‘‘మహానేత రాజశేఖరరెడ్డిని పోగొట్టుకున్నాం.. ఆ లోటు నాకు చచ్చేంత వరకు తీరేదికాదు. ప్రజలకు మాత్రం వైఎస్సార్ లేని లోటు జగన్‌బాబు తీరుస్తారు.
* ప్రజలకు వైఎస్ విజయమ్మ భరోసా
* వైఎస్ ఆశయ సాధన జగన్‌తోనే సాధ్యం
* వచ్చే ఎన్నికల్లో విశ్వసనీయత ఉన్న నేతనే ఎన్నుకోండని పిలుపు
* విశాఖపట్నం లోక్‌సభకు నామినేషన్ వేసిన విజయమ్మ
సాక్షి, విశాఖపట్నం: ‘‘మహానేత రాజశేఖరరెడ్డిని పోగొట్టుకున్నాం.. ఆ లోటు నాకు చచ్చేంత వరకు తీరేదికాదు. ప్రజలకు మాత్రం వైఎస్సార్ లేని లోటు జగన్‌బాబు తీరుస్తారు. మీ సంతోషాల్లో, బాధల్లో మీ వెన్నంటి ఉండి, మీ అందరికీ తోడుగా నిలుస్తారు. వైఎస్సార్ ఆశయాల సాధన జగన్‌బాబుతోనే సాధ్యం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ.. ప్రజలకు భరోసా ఇచ్చారు. విజయమ్మ గురువారం విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, సీనియర్ న్యాయవాది ఎం.కె.సీతారామయ్య వెంటరాగా ఆమె కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికలఅధికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు నామినేషన్ పత్రాలు అందించారు. అంతకు ముందు విజయమ్మ జగదాంబ కూడలిలో వైఎస్సార్ విగ్రహానికి అంజలి ఘటించారు. అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘విశాఖ అంటే రాజశేఖరరెడ్డికి ఎంతో ఇష్టం.
ఇక్కడి ప్రజ లన్నా.. సముద్రం, కొండలు, ప్రకృతి అన్నా మరీ ఇష్టం. విశాఖ ప్రజలు ఎంతో మంచివారని ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు. ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా.. రాత్రుళ్లు విశాఖలోనే ఉండేవారు. విశాఖ ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారు. ఆయన ఆశయాలు, జగన్‌బాబు కోరిక మేరకే విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు మీ ముందుకు వచ్చాను. మీకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తాను’’ అని అన్నారు.
మీ గుండె చెప్పిన నేతనే ఎన్నుకోండి..
‘‘ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వచ్చే నెల 7న మన తలరాతలు మార్చే ఎన్నికలు జరగనున్నాయి. మంచి నాయకుడిని, మనసున్న నాయకుడిని, మీ గుండె చెప్పిన విశ్వసనీయత ఉన్న నేతను ఎన్నుకోండి. రాజశేఖరరెడ్డి ఆ రోజు అంతా మనవాళ్లే అనుకుని పనిచేశారు. కుల, మత, వర్గాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఆయన ఐదేళ్ల పాలనలో కరెంట్, ఆర్టీసీ, నీటి చార్జీలు పైసా కూడా పెంచలేదు. ప్రపంచంలోనే ఇది రికార్డు. ఆరోగ్యశ్రీ పథకంలో కోటిమందికి పైగా లబ్ధి పొందారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారు. ప్రతి జిల్లా, ప్రతి వ్యక్తి గురించీ ఆలోచించి పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఒక తండ్రి, ఒక అన్న, ఒక తమ్ముడు ఉంటే ఏం చేస్తారో.. అదే స్థాయి లో పేదవాళ్లకోసం ఆయన అన్నీ చేశారు’’ అని విజయమ్మ అన్నా రు. కాగా వైఎస్సార్ సీపీ తరఫున విశాఖ లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేసేం దుకు వచ్చిన విజయమ్మకు నగరవాసులు అడుగడుగునా నీరాజ నం పట్టారు. దివంగత మహానేతను గుర్తు చేసుకుని కొందరు మహిళలు కంటతడిపెట్టారు.
నేడు విశాఖలో విజయమ్మ ప్రచారం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ లోక్‌సభ అభ్యర్థి వైఎస్ విజయమ్మ శుక్రవారం విశాఖ పార్లమెంట్ పరిధిలోని భీమిలి, ఎస్.కోట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పద్మనాభం, జామి, ఎస్.కోట, ఎల్‌కోట, వేపాడ బహిరంగ సభల్లో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.