‘ఉమ్మడి ఎన్నికలు’ సబబేనా? | joint elections: law commissions 170th report | Sakshi
Sakshi News home page

‘ఉమ్మడి ఎన్నికలు’ సబబేనా?

Jun 11 2016 6:24 AM | Updated on Sep 4 2017 2:15 AM

‘ఉమ్మడి ఎన్నికలు’ సబబేనా?

‘ఉమ్మడి ఎన్నికలు’ సబబేనా?

కొన్నాళ్లక్రితం మొదలై సద్దుమణిగిందనుకున్న ‘ఉమ్మడి ఎన్నికల విధానం’ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది..

కొన్నాళ్లక్రితం మొదలై సద్దుమణిగిందనుకున్న ‘ఉమ్మడి ఎన్నికల విధానం’ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో ఏదో ఒకమూల నిరంతరం ఎన్నికలు జరగడంవల్ల ఖజానాపై అంతులేని భారం పడుతున్నదని, అభివృద్ధికి విఘాతం ఏర్పడుతున్నదని, పాలన కుంటుబడుతున్నదని ‘ఉమ్మడి ఎన్నికల’ వాదాన్ని వినిపి స్తున్నవారు చెబుతున్నారు. ఈ విషయమై 2012లో బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కె. అద్వానీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ కూడా రాశారు. అంతక్రితం ఎన్‌డీఏ సర్కారు అధికారంలో ఉండగా లా కమిషన్‌ 170వ నివేదిక ఇలాంటి సిఫార్సే చేసింది. ఈమధ్యే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. గత డిసెంబర్‌లో పార్లమెంటరీ సంఘం ముందు, కేంద్ర న్యాయ మంత్రి త్వశాఖ ఇటీవల అడిగినప్పుడు ఎన్నికల సంఘం సైతం ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. సమస్య ఉందనుకున్నప్పుడు దానికి పరిష్కారం అన్వేషించడం, ఆ పరి ష్కారంలోని లోటుపాట్లను చర్చించడం మంచిదే. అయితే పరిష్కారమే సమస్యగా మారకూడదు. రోగం ఒకటైతే మందు మరొకటి వేసే తీరు ఉండకూడదు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో అసెంబ్లీల కాల వ్యవధి ఒక్కోచోట ఒక్కోలా ఉంటున్నది. ఇటీవలి కాలాన్నే తీసుకుంటే 2014లో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. నిరుడు బీహార్‌ అసెంబ్లీకి, ఈ సంవత్సరం పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించారు. వచ్చే సంవత్సరం యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. 2018లో గుజరాత్, కర్ణాటక, మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలొస్తాయి. ఆ మరుసటి ఏడాదికల్లా లోక్‌సభ ఎన్నికలుంటాయి. ఇలా ఏటా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగడం వల్ల వాటి నిర్వహణ వ్యయం అపరిమితంగా ఉంటున్నదని, భారీ సంఖ్యలో సిబ్బంది, భద్రతా బలగాల కేటాయింపు...అందువల్ల పరిపాలనకు అవ రోధాలు ఏర్పడటం పెను సమస్యగా మారిందని ‘ఉమ్మడి ఎన్నికల’ ప్రతిపాదనను సమర్ధిస్తున్నవారు చెబుతున్నారు. ఇవన్నీకాక ఎన్నికల సమయంలో అమల్లోకొచ్చే ప్రవర్తనా నియమావళి వల్ల విధాన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యపడటం లేదంటున్నారు. అటు పార్టీలు కూడా ధారాళంగా ఖర్చు పెట్టవలసి వస్తోంది.  

పైకి  చెప్పడం లేదుగానీ...పాలకులుగా ఉంటున్నవారికి ఈ ‘నిరంతర ఎన్నికలు’ తెస్తున్న అసలు సమస్యలు వేరే ఉన్నాయి. ధరలు పెంచాలన్నా, సంస్కరణలకు సంబంధించిన కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నా దేశంలో ఏదో ఒకమూల ముంచుకొస్తున్న ఎన్నికలు వారికి ‘తలనొప్పి’గా మారుతున్నాయి. ఒక రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యాయి కదా అని తీసుకున్న నిర్ణయం...మరో రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు గుదిబండగా మారుతోంది. సామాన్య పౌరులకు ఎదురవుతున్న సమస్యలు వేరు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కుల, మత విభేదాలు ముందుకు రావడం, నేతలు రెచ్చగొట్టే ఉపన్యాసాలివ్వడం, వివిధ పార్టీ శ్రేణులు కయ్యానికి కాలుదువ్వడం, హింసాత్మక చర్యలకు దిగడం, విచ్చలవిడిగా నల్లడబ్బు చలామణిలోకి రావడం వగైరాలను వారు ప్రధాన సమస్యలుగా చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే తమ తీర్పును వమ్ము చేసేలా గెలిచినవారు స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించడం వారికి ఆగ్రహం కలిగిస్తోంది. ఇవన్నీ మొత్తంగా ఎన్నికల వ్యవస్థపైనే వారిలో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. వీటిపై పాలకులుగానీ, పార్టీలుగానీ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. సరిచేసుకుంటున్న జాడలు లేవు.

అసలు 1952 తొలి సార్వత్రిక ఎన్నికలు మొదలుకొని 1967 వరకూ లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించగా ఆ తర్వాత ఎందుకని సాధ్యం కాలేదు? 1972కు ముగియాల్సిన లోక్‌సభను గడువుకు ముందే 1971లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ రద్దు చేయడంవల్ల ఈ స్థితి ఏర్పడింది. ఆ తర్వాత 1984లో రాజీవ్‌గాంధీ కూడా ఆ పనే చేశారు. మరికొన్ని నెలల వ్యవధి ఉండగానే లోక్‌సభను రద్దుచేశారు. 1989, 1999లలో ఏర్పడ్డ ప్రభుత్వాలు రెండేళ్ల వ్యవధిలోనే కుప్ప కూలగా...ఆ రెండుసార్లూ లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు రాకతప్పలేదు. 1998 ఎన్నికల అనంతరం ఏర్పడ్డ వాజపేయి ప్రభుత్వం 13 నెలల తర్వాత రాజీనామా చేయాల్సిరావడంతో 1999లో మరోసారి ఎన్నికలు తప్పలేదు. ఇప్పుడు ‘ఉమ్మడి ఎన్నికల’ విధానం అమల్లోకి తెచ్చినా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తబోవని ఎవరైనా హామీ ఇవ్వగలరా? ఒకవేళ ఆ పరిస్థితులే తలెత్తి ఎవరూ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేయలేకపోతే అప్పుడేం చేస్తారు? రాష్ట్రాల్లో అయితే రాష్ట్రపతి పాలన విధిస్తామని చెప్పొచ్చు.

కానీ ఎన్నికలు జరిగిన ఏడాదిలోగా ప్రభుత్వం కుప్పకూలితే మిగిలిన నాలుగేళ్లూ రాష్ట్రపతి పాలనే ఉంటుందా? అదే జరిగితే దాన్ని ప్రజాస్వామ్యం అనొచ్చునా? ఇది ఫెడరల్‌ స్ఫూర్తికి భంగం కలిగించడం కాదా? ‘ఉమ్మడి ఎన్నికల’ ప్రతిపాదన చేస్తున్నవారు ఇలాంటి సందర్భాలు తలెత్తితే ఏం చేయాలన్న విషయంలో మౌనం పాటిస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాల్లోని అంశాల ప్రాతిపదికన జరుగుతాయి. జాతీయ ప్రాముఖ్యం గల అంశాలు, ఆకాంక్షలు ప్రధాన పాత్ర పోషించే సార్వత్రిక ఎన్నికలను వీటితో ముడిపెట్టడంవల్ల రాష్ట్రాల్లోని అంశాలు మరుగునపడే అవకాశం లేదా? ‘ఉమ్మడి ఎన్నికల’ సందర్భాల్లో లోక్‌సభకు ఒక పార్టీని, అసెంబ్లీకి వేరొక పార్టీని గెలిపించే విచక్షణ ఓటరుకు ఉంటున్నదని కొందరంటారు. కానీ 1999 తర్వాత జరిగిన ఎన్నికల ఫలితాల డేటాను విశ్లేషించిన నిపుణులు మాత్రం

దీన్ని తోసిపుచ్చుతున్నారు. ఒకే పార్టీకి ఓటేసే అవకాశాలు 77 శాతం వరకూ ఉన్నాయని వారు తేల్చారు. ‘ఉమ్మడి ఎన్నికల’ ప్రతిపాదనకు ఏర్పడే రాజ్యాంగ పరమైన అవరోధాల సంగతలా ఉంచి...అది ఫెడరల్‌ స్ఫూర్తిని విరుద్ధమని, ప్రజల ఆకాంక్షలను దెబ్బతీస్తుందని అనేకమంది రాజ్యాంగ నిపుణులు చెబుతున్న మాట. ఎన్నికైన సర్కారు తీరు సక్రమంగా లేనిపక్షంలో దాన్ని‘రీకాల్‌’ చేసే హక్కు పౌరులకుండాలని ప్రజాస్వామికవాదులు కోరుతున్న వేళ ‘ఉమ్మడి ఎన్నికల’ ప్రతిపాదన ముందుకు రావడం విచిత్రం. ఇందుకు బదులు ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసి, దాని విశ్వసనీయతను పెంచే దిశగా చర్యలు తీసుకోవడం ఇప్పటి అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement