దూషణల హోరు!

Lok Sabha Elections 2019 Leaders Scolding Each Other - Sakshi

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో రెండు దశలు మిగిలాయి. ఆదివారం 59 స్థానాలకు... ఈ నెల 19న మరో 59 స్థానాలకు పోలింగ్‌ జరగబోతోంది. ప్రచారం ఊపందుకుని ప్రత్యర్థి పక్షాలు ఎవరికి వారు తాము గతంలో ఏం చేశామో, ఇకపై ఏం చేయబోతామో చెబితే... ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది. అలాగే తమ ప్రత్యర్థుల వైఫల్యాలను ఏకరువు పెట్టొచ్చు. పార్టీ విధా నాలనూ, కార్యక్రమాలనూ బలంగా ప్రజల్లోకి తీసుకుపోయి, వారి హృదయాల్లో చెరగని ముద్రే యడానికి ఎన్నికలనేవి ఒక ముఖ్యమైన సందర్భం. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల విధానాలను విమర్శించడం, వాటి లోటుపాట్లను వివరించడం కూడా సర్వసాధారణం. ఈ క్రమంలో ఏ పార్టీ మెరుగైందో, ఎవరివల్ల మేలు జరుగుతుందో జనం విశ్లేషించుకుంటారు. ఒక నిర్ణయానికొస్తారు. కానీ ఇటీవలికాలంలో ఈ ధోరణి క్రమేపీ కొడిగడుతోంది. నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమ ర్శలకు దిగడం, దూషించుకోవడం, సవాళ్లు విసురుకోవడం పెరుగుతోంది. ఎన్నికలంటే ఊక దంపుడు ఉపన్యాసాలు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం తప్ప మరేమీ కాదన్న అభిప్రాయం జనంలో ఏర్పడుతోంది.

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి మొదలైన ఈ దూషణల పర్వం పోలింగ్‌ చివరి దశలకొచ్చేసరికి మరింత ముదిరింది. దూషణలు మాత్రమే కాదు...అనవసర విషయాలు, తర్క వితర్కాలు పెరిగిపోయాయి. ‘అక్కా, మీరు నన్ను చెంపదెబ్బ కొట్టాలని అనుకుంటున్నట్టు విన్నాను. మీ చెంపదెబ్బలు నేను దీవెనలనుకుంటాను’ అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి మోదీ అంటే...‘ప్రజాస్వామ్యపు చెంపదెబ్బ’ను రుచిచూడబోతున్నారని మాత్రమే అన్నానని మమత జవాబిచ్చారు. నెగ్గుతామో, లేదోనన్న బెంగతో మైనారిటీ మెజారిటీగా ఉన్నచోట తలదాచుకుని గట్టెక్కాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని మోదీ పరోక్షంగా విమర్శించారు. కేరళలోని వయనాడ్‌లోపోటీ చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలన్నారు. రాహుల్‌ బ్రిటిష్‌ పౌరుడే తప్ప భారతీయుడు కాదంటూ బీజేపీ నేతలు వివాదం రేపారు. రాహుల్‌ నామినేషన్‌ తోసిపుచ్చాలంటూ సామాజిక కార్యకర్తగా చెప్పుకున్న ఒక వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి చీవాట్లు తిన్నారు.

రాహుల్‌ రాఫెల్‌ విషయంలో మోదీని ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని పదే పదే అనడమే కాక, ఆ మాట సుప్రీంకోర్టు కూడా ధ్రువీకరించిందని నోరుజారి చిక్కుల్లో పడ్డారు. ఈ విషయంలో ఆయన ఒకటికి రెండుసార్లు క్షమాపణ చెప్పాల్సివచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రచారసభల్లో ఎంత విషం కక్కారో అందరూ చూశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు వైఫల్యాలను, ఆయన హయాంలో జరిగిన కుంభకోణాలను, ప్రత్యేక హోదా విషయంలో ఆయన చేసిన ద్రోహాన్ని ఎత్తిచూపుతూ మాట్లాడితే...చంద్రబాబు మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే గూండాయిజం పెరిగిపోతుందని, హత్యలు జరుగు తాయని, అల్లకల్లోల స్థితి ఏర్పడుతుందని ప్రజల్ని బెదరగొట్టాలని చూశారు. జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు సీఎంగా తన ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీక రించకపోగా... జగన్‌పై బురదజల్లే యత్నం చేశారు. ఈ బాపతువారే ఢిల్లీలో ఆప్‌ అభ్యర్థిగా బరి లోకి దిగిన మహిళా అభ్యర్థి అతిషిను అత్యంత నీచంగా చిత్రీకరిస్తూ కరపత్రాలు విడుదల చేశారు. విలేకరుల సమావేశంలో ఈ సంగతి చెబుతూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
 
ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉన్నవారిని మాత్రమే కాదు...ఎన్నడో కన్నుమూసిన నాయకుల్ని కూడా వదలడం లేదు. తొలి ప్రధాని నెహ్రూ ఏలుబడిలో 1954లో కుంభమేళా సరిగా నిర్వహిం చకపోవడంతో తొక్కిసలాట జరిగి అనేకులు మరణించారని, ఆయనకన్నా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మెరుగని ప్రధాని నరేంద్రమోదీ ఒక సభలో అన్నారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని ‘నంబర్‌ వన్‌ అవినీతిపరుడ’ని వ్యాఖ్యానించారు. విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాం త్‌ను 1987లో రాజీవ్‌ ‘ఫ్యామిలీ టాక్సీ’లా వాడుకున్నారని ఆరోపించారు. దీన్నంతటినీ చూసి ‘ఇప్పుడు జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలా... పరలోక్‌సభ ఎన్నికలా?’ అని ఓటర్‌ గందరగోళ పడుతున్నట్టు ఒక కార్టూనిస్టు వ్యంగ్య చిత్రం గీశాడు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఉపరితల రవాణామంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పిన మాటలు బాగు న్నాయి. కాంగ్రెస్‌నుద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా ఇవి ఆయన సొంత పార్టీతోసహా అంద రికీ వర్తిస్తాయి. చేసినవాటి గురించి చెప్పుకోవడానికి ఏం లేనప్పుడే ప్రత్యర్థులపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతారని గడ్కరీ అన్నారు.

ప్రత్యర్థుల్ని దూషించనని ప్రచారం ప్రారంభించినరోజునే తాను ప్రకటించానన్నారు. నాయకులంతా ఇలా ఉండగలిగితే మంచిదే. కానీ అలాంటివారెక్కడ? ఎవరికి వారు అవతలి పక్షం నోరు పారేసుకున్నది కాబట్టే తాము కూడా అనవలసివస్తున్నదని సమర్ధించుకుంటున్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని మొట్టికాయలు వేస్తే తప్ప ఆగటం లేదు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇండోర్‌ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌లపై ప్రచారాని కెళ్లవద్దంటూ ఎన్నికల సంఘం ఆంక్షలు విధించవలసివచ్చింది. కానీ అది ఉండాల్సినంత కఠినంగా ఉండటం లేదన్న విమర్శ ఎదుర్కొంటున్నది. ప్రజలకు కావాల్సింది వారి మౌలిక అవసరాలు తీరడం, ఉపాధి అవకాశాలు లభించడం, ప్రశాంతంగా, నిర్భయంగా జీవించడం. అవి ఏమేరకు సమకూర్చగలిగామో పాలకపక్షం చెప్పగలగాలి. వారి వైఫల్యాలేమిటో వివరించి, తామొస్తే ఏం చేస్తామో విపక్షం చెప్పాలి. అంతేతప్ప ఎవరికి వారు బజార్నపడి దూషణలతో పొద్దుపుచ్చుతూ, ఎన్నికలు వస్తున్నాయంటేనే జనం భయపడే స్థితికి నెట్టకూడదు. ఇదే వరస కొనసాగితే మున్ముందు ఓట్లన్నీ టోకుగా ‘నోటా’కే పోతాయని గుర్తుంచుకోవాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top