అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిట్టనిలువునా గ్రూపులుగా చీలిపోయింది. కాంగ్రెస్ నుంచి నాయకులు భారీగా వలస వస్తుండడంతో సీనియర్లలో ఆందోళన అధికమైంది.
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిట్టనిలువునా గ్రూపులుగా చీలిపోయింది. కాంగ్రెస్ నుంచి నాయకులు భారీగా వలస వస్తుండడంతో సీనియర్లలో ఆందోళన అధికమైంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీపై కత్తికట్టిన వారంతా ఈరోజు టీడీపీలోకి వస్తామంటే వారందరినీ గుండెలకు హత్తుకుని పార్టీలోకి ఆహ్వానిస్తున్న బాబు తీరుపై కార్యకర్తలు మండిపడుతున్నారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను, కార్యకర్తలను రాచిరంపాన పెట్టిన నేతలను పార్టీలోకి ఆహ్వానించడాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఇంటా బయటా దుమ్మెత్తిపోయడంతో పాటు ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన కాంగ్రెస్ నాయకులను నేడు రండి..రండి..దయ చేయండి అంటూ ఆహ్వానిస్తుండడంపై తెలుగు తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కాశీకి వెళ్లి గంగలో మునిగితే చేసిన పాపాలు పోతాయా అన్న విధంగా.. టీడీపీపై తీవ్రమైన విమర్శలు చేయడమే కాకుండా పలు రకాలుగా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరితే చేసిన పాపాలు పోతాయా? అని ఎన్నో రోజులుగా టీడీపీలో ఉంటున్న నేతలు వాపోతున్నారు. నాడు కాంగ్రెస్ నాయకులు అంటేనే దొంగల ముఠా అని, ఫ్యాక్షనిస్టులని చెప్పిన చంద్రబాబు నేడు వారినే పార్టీలోకి తీసుకుంటే.. వారంతా సచ్చీలురైపోతారా అని తెలుగు తమ్ముళ్లే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. నాడు టీడీపీని ఎంతగానో ఇబ్బందిపెట్టిన జేసీ దివాకర్‌రెడ్డి, కొట్రికె మధుసూదన్‌గుపా, శైలజానాథ్ చేరికను కార్యకర్తలు ఏమాత్రం ఇష్టపడడం లేదు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ టీడీపీలోని రెండు వర్గాలు వేర్వేరుగా నాయక త్వం వహిస్తున్నారు. ఒక సామాజిక వర్గంతో పాటు పరిటాల అభిమానులు, టీడీపీలో ప్రారంభం నుంచి పనిచేస్తున్న నాయకులందరూ ఒక తాటిపై నిలువగా, పయ్యావుల కేశవ్, జిల్లా ఇన్‌చార్జ్ సీఎం రమేష్, జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి వీరంతా మరో వర్గంగా చలామణి అవుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని కాంగ్రెస్ నేతల దురాగతాలను అడ్డుకుంటానని ప్రకటనలు గుప్పించారు. తీరా వాటిని అమలు పరచడంలో అధినేత పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఫ్యూడల్ పోకడలతో వ్యవహరిస్తున్నారనే విమర్శలున్న జేసీ సోదరులతో పాటు మాజీ మంత్రి శైలజానాథ్, గుంతకల్లు ఎమ్మెల్యే, డీసీసీ మాజీ అధ్యక్షుడు కొట్రికె మధుసూదన్‌గుప్తాను టీడీపీలోకి ఆహ్వానించడంపై విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే ఏ ఒక్కరిని పార్టీలోకి తీసుకునేది లేదని అనేక సందర్భాల్లో కార్యకర్తలకు భరోసా ఇచ్చిన చంద్రబాబు, గెలుపే ధ్యేయంగా పార్టీ కార్యకర్తలను వంచనకు గురి చేశారని ఆవేదన చెందుతున్నారు. టీడీపీలోకి వలసలు రావడానికి ప్రధాన కారకుడైన కేశవ్‌ను అందరూ టార్గెట్ చేస్తున్నారు. దీనికి జిల్లా ఇన్‌చార్జ్ సీఎం రమేష్ వంత పాడుతున్నారని, గెలుపు తప్ప వారికి విలువలు, విశ్వసనీయతతో పనిలేదని జిల్లా నాయకులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో వీరందరికి వ్యతిరేకంగా ఓటు వేయాలని అభిమానులు, కార్యకర్తలకు సంకేతాలు ఇస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారందరిని ఈ ఎన్నికల్లో ఓడగొట్టకపోతే వారంతా ఏకమై తమ మీద స్వారీ చేస్తారని భావించి ముందస్తు ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు సమాచారం. ఉరవకొండలో తన గెలుపు సునాయాసమని ఇంత కాలం భావించిన కేశవ్‌కు వెన్నులో వణుకు పుట్టించే విధంగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ప్లాన్ రూపొందించారు. విశ్వేశ్వరరెడ్డిని ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని భావించిన కేశవ్.. జేసీ సోదరుల సాయంతో అడ్డదారులు తొక్కడానికి వ్యూహం రచిస్తున్నట్లు తెలిసింది. కాగా పరిటాల వర్గీయులు ఉరవకొండ నియోజకవర్గంలో కేశవ్‌కు వ్యతిరేకంగా పనిచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. పరిటాల రవీంద్ర హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా టీడీపీలోకి వచ్చి తాము పతివ్రతలమని చాటేందుకు చేస్తున్న ప్రయత్నాలను పరిటాల సునీత వర్గం అంగీకరించడం లేదు. మెజార్టీ టీడీపీ శ్రేణులు రెండు గ్రూపులుగా విడిపోవడంతో బీసీ నేతల్లో కూడా కలవరం పట్టుకుంది.
2009 ఉప ఎన్నికల్లో టీడీపీకి రాయదుర్గం, అనంతపురం రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కుతుందని ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఉప ఎన్నికల ఫలితాల తరువాత గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డికి వచ్చిన మెజార్టీని చూసి టీడీపీది బలుపు కాదు.. వాపు అని ప్రజలు గుర్తించారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో మొత్తం నియోజకవర్గాల్లో నేతలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు.
టీడీపీలో నేతల కొరత కారణంగానే కాంగ్రెస్ వారికి వల విసిరి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పైగా ఈ ఎన్నికల్లో కోట్లు కుమ్మరించే వారికే సీట్లు ఇస్తామని చంద్రబాబు సీఎం రమేష్‌తో చెప్పినట్లు తెలిసింది. జేసీ సోదరులు పార్టీ ఫండ్ రూపంలో రూ.50 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా మధుసూదనగుప్త, శైలజానాథ్‌లకు కూడా టార్గెట్ విధించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.15 నుంచి రూ.20 కోట్లు ఖర్చు పెట్టగలిగే నేతలనే టీడీపీ తరఫున బరిలోకి దింపడానికి బాబు సిద్ధమవుతున్నారు.
ఈ నెల 30న జరుగుతున్న మునిసిపల్, అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్తలను కాదని డబ్బున్న వారందరిని బరిలోకి దింపారు. దీంతో పార్టీని నమ్ముకున్న సీనియర్ నాయకులు ర మాదేవి, అమర్‌నాథ్, చంద్రబాబు తదితర నాయకులు పురుగుల మందు డబ్బా తీసుకెళ్లి పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అయినా సీనియర్ కార్యకర్తల రోదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. బల్లా సురేష్ భార్యకు టికెట్ అమ్ముకున్నట్లు వారు ఆరోపించారు. డబ్బు, పలుకుబడి ఉన్న వారికే కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని వారు ధ్వజమెత్తారు. మునిసిపాలిటీల్లో కూడా ఇదే విధంగా టికెట్లు అమ్ముకున్నారని ఆయా ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు టీడీపీ నేతలపై మండిపడుతున్నారు. ఎంతో మంది నేతలు టీడీపీలోకి వచ్చారని సంబర పడుతున్న నేతలకు రానున్న ఎన్నికల్లో దిమ్మతిరిగేలా ఫలితాలు రావడం ఖాయమని అన్యాయానికి గురైన ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. తమ అధినేతకు ఇదంతా బలుపు కాదు.. వాపు అని అప్పుడు తెలిసొస్తుందన్నారు.