‘వయనాడ్‌’ కలకలం | Rahul Gandhi Contesting From Wayanad | Sakshi
Sakshi News home page

‘వయనాడ్‌’ కలకలం

Apr 2 2019 12:12 AM | Updated on Apr 2 2019 12:12 AM

Rahul Gandhi Contesting From Wayanad - Sakshi

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా పోటీ చేస్తారని కాంగ్రెస్‌ చేసిన ప్రకటన సహజంగానే సంచలనం సృష్టించింది. ఇలా రెండు స్థానాలనుంచి పోటీ చేయడం వెనకున్న వ్యూహంపై కాంగ్రెస్‌ ఇస్తున్న వివరణతో విభేదిస్తున్నవారు చాలామందే ఉన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఏకే ఆంటోనీ, రణదీప్‌ సుర్జేవాలా చెబుతున్న ప్రకారం దక్షిణాది సంస్కృతికి ‘విచ్ఛిన్నకర శక్తుల’ నుంచి ముప్పు ఉంది. వర్ణం, భాష, తినే తిండి ప్రాతిపదికలుగా ఈ ప్రాంత ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులపై సాగుతున్న పోరాటానికి మద్దతుగా రాహుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారన్నది వారి వివరణ. భౌగోళికంగా చూస్తే వయనాడ్‌ నియోజకవర్గం మూడు రాష్ట్రాల కూడలిగా ఉంది. దానికి ఒకపక్క తమిళనాడు, మరోపక్క కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి. అక్క డున్న 13 లక్షలమంది ఓటర్లలో 49.7శాతంమంది హిందువులు కాగా ముస్లింలు 28.8శాతం, క్రైస్త వులు 21.5 శాతం ఉన్నారు. మూడు జిల్లాల్లో విస్తరించిన ఏడు అసెంబ్లీ స్థానాలు ఈ నియోజక    వర్గంలో ఉన్నాయి. ఇదొక పర్యాటక కేంద్రం కూడా. 2009లో తొలిసారి లోక్‌సభ నియోజకవర్గంగా మారాక రెండుసార్లూ ఇక్కడ కాంగ్రెసే గెలిచింది. దాని సమీప ప్రత్యర్థి సీపీఐ తప్ప బీజేపీ కాదు.

దక్షిణాదిన కాంగ్రెస్‌ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పుదుచ్చేరి, కర్ణాటకల్లో కూటమి ప్రభుత్వాల్లో అది భాగస్వామిగా ఉంది తప్ప సొంతంగా దాని ఏలుబడిలో ఏ రాష్ట్రమూ లేదు. అలాగని ఉత్తరాదిన కూడా దాని పరిస్థితి మెరుగ్గా లేదు. గత నవంబర్‌–డిసెంబర్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు కాంగ్రెస్‌కి లభించాయి. అయినా ఇతర ప్రధాన పార్టీలు దానితో చేతులు కలపడానికి ఏమంత సుముఖంగా లేవు. కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు కాంగ్రెస్‌ ప్రమేయం లేకుండా పొత్తు కుదుర్చుకున్నాయి. కాంగ్రెస్‌కు సోనియా, రాహుల్‌ పోటీ చేసే రెండు స్థానాలను మాత్రమే విడిచిపెట్టాలని ‘పెద్ద మనసు’తో నిర్ణయించాయి! ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అక్కడున్న ఏడు లోక్‌సభ స్థానాల్లో కేవలం రెండే ఇస్తామని చెప్పి ఖంగు తినిపించింది. దేశ రాజధానిలో ఇలా పరువు చేటు పొత్తుకు సిద్ధపడరాదని నిర్ణయించి కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఏతావాతా జాతీయ పార్టీ అయినా అదొక ప్రాంతీయ పార్టీగా మిగిలి పోయింది. ఈ స్థితిలో కారణ మేదైతేనేం... రాహుల్‌ వయనాడ్‌కు రావడం కేరళలో కాంగ్రెస్‌కు ఖాయంగా ఊరటనిస్తుంది.

కానీ కాంగ్రెస్‌ ప్రవచిస్తున్న విపక్ష ఐక్యత మాటేమిటి? ఈ నిర్ణయం ఆ ఐక్యతను పెంచుతుందా, తుంచుతుందా? ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఎస్‌పీ, బీఎస్‌పీలు చేతులు కలపడం పర్యవసానంగా అక్కడ తనకు గత సార్వత్రిక ఎన్నికల్లో లభించినన్ని స్థానాలు ఈసారి రాకపోవచ్చునని బీజేపీకి అర్ధమైంది. దాంతోపాటు బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ స్థానాలు గతంతో పోలిస్తే తగ్గే అవకాశముంది. ఇలా ఉత్తరాదిన కోల్పోయే స్థానాలను ఇతరచోట్ల భర్తీ చేసుకోవాలని అది భావిస్తోంది. అయితే దానికి దక్షిణాదిన అంతో ఇంతో ఆశ ఉన్నది కర్ణాటక రాష్ట్రం మాత్రమే. కేరళలో శబరిమల ఉద్యమం పర్యవసానంగా బీజేపీకి ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశమున్నా సీట్లు వస్తాయో రావో చెప్పే పరిస్థితి లేదు. తమిళనాడులో అది పొత్తు కుదుర్చుకున్న అన్నాడీఎంకే అత్యంత బలహీనమైన పార్టీ. దక్షిణాదిన తన స్థితిని ఎంతో కొంత మెరుగుపరుచుకోవాలని భావిస్తున్న బీజేపీ వ్యూహాన్ని దెబ్బతీయాలనుకుంటే రాహుల్‌ దృష్టి కేంద్రీకరించాల్సింది కర్ణాటక రాష్ట్రమే. దేశంలో ఇతర రాష్ట్రాల్లో వామపక్షాలతో అవగాహన ఉన్నప్పుడు సైతం కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీ ఎఫ్‌కూ, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌కూ ఎప్పుడూ వైరమే గనుక రాహుల్‌ పోటీ వల్ల కొత్తగా వచ్చే సమస్యలేమీ ఉండవన్నది కాంగ్రెస్‌ వాదన. కానీ వామపక్షాలు దీన్ని ఆ విధంగా తీసుకోవడం లేదు.

కేరళలో గెలుపు సాధించడం వామపక్షాలకు ఇప్పుడు అత్యవసరం. నిబంధనల ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు లేదా 11 ఎంపీ స్థానాలు పొందిన పార్టీకి మాత్రమే జాతీయ ప్రతిపత్తి లభిస్తుంది. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రతి 30 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒక్కో స్థానాన్ని గెల్చుకోవాలి. 2014 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు రెండూ ఆ విషయంలో విఫల మయ్యాయి. పశ్చిమబెంగాల్, త్రిపురల్లో ఇప్పటికే వామపక్షాలు కనుమరుగయ్యాయి. వాటికి మిగిలింది ఇక కేరళ ఒక్కటే. వయనాడ్‌లో పోటీ ద్వారా రాహుల్‌ బీజేపీని దెబ్బతీయడం సంగతే మోగానీ... వామపక్షాలకు మాత్రం అది శరాఘాతమయ్యే ప్రమాదం లేకపోలేదు. గతంలో ఈ స్థానంపై పెద్దగా దృష్టి పెట్టని బీజేపీ ఇప్పుడు రాహుల్‌ రంగ ప్రవేశంతో అప్రమత్తమై అభ్యర్థిని ప్రకటించింది.ఈ రాజకీయాల మాటెలా ఉన్నా దేశాన్ని పట్టిపీడిస్తున్న వ్యవసాయ సంక్షోభానికి వయనాడ్‌  ప్రతీక. వరస కరువులు ఒకపక్క, ప్రధానంగా పండించే మిరియం పంటకు గిట్టుబాటు ధరలు లేక పోవడం మరోపక్క రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. దానికితోడు ఏనుగులు తరచు దాడి చేస్తుం డటంతో అనేకమంది వ్యవసాయం మానుకున్నారు. నిరుడు వచ్చిన వరదలు సంక్షోభాన్ని మరింత పెంచాయి. మోయలేని రుణభారంతో గత ఏడాదినుంచి ఇంతవరకూ ఆరుగురు రైతులు ఆత్మహ త్యలు చేసుకున్నారు. బయటి దేశాల నుంచి దిగుమతులను అనుమతించడంతో తాము పండించే మిరియం కిలో ధర రూ. 1,200 నుంచి రూ. 350కి పడిపోయిందని రైతులు చెబుతున్న మాటలను పట్టించుకునేవారు లేరు. రాహుల్‌ పోటీకి దిగడం వల్ల ఈ సమస్యలన్నీ చర్చకొచ్చి ఇక్కడి సంక్షో భానికి కాస్తయినా పరిష్కారం దొరికితే ఆ మేరకు స్థానికులకు మేలు కలిగినట్టే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement