ముగిసిన మున్సిపల్ ఎన్నికలు | municipal elections completed successfully | Sakshi
Sakshi News home page

ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

Mar 31 2014 2:44 AM | Updated on Sep 2 2017 5:22 AM

మున్సిపల్ పోరు ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల్లో స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ ఆదివారం అన్నిచోట్లా ప్రశాంతంగానే జరిగింది.

సాక్షి, ఒంగోలు: మున్సిపల్ పోరు ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల్లో స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ ఆదివారం అన్నిచోట్లా  ప్రశాంతంగానే జరిగింది. అద్దంకి, చీరాల, మార్కాపురం, కనిగిరి, చీమకుర్తి, గిద్దలూరులో మొత్తం 2,06,464 మంది ఓటర్లుండగా, సగటున 85.15 శాతం పోలింగ్ చైతన్యం నమోదైంది. కిందటి మున్సిపల్ ఎన్నికలతో పోల్చితే.. ఈసారి గణనీయంగా పోలింగ్ శాతం పెరిగింది. ప్రస్తుత పోలింగ్ సరళిని బట్టిచూస్తే.. వైఎస్సార్ సీపీ అన్నిచోట్లా కచ్చితంగా అనూహ్య మెజార్టీతో గెలుపొందుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 పోలింగ్ ఆరంభం నుంచి ఉదయం 12 గంటల్లోపు ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. ఓటింగ్ పర్సంటేజీ అనూహ్యంగా పెరిగింది. మొత్తం మీద ఒక ప్రత్యేక వాతావరణం (రాష్ట్ర విభజనకు పనిచేసిన వారిపై కసి తీర్చుకునేలా...) కనిపిస్తోంది. మహిళా ఓటింగ్ ఈసారి గణనీయంగా పెరిగింది. ఆరు మున్సిపాలిటీల్లో మొత్తమ్మీద 219 పోలింగ్ కేంద్రాలుండగా, అన్ని చోట్లా పోలింగ్ ప్రారంభం కాగానే మహిళలు పెద్దసంఖ్యలో ఓటేసేందుకు క్యూ కట్టారు. అద్దంకి, చీరాల, మార్కాపురం, గిద్దలూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల ఓట్లన్నీ  వైఎస్సార్ సీపీకి పడినట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 అద్దంకిలోని వార్డు నంబర్ 16లో పోలింగ్ ప్రారంభమైన గంటసేపు ఈవీఎం మొరాయించింది. అదేవిధంగా మార్కాపురంలోని 22, 32 నంబర్ పోలింగ్‌బూత్‌లలో ఈవీఎంలు అర్ధగంటపాటు మొరాయించాయి.  దీంతో ఫిర్యాదులు అందుకున్న ఉన్నతాధికారులు ఈవీఎంలను మార్చేశారు. మార్కాపురంలో పోలింగ్ ఏజెంట్ల పాసుల జారీ విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వచ్చి హల్‌చల్ చేసేందుకు ప్రయత్నించారు.

దీంతో అక్కడే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలకు టీడీపీ నేతల మధ్య స్వల్పవివాదం చోటుచేసుకుంది. ఈ వివాదంపై మీడియా చానెళ్ల ప్రసారాలను చూసిన ఎన్నికల కమిషన్ స్పందించి కలెక్టర్ విజయకుమార్‌ను ఆరాతీసింది. అనంతరం ఆయన మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సిబ్బందికి జాగ్రత్తగా, నిష్పక్షపాతంగా విధులను నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ ప్రారంభమైన దగ్గర్నుంచి పదేపదే విద్యుత్‌కోత ఉండటంతో ఓటే సేందుకు వచ్చిన ఓటర్లు ఇబ్బంది పడ్డారు.

 ముందస్తు గృహ నిర్బంధాలు:
 మున్సిపల్ ఎన్నికల ప్రశాంత నిర్వహణలో భాగంగా పోలీసులు అన్నిచోట్లా భారీ బందోబస్తు నిర్వహించారు. అద్దంకిలో గత జనవరిలో చోటు చేసుకున్న ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా అదనపు పోలీసు బలగాల పహారా ఏర్పాటు చేశారు. అద్దంకిలో వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్, టీడీపీ నేత కరణం వెంకటేష్‌ను గృహనిర్బంధం చేశారు. అదేవిధంగా గిద్దలూరు మున్సిపాలిటీలో పోలింగ్ తీరును పరిశీలిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి సోదరుడు కృష్ణకిషోర్‌రెడ్డిని స్థానిక ఎస్సై కొట్టి గాయపరిచాడు.

దీంతో బాధితుడ్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించగా..జరిగిన సంఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చీరాలలో కూడా వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు పాలేటి రామారావును పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బలవంతంగా అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. మార్కాపురంలో వైఎస్సార్ సీపీ నేతలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, కేపీ కొండారెడ్డిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.   

 మున్సిపాలిటీల పోలింగ్ శాతం వివరాలిలా ఉన్నాయి:
 జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 2,12,179 ఓటర్లు ఉండగా, వారిలో 1,70,066 మంది ఓటర్లు ఆదివారం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నిచోట్లా సరాసరి 85.15 శాతం పోలింగ్ నమోదైంది.
 చీరాల :79.54
 మార్కాపురం: 73.79
 అద్దంకి : 85.55
 చీమకుర్తి : 85.98
 గిద్దలూరు : 78.38
 కనిగిరి : 84.50

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement