
గత ఏడాది ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్న కేసీఆర్
మొత్తంగా చూస్తే మీ పార్టీ ప్రణాళికలోని చాలా అంశాలు ఆచరణసాధ్యమైనవి కావని, అస్పష్టమైనవని అనిపిస్తుంది. ఈ లోపాలన్నీ ఉన్నా తెలంగాణ ప్రజలు మీకు ‘పూర్తి మెజారిటీ’ని కట్టబెట్టి సమర్థవంతంగా, నిజాయి తీగా, పొదుపుగా పరిపాలన సాగించడానికి ప్రయత్నించండి.
సందర్భం
(తెలగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి మాజీ పార్లమెంటు సభ్యు లు ఎమ్. నారాయణరెడ్డి రాస్తున్న బహిరంగ లేఖల పరంపరలో ఇది రెండవది. గత ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర సమి తి ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు చేసిన వాగ్దానాలను, బడ్టెట్‌పై వాటి ప్రభావాన్ని విశ్లేషిస్తూ ఆయన రాసిన రెండవ లేఖ సంక్షిప్త పాఠాన్ని అందిస్తున్నాం.)
చంద్రశేఖరరావు గారూ!
తెలంగాణలోని పది జిల్లాలు కాక, ఇంకా పద్నాలుగు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని మీరు ప్రకటించారు. ఇంత వరకు ఒక్క జిల్లానూ ఏర్పాటు చేయలేదు. కాబట్టి మందుగా జిల్లాల సంఖ్య ఎంత ఉండటం అభిలషణీయమో నిర్ధారించడా నికి ఎంపీ కేశవరావు లేదా ప్రొఫెసర్ కోదండరాం లేదా గౌతం పింగ్లే వంటి అనుభవజ్ఞుల నేతృత్వంలో ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పరచాలి. ఇక ఒక్కొక్క జిల్లాకు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అది కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాల పరిధిలోని విషయం!
రెసిడెన్షియల్, గురుకుల విద్యాసంస్థల్లో కేజీ టు పీజీ ఉచిత విద్య అనే వాగ్దానమూ చాలా అస్పష్టమైనదే. పైగా రెసి డెన్షియల్ స్కూళ్లకే వర్తించే ది. పైగా, మీ ప్రణాళిక అత్యంత జనా దరణ పొందిన ‘ఫీజుల రీయింబర్స్‌మెంట్’ను విస్మరించింది. ఆ పథకంలోని పలు లోటుపాట్ల వల్ల ఇంజనీరింగ్ తదితర వృత్తి కళాశాలలు, ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చాయి. సుప్రీంకోర్టు ఆదే శానుసారం అలాంటి 170కి పైగా కళాశాలలు మూతపడ్డ సంగతి తెలిసిందే. కానీ మచ్చలేని కళాశాలల విషయంలో సకాలంలో అందించాలే గానీ ఫీజుల రీయింబర్స్‌మెంట్ అత్యంత ఉపయోగకరమైనదని గుర్తించాలి.
మీ పార్టీ ప్రణాళికలో పేర్కొన్నట్టు ప్రతి అసెంబ్లీ నియో జకవర్గంలో 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం కొంత హాస్యాస్పదమే. 100 నియోజకవర్గాలకే లెక్కవేసినా కోటి ఎక రాలు! ఇక మీరు చేస్తామన్న నదుల అనుసంధానాన్ని కేంద్రమే ప్రస్తుతం చేపట్టలేకపోతోంది. కాకపోతే చెరువుల పునరుద్ధ రణకు చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ మంచి ప్రతిపాదన. అది విజయవంతం కావాలంటే కచ్చితమైన తనిఖీ అవశ్యం. ప్రపం చ బ్యాంకు సహాయంతో ఆ పనిని అత్యంత సమర్థవంతంగా చేసిన కర్ణాటక ఆదర్శ నమూనా కాగలదు.
పది థర్మల్ స్టేషన్ల ఏర్పాటు కూడా ఆచరణాత్మకమైనది కాదు. అందుకు బొగ్గను కేటాయించాల్సింది కేంద్రం. స్థాని కంగా లభించే బొగ్గు మరీ నాసిరకం. నాణ్యమైన బొగ్గును ఆస్ట్రే లియా నుంచి దిగుమతి చేసుకోవాలి. శంకరంపల్లి గ్యాస్ ఆధా రిత విద్యుత్ కేంద్రం చాలా కాలం క్రితమే పూర్తయినా, కేంద్రం నుంచి గ్యాస్ కేటాయింపులు లేక ఇంకా ఉత్పత్తి మొదలు కాలేదు. తక్షణమే అది ఉత్పత్తి ప్రారంభించేలా చేయడం అవసరం. అభిలషణీయ సంఖ్యలో థర్మల్ కేంద్రాల ఏర్పాటు ను దీర్ఘకాలిక ప్రణాళికల్లో చేర్చవచ్చు. లక్ష రూపాయలలోపు పంట రుణాల మాఫీ మొదలైనవి ఆచరణ సాధ్యమైనవే.
కానీ 24 జిల్లాలే లేనప్పుడు 24 సూపర్ స్పెషాలిటీ ఆసు పత్రుల ఏర్పాటు గురించి ఎలా ఆలోచించగలం? వైద్య రంగంలో ప్రస్తుతం అరాచకం రాజ్యమేలుతోంది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. ఇటీవలే నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన టీచింగ్ హాస్పిటల్ కూడా అలాంటి అధ్వాన స్థితిలోనే ఉంది.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు అందించాలనే అంశం అత్యంత ప్రాధాన్యంగలది. అమరుల సంఖ్యను మీ ప్రభుత్వం 470గా చూపి, అందుకు రూ. 47 కోట్లు కేటాయించింది. కానీ తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ అంచనా ప్రకారం వారి సంఖ్య 631! ఇంత సెంటిమెం టల్ అంశంలో సైతం ఇలాంటి వివాదం కొనసాగడం ఏమిటో అంతుబట్టదు. ఈ జాప్యం ఎందుకో చెప్పాల్సింది మీరే. అమ రవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలంటే అతి స్వల్పం, అవి ఎందుకూ సరిపోవు. కాబట్టి ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పన ఇవ్వాలి.
బతుకమ్మను ప్రభుత్వ పండుగ చేయాలనేది మంచి ప్రతి పాదనే. కానీ, అందుకోసం ఒక స్వయంప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయాలి. అది సంప్రదాయక తెలంగాణ సంస్కృతిని, కుటుంబ విలువలను పెంపొందింపజేసేదిగా ఉండాలి. ఇక అంతర్జాతీయ స్థాయి అమరవీరుల స్వారక చిహ్నాన్ని ఢిల్లీలోని ‘ఇండియా గేట్’ నమూనాలో నిర్మించి, అమరుల పేర్లన్నిటినీ లిఖించి, భావి తరాలకు ఉత్తేజాన్నిచ్చేదిగా చేయాలి.
రూ. 50 వేల కోట్లతో ఎస్సీల అభివృద్ధికి ఐదేళ్ల ప్రణాళిక అన్నారు. దానికీ, గత ప్రభుత్వం ప్రకటించిన సబ్-ప్లాన్‌కూ తేడా ఏమిటో మీరే చెప్పాలి. ప్రాతినిధ్య సంస్థల్లో బీసీలకు 33% కోటా వగైరాలు ఇప్పటికే ఏదో ఒక రూపంలో ఉన్నవే. ఇక హైదరాబాద్‌లో కల్లు దుకాణాలపై నిషేధం ఎత్తివేతకు సంబంధించి... సమంజసమైన కారణాలతోనే విధించిన నిషే ధాన్ని ఎలా ఎత్తేస్తారని విజ్ఞులైన పౌరులంతా అడుగుతున్నారు. ‘లిక్కర్ కుబేరుల’ ఒత్తిడికి తలొగ్గి ‘చీప్ లిక్కర్’ను ప్రవేశ పెట్టడం ఓ ప్రహసనం!
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను సుప్రీం కోర్టు ఇప్ప టికే రాజ్యాంగవిరుద్ధంగా పేర్కొంది. అదే వాగ్దానాన్ని చేయ డం తప్పుదోవ పట్టించేదే. ప్రభుత్వోద్యోగులకు టి-ఇంక్రిమెం ట్, కేంద్ర స్కేళ్లు, ఉద్యోగ అనుకూల ప్రభుత్వం, మూడేళ్ల పాటు బదిలీల నిలుపుదల, ఆంధ్రా ఉద్యోగాలను వారి ప్రాం తానికి పంపేయడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి వాగ్దానాల అమలు ప్రభావం ఎలా ఉంటుందనే అం చనాగానీ, వార్షిక బడ్జెట్‌పై ఎంత భారమనే అంచనాగానీ మీకు లేవు. పైగా విచక్షణాయుతమైన ఏ ప్రభుత్వమూ మూడేళ్లపాటు బదిలీల నిలుపుదల వాగ్దానం చేయదు. అవన్నీ కొన్ని వర్గాలను సంతృప్తిపరచడానికి ఉద్దేశించినవే.
ఆర్టీసీ కార్మికులకు వారు ఆశించినదానికంటే ఎక్కువగానే జీతాల పెంపుదల ముదావహం. కానీ అందుకు అంత జాప్యం, వారు సమ్మె చేయాల్సి రావడంలోని మర్మమేమిటో చెప్పాలి. 2009 ఎన్నికల్లో తమరు చవి చూసిన చేదు అనుభవం తదుపరి కూడా ఎన్నికల్లో ‘ధనం శక్తి’ని నిర్మూలించడం మీ ప్రణాళికలో లేకపోవడం ఆశ్చర్యకరం.
మొత్తంగా చూస్తే మీ పార్టీ ప్రణాళికలోని చాలా అంశాలు ఆచరణసాధ్యమైనవి కావని, అస్పష్టమైనవని అనిపిస్తుంది. చాలా అంశాలకు కాలపరిమితే లేదు. ప్రణాళికలోని కొన్ని వాగ్దానాలు ఓటర్లను ఆకట్టుకోవాలనే అతి తాపత్రయంతో చేసి నవి. ఈ లోపాలన్నీ ఉన్నా తెలంగాణ ప్రజలు మీకు ‘పూర్తి మెజారిటీ’ని కట్టబెట్టి, మీపట్ల, మీ పార్టీపట్ల అపార నమ్మకాన్ని ప్రదర్శించారు. కాబట్టి అత్యంత సమర్థవంతంగా, నిజాయి తీగా, పొదుపుగా పరిపాలన సాగించడానికి ప్రయత్నించండి.
- ఎం. నారాయణరెడ్డి
(వ్యాసకర్త మాజీ పార్లమెంటు సభ్యులు)
మొబైల్: 7702941017