపిలోకి దిగినవారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ వచ్చి, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఇటీవలే ఈ వృత్తి నుంచి బయటపడిన కమల (పేరు మార్చాం) తన మనోభావాలను ఇలా పంచుకుంది.

నేను కష్టంలో ఉంటే స్వీపరక్క వచ్చి ఆదుకుంది.  ఆమెకూ నాకు ఎప్పటి రుణమో. ఎక్కడా పని దొరక్కపోతే కారు షెడ్డాయన దయతలచి ఇంత పని ఇచ్చాడు. ముందు దొంగనని అన్నా.. నాకు, నా బిడ్డకు ఇంత తిండి పెట్టాడు. చెడి ఇంటికి వెళితే మేనత్త నా బిడ్డను చూసుకుంటానంది. ఇలా నా చుట్టూ వాళ్లందరూ దేవుళ్లే!

 ఇంత కష్టమైన జీవితాన్నిచ్చిన దేవుడిని ఎన్నడూ తిట్టుకోలేదా?
చేతులారా నేనే జేసుకున్న. తాళి కట్టకపోయినా నచ్చిన వాడే నా భర్త అనుకున్న. కానీ ఏం లాభం మొగుడు అనేవాడికి నేను సంపాదించే వస్తువునయ్యా. దేవుడిని తిడితే నా బతుకు మంచిగవు తుందా! ‘కడుపులో బిడ్డ పెరుగుతోంది. ఈ పని చేయలేనని మొండికేశాను. కొన్ని రోజులు కొట్టాడు. తర్వాత కొన్నాళ్లు జాడే లేడు. వాడు ఈ రోజు రాకుండా చూడు దేవుడా అని మొక్కుకునేదాన్ని. తినడానికి తిండి ఉండేది కాదు. ఆకలి సంపేది. నా బతుకు చూసి జాలి పడి రోడ్లు ఊడ్చే స్వీపరక్క దేవుడల్లే సాయం చేసింది. గవర్నమెంట్‌ ఆసుపత్రిలో చేర్చి పురుడు పోయించింది.

ఆ తర్వాత ఆ అక్క కనిపించలేదు. ఎక్కడుంటుందో తెలియదు. ఏదో పేటలో ఉంటానని చెప్పింది. ఓ రోజు రాత్రి ఇంటి బయట మా ఆయన పడిపోయి కనిపించాడు. ఇంట్లోకి తీసుకొచ్చి అన్నం పెట్టాను. మనిషి మనిషిలా లేడు. శవంలా తయారయ్యాడు. రోజూ దగ్గుతూ ఉండేవాడు. డాక్టర్‌ దగ్గరకు తీసుకుపోతే టీబీ అన్నాడు. మందులకు డబ్బుల్లేవు. దిక్కు తోచక రోడ్డు మీద నిలుచున్న... ఎవరు పిలిచి నాలుగు డబ్బులిస్తే వాళ్లతో పోయాను.

బిడ్డకు పాలిచ్చి, ఆయనకు అప్పజెప్పి నేను పైసలు కోసం.. (చెబుతున్నంతసేపు కన్నీళ్లు చెంపల మీదకు పాకుతూనే ఉన్నాయి) బాగా పొద్దుపోయేక రోడ్డున పడేదాన్ని. ఓ రోజు ఇంటికొచ్చేసరికి బిడ్డ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తోంది. గభాల్న చంకకెత్తుకున్నా. పక్కన ఆయన్ని చూస్తే కదలకుండా పడున్నాడు. చూసినవాళ్లు ప్రాణం పోయిందన్నారు. అప్పుడు చేతిలో వంద రూపాయలున్నాయి. శవాన్ని తీయడానికి ఎవరూ ముందుకురాలేదు. ఎవరో మున్సిపాలిటీ వాళ్లకు చెబితే వాళ్లు వచ్చి శవాన్ని తీసుకెళ్లారు. అప్పుడే వచ్చిన ఆ ఇంటి ఓనర్‌ ఇంట్లో ఉండద్దని నా సామానంతా బయటేశాడు. ఏదైతే అదయిందని మా ఊరు బయల్దేరా.

ఏ ఊరు మీది, ఇక్కడికి ఎలా వచ్చావు?
మాది రాజమండ్రి దగ్గర ఓ పల్లెటూరు. అమ్మనాన్న తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. ఏడవ తరగతి వరకు ఊళ్లోనే బడికెళ్లాను. అమ్మానాన్న పొలం కాడికిపోతే చెల్లెలిని, తమ్ముడిని చూసుకోవడానికి ఇంటిదగ్గరే ఉండాల్సి వచ్చింది. అమ్మానాన్న నన్ను మా మేనబావకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు.

కానీ, దేవుడు నా నుదుటిన రాత మరోలా రాశాడు. మా ఊళ్లో ఒకరింటికి చుట్టపు చూపుగా ఒకతను వచ్చాడు. అతను పట్నంలో పనిచేస్తాడు. నన్ను ఇష్టపడ్డానన్నాడు. నాకూ అతను బాగా నచ్చాడు. ఇంట్లోవాళ్లు వద్దన్నారు. గొడవలయ్యాయి. మా మేనత్తతో ‘పిల్లల పెళ్ళి వెంటనే చేసేద్దాం’ అన్నాడు మా నాన్న. మా మేనత్త సరేనంది. నాకు భయమేసి ఇష్టపడ్డాయనతో చెప్పాను. ఇద్దరం కలిసి ఓ రోజు ఎవరికీ చెప్పకుండా పట్నం వచ్చేశాం.

అసలు ఈ వృత్తిలోకి ఎలా వచ్చావు? అతను నిన్ను బాగా చూసుకోలేదా?
ఏం చెప్పమంటారు? (కన్నీళ్లు తుడుచుకుంటూ) అంతకుముందు మా ఆయన, అతని ఫ్రెండ్‌ ఇద్దరూ కలిసి ఉండేవారంట. రేకులేసిన చిన్న గది అది. చీకటి చీకటిగా ఉండేది. ఆ పక్కనే మురుగు కాల్వ కంపు. అయినా ఉన్నంతలో సర్దుకొని గుట్టుగా ఉండేదాన్ని. రెండో రోజు డబ్బులడిగితే వెంట తెచ్చుకున్నవి ఇచ్చేశాను. ఇంకోరోజు ఖర్చులకు డబ్బుల్లేవంటే చెవిదిద్దులు తీసిచ్చాను. నాలుగో రోజు బాగా తాగి తూలుకుంటూ ఇంటికి వచ్చాడు. భయమేసింది. ఆ రాత్రి గోడకు నక్కి పడుకున్నాను.

అది రోజూ పనే అని వరుసగా తాగొస్తుంటే తెలిసింది. నాలుగునెలలు కనాకష్టంగా గడిచాయి. కూర్చొని తింటే ఎక్కడినుంచి తెచ్చిపెట్టేదే నీకు అని రోజూ తిట్టేవాడు. కారు షెడ్డులో పనికి పెట్టాడు. రోజూ పొద్దున, సాయంత్రం ఆ షెడ్డు ఊడ్చి, నల్లా నుంచి నీళ్లు తెచ్చి డ్రమ్ములు నింపేదాన్ని. జ్వరం వచ్చి రెండు రోజులు పనికి పోలేదు. మూడోరోజు తాగి వచ్చిండు. పనికి పోలేదని కొట్టాడు. అరుపులు విని చుట్టుపక్కల వాళ్లు వచ్చి ‘ఆ పిల్లను చంపేస్తావా ఏంటి’ అని గదమాయిస్తే వాళ్ల మీదకు కొట్టాటకు పోయాడు. తర్వాత నేను నెల తప్పానని తెలిసింది. ఈ భూమికి నేనే బరువు అనుకుంటే ఇంకో బరువా అనుకున్నాను.

కారు షెడ్డు ఓనర్‌ వచ్చి ఓ రోజు గొడవ గొడవ చేశాడు. షెడ్డులో డబ్బులు పోయాయని, అవి నేనే తీసానని అన్నాడు. నెత్తీ నోరు బాదుకొని చెప్పా నాకేం తెలియదని. అయినా మా ఆయన నా మాట వినలేదు చచ్చేట్టు కొట్టాడు. ఊరికి పోదామనుకుంటే ఏ మొఖం పెట్టుకొని అమ్మానాన్నల దగ్గరకు పోవాలి. చావో బతుకో ఇక్కడే చావాలని మొండిగ ఉన్నాను. ఆ రోజు రాత్రి మా ఇంటి ఓనర్‌ని తీసుకొచ్చాడు మా ఆయన. ఇద్దరూ కలిసి బాగా తాగారు. ఆ తర్వాత మా ఆయన బయటకు వెళ్లిపోయాడు. ఆ రాత్రి ఆ ఓనర్‌ కాళ్లావేళ్లా పడ్డాను. వినలేదు. మా ఆయనకు నాలుగొందలు అప్పు ఇచ్చాడంట. అవి తీర్చేదాక నేను చెప్పినట్టు వినాలంట. ఆ తర్వాత రోజు ఇంకెవడినో తీసుకొచ్చాడు..

ఇదంతా నుదుటి రాత అంటున్నావు. ఆ రాత రాసిన దేవుడు గురించి నీకేం తెలుసు...
నా చిన్నప్పుడు ఇంట్లో పండగలప్పుడు, జాతరలప్పుడు గుడికి పోయేవాళ్లం. ఆ రోజు అమ్మ పాయసం వండి తీసుకెళ్లేది. దేవుడికి దణ్ణం పెట్టుకో మంచి బతుకొస్తది అని అమ్మ చెప్పేది. నాకేదో కావాలని ఎప్పుడూ మొక్కుకోలేదు. మా ఇంట్లో అందరూ బాగుండాలి అనుకునేదాన్ని. కానీ, నా బతుకు ఇలాగయ్యింది.

ఊరికి వెళ్లిన దానివి అక్కడే ఉండి ఏదో పని చేసుకోక.. మళ్ళీ ఇక్కడకు ఎందుకు వచ్చావు?
నేను వెళ్లిపోయాక మా నాన్న విషం తాగి చచ్చిపోయాడట. మా అమ్మ శాపనార్థాలు పెట్టింది. ఇంట్లో అడుగుపెడితే తనూ ఛస్తానంది. మా చెల్లెల్న్లి మా మేనత్త తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చే సుకుంది. మా చెల్లెలి దగ్గరకు Ðð ళ్లి చేతులు పట్టుకున్న. పట్నంలో హోటల్‌లో పనిచేస్తున్న, పని చేసుకుంటూ బిడ్డను చూసుకోవడం కష్టమైతుంది.

నా బిడ్డను చూసుకో నెల నెల పైసలు పంపిస్త. దానికింత తిండి పెట్టి, చదువు చెప్పించు అన్నాను. అబద్ధమే చెప్పాను కానీ తప్పలేదు. మా మేనత్త మొదట ఒప్పుకోలేదు. కాళ్లు పట్టుకుంటే దయదలచి పైసలు పంపిస్తే చూస్తాం అంది. సరే అని బిడ్డను వాళ్లకు అప్పజెప్పి ఈడికి వచ్చిన. నిద్రపోతున్న బిడ్డను వాళ్ల దగ్గర వదిలేసి పట్నం బస్సెక్కాను. ఏడాదికొకసారి వెళ్లి చూసొస్తాను. ఇప్పుడు నా బిడ్డకు పదేళ్లు వచ్చాయి. వచ్చేటప్పుడు నన్ను కదల్నీయదు. నాతోపాటు వస్తానంటది. తీసుకురాగలనా?!

మరి మీ ఇంట్లో వాళ్లకు చెప్పినట్టు హోటల్‌లో పనిచేసేవా? మళ్ళీ ఈ వృత్తిలోకి వచ్చావు..
పట్నం వచ్చాక ‘ఈ పని’ మానేసి గౌరవంగా బతకాలని పనికోసం ఓ హోటల్‌వాళ్లని వెళ్లి అడిగాను. పని ఇచ్చారు. హోటల్‌ ఊడ్చి, తుడిచి, గిన్నెలు కడిగితే తిండి పెట్టి నెలకు రూ.1500 ఇచ్చేవారు. బానే ఉందనిపించింది. ఎక్కడా ఉండటానికి చోటు లేదని ఆ హోటల్‌ వంటగదిలోనే ముడుచుకుపడుకునేదాన్ని. ఓ రోజు ఆ హోటల్‌ ఓనర్‌ నా మీద అఘాయిత్యం చేశాడు. అదేమంటే బూతులు తిట్టాడు. అక్కడ ఉండలేకపోయాను. పాత రోజుల్లోకే వెళ్లిపోయా. చచ్చిపోదామని ఎన్నోసార్లు అనుకున్నా. కానీ, ఊళ్లో నా బిడ్డ గుర్తొచ్చేది. 
 
ఇప్పుడు చెప్పు.. ఇంత జరిగినా ఇప్పటికీ దేవుడున్నాడని నమ్ముతున్నావా?
ఒకడిని నమ్మి మోసపోయాను. అది నా తప్పు. నేను కష్టంలో ఉంటే స్వీపరక్క వచ్చిఆదుకుంది.  ఆమెకూ నాకు ఎప్పటి రుణమో. ఎక్కడా పని దొరక్కపోతే కారు షెడ్డాయన దయతలచి ఇంత పని ఇచ్చాడు. ముందు దొంగనని అన్నాను. నాకు నా బిడ్డకు ఇంత తిండి పెట్టాడు. చెడి ఇంటికి వెళితే మేనత్త నా బిడ్డను చూసుకుంటానంది. ఈ పని చేస్తే నా ఆరోగ్యం పాడైతుందని ఇదిగో ఈ మేడమ్‌ (రాంకీ ఫౌండేషన్‌ వాలెంటీర్‌ను చూపిస్తూ) వాళ్లు ఇక్కడకు తీసుకొచ్చి నాకెన్నో జాగ్రత్తలు చెబుతుంటారు.

ఒంట్లో బాగోలేకపోతే మందులు ఇస్తారు. నాకేదైన పని ఇప్పించమని వీళ్లకు చెప్పాను. వీళ్లూ సరే అన్నారు. మిషన్‌ పని నేర్చుకుంటున్న. ఈ మేడమ్‌ వాళ్లకు తెలిసినవారి షాప్‌లో వారం రోజులుగా పనికి కూడా పోతున్నాను. నన్ను ఆదుకున్న అందరూ నాకు దేవుళ్లే. ఆ దేవుడు నా బిడ్డనైనా చల్లగా చూడాలి. దానికది బతగ్గలదు అనేంతవరకు నన్ను బతికించమని దేవుడికి రోజూ దణ్ణం పెట్టుకుంటున్నాను.

– నిర్మలా రెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top