సౌదీ మహిళకు చిరు స్వేచ్ఛ

Saudi Women Can Drive  The Vehicles Removed - Sakshi

మహిళలను రకరకాల నిషేధాల మాటున అణచి ఉంచుతున్న సౌదీ అరేబియా ప్రభుత్వం తన వైఖరిని కాస్త సడలించుకుంది. వారు వాహనాలు నడపటంపై దశాబ్దాలుగా అమల్లో ఉన్న నిషేధాన్ని తొలగించింది. ఆదివారం వేకువజామున లాంఛనంగా నిషేధం రద్దయిన వెంటనే అనేకమంది మహిళలు కార్లు నడుపుతూ సంబరాలు చేసుకున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఆకాశాన్నంటే సౌధాలు, వెడల్పాటి రహదార్లు, భారీ షాపింగ్‌ మాల్స్‌ చూస్తే అది అష్టయిశ్వర్యాలతో తులతూగే దేశమనిపిస్తుంది. అందులో అసత్యమేమీ లేదు. ప్రపంచ చమురు నిల్వల్లో 18 శాతం అక్కడే కేంద్రీకరించి ఉన్నాయి. ఆ విషయంలో ప్రపంచంలోనే సౌదీ అరేబియా ద్వితీయ స్థానంలో ఉంది. సహజవాయు నిల్వల్లో దానిది ఆరో స్థానం. ఆ పెట్రో డాలర్లు  తీసుకొచ్చిన వైభోగం అడుగడుగునా అక్కడ కనబడుతుంది. సౌదీని అధికాదాయ దేశంగా ప్రపంచబ్యాంకు పరిగణిస్తోంది. మానవాభివృద్ధి సూచికలోనూ అదెప్పుడూ ముందుంటుంది.

కానీ స్త్రీ, పురుష సమానత్వం విష యంలో ఆ దేశానిది అథమ స్థానం. లింగవివక్ష అధికంగా ఉన్న దేశాల్లో సౌదీ అరేబియాది ఏడో స్థానం. 1932లో ఒక దేశంగా ఆవిర్భవించినప్పటినుంచి రాచరిక వ్యవస్థ, ఒకే కుటుంబపాలన అక్కడ సాగుతోంది. పేరుకు సలహాసంప్రదింపుల అసెంబ్లీ ఒకటున్నా, పాలన కోసం మంత్రివర్గం ఉన్నా రాజుగారు తలచిందే చట్టం. దాయాది కుటుంబసభ్యులు పరస్పర సమన్వయం చేసుకుని, మత నాయకులను కూడా కలుపుకొని వారసత్వ అధికారాన్ని అనుభవిస్తున్నారు. 2015లో రాజుగా వచ్చిన సల్మాన్‌ అబ్దుల్‌ అజీజ్‌ నిరుడు యువరాజు బిన్‌ సల్మాన్‌ను వారసుడిగా ప్రకటించారు. అప్పటినుంచీ ఆయన ఏలుబడే నడుస్తోంది. దాదాపు మూడున్నర కోట్లమంది దేశ జనాభాలో కోటిమంది విదేశీ పౌరులు. మహిళలెప్పుడూ ద్వితీయశ్రేణి పౌరులే. తండ్రి, సోదరుడు, భర్త తోడు లేకుండా ఒంటరిగా వారు ఏ అధికారిక పనులూ చక్కబెట్టడానికి వీల్లేదు.

ఉద్యోగం చేయాలన్నా, ఊరు విడిచి ఎక్కడికైనా వెళ్లాలన్నా, విదేశాలకు వెళ్లాలన్నా ఇంట్లోని మగవాళ్ల అనుమతి ఉండాల్సిందే. మహిళల హక్కుల కోసం మాట్లాడినా, ఉద్యమించినా అలాంటివారిని ‘రాజ్యానికి శత్రువులు’గా పరిగణించడం, ఖైదు చేయటం రివాజు. మహిళా ఉద్యమకారులు అరెస్టయినప్పుడల్లా వారిని పొరుగునున్న కతార్‌ దేశ ఏజెంట్లుగా, రాజరిక శత్రువులతో చేతులు కలిపినవారిగా చిత్రీకరిస్తూ పత్రికల పతాకశీర్షికల్లో కథ నాలు వెలువడతాయి. 1990లో కొందరు మహిళలు తామూ డ్రైవింగ్‌ చేయడానికి అర్హులమేనంటూ రోడ్లపైకి కార్లు తీసుకొచ్చినప్పుడు వెనువెంటనే వారిని పోలీసులు అరెస్టు చేశారు. 2011లో ‘అరబ్‌ విప్లవం’ ప్రభావంతో మళ్లీ సౌదీలో మహిళలు ఉద్యమించారు.

అలాంటిచోట నిరుడు యువరాజు బిన్‌ సల్మాన్‌ సౌదీ విజన్‌–2030 పేరిట డాక్యుమెంట్‌ విడు దల చేసి దేశాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని భావిస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి అంతకు రెండేళ్లముందు మహిళల వస్త్రధారణ విషయంలో ఉన్న కఠిన నిబంధనలను స్వల్పంగా తొలగించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటేయడానికి, అభ్యర్థులుగా నిలిచేందుకు అవకాశమిచ్చారు. 2030కల్లా 30 శాతంమంది మహిళలకు ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని విజన్‌ డాక్యుమెంటు నిర్దేశిస్తోంది. మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని తొలగిస్తామని నిరుడు సెప్టెంబర్‌లో తొలిసారి ప్రకటించినప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కానీ తగిన నిబంధనలు రూపొం దించాక మాత్రమే అది అమల్లోకొస్తుందని చెప్పినప్పుడు మహిళా ఉద్యమకారులు అంగీకరించలేదు. తక్షణమే నిషేధం తొలగించాలని డిమాండ్‌ చేశారు. కొన్ని వారాల కిందట మహిళలు మరోసారి ఉద్య మించి కార్లు నడిపితే వారిని అరెస్టుచేశారు. అందువల్లే మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని నిజంగా తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అన్న సందేహాలు అందరిలోనూ తలెత్తాయి. ఎలా గైతేనేం ఎట్టకేలకు నిషేధం తొలగింది. అందుకు యువరాజు ‘విశాల దృక్పథమే’ కారణమని అక్కడి మీడియా కొనియాడుతోంది. కానీ ఈ హక్కు కోసం ఉద్యమించిన 17మందిలో ఇంకా ముగ్గురు జైళ్లలో మగ్గుతున్నారు. వారిపై ఉన్న దేశద్రోహం ఆరోపణలు రుజువైతే ఇరవైయ్యేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.

యువరాజు ప్రవేశపెట్టిన ఈ చిన్న సంస్కరణ సౌదీ ఛాందసవాద సమాజంలో ఏమేరకు మార్పు తీసుకొస్తుందన్నది చెప్పలేం. మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధం తొలగింపును వ్యతిరేకిస్తూ పక్షం రోజులక్రితం మతాధిపతుల ప్రోత్సాహంతో కొందరు రోడ్లపైకొచ్చారు.  దేశ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉంటే బహుశా ఈ సంస్కరణ ఆలోచనే యువరాజుకు వచ్చేది కాదేమో! ఉచిత ఇంటి సదుపాయం, తగిన అర్హతలుంటే ఉన్నతోద్యోగం, రాజకుటుంబీకులు సిఫార్సుతో సులభంగా ఉద్యోగం, సుదీర్ఘ మైన సెలవు దినాలు, దాదాపు అన్నిటికీ సబ్సిడీ సదుపాయాలు ఉండే సౌదీలో నాలుగేళ్లక్రితం చమురు ధరలు పతనం కావడం మొదలయ్యాక కష్టకాలం మొదలైంది. సంక్షేమ పథకాలకు పరిమితులు విధించడం ప్రారంభించారు.

2015 మార్చిలో యెమెన్‌పై కత్తిగట్టి మొదలెట్టిన యుద్ధం అంతూ దరీ లేకుండా కొనసాగుతూ సౌదీ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం దిశగా తీసుకెళ్తోంది. దేశంలోని చమురు బావులన్నీ నిండుకుంటే పరిస్థితేమిటన్న ఆలోచన అక్కడ మొదలైంది. ఇప్పుడున్న కోటి 20 లక్షల ఉద్యోగాల్లో సౌదీ పౌరుల వాటా సగం కన్నా తక్కువ. 70 లక్షల ఉద్యోగాలు వలసదారుల చేతుల్లో ఉన్నాయి. ఉద్యోగాలు చేసే సౌదీ మహిళల సంఖ్య మరింత తక్కువ. దీన్నంతటినీ మార్చ కపోతే పర్యవసానాలు భయంకరంగా ఉంటాయని, దేశం పెను సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని సర్కారుకు జ్ఞానోదయమైంది. కారణమేదైనా మహిళలు వాహనాలు నడపటంపై ఉన్న నిషేధాన్ని తొలగించడం మెచ్చదగిందే. దీనికి కొనసాగింపుగా ఇతర సంస్కరణలు కూడా సత్వరం అమల్లోకి రావాలని, అవి దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడానికి దోహదపడాలని ఆశించాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top