
నేటి నుంచి రబీ సేద్యం
జిల్లాలో శనివారం నుంచి రబీ వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలపై రబీ ఆధారపడి ఉంది.
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో శనివారం నుంచి రబీ వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలపై రబీ ఆధారపడి ఉంది. ఖరీఫ్ దెబ్బతీయడంతో ‘అనంత’ రైతులు రబీపై ఆశలు పెట్టుకుని రంగంలోకి దిగుతున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రబీ పరిగణలోకి తీసుకోగా ఈ మూడు నెలల కాలంలో 155.5 మి.మీ వర్షం పడాల్సి ఉంది. అందులో అక్టోబర్‌లోనే 110.7 మి.మీ, నవంబర్‌లో 34.7 మి.మీ, డిసెంబర్‌లో 9.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఒక్కోసారి నవంబర్‌లో సంభవించే తుఫాన్ల వల్ల అధిక వర్షం పడిన దాఖలాలు ఉన్నాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన కంది, ఆముదం, పత్తి వంటి పంటలకు కూడా రబీలో కురిసే వర్షాలే ప్రధానం.
మొత్తమ్మీద ఈ రబీలో 1,45,704 హెక్టార్లలో పంటలు సాగులోకి రానున్నాయని అధికారులు అంచనా వేశారు. అందులో వర్షాధారంగా 94,710 హెక్టార్లు, నీటి వసతి కింద 50,994 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావచ్చని అంచనా వేశారు. రబీ ప్రధానపంటగా పప్పుశనగ 77,567 హెక్టార్లలో సాగులోకి రావచ్చన్నారు. నీటి వసతి కింద వేరుశనగ పంట 19,330 హెక్టార్లుగా గుర్తించారు. వరి 10 వేల హెక్టార్లు, జొన్న 6,700 హెక్టార్లు, మొక్కజొన్న 6 వేల హెక్టార్లు, పొద్దుతిరుగుడు 4,600 హెక్టార్లు, ఉలవ 3,800 హెక్టార్ల విస్తీర్ణంలో వేసే అవకాశం ఉందని అంచనా వేశారు.
35 మండలాల్లో పప్పుశనగ :
విడపనకల్‌లో 15 వేల హెక్టార్లు, వజ్రకరూరు, ఉరవకొండ మండలాల్లో 10 వేల హెక్టార్ల చొప్పున విస్తీర్ణంలో పప్పుశనగ వేసే అవకాశం ఉందంటున్నారు. అధికారులు. బెళుగుప్ప, కనేకల్లు, బొమ్మనహాల్, పుట్లూరు, తాడిపత్రి, యల్లనూరు, పెద్దపప్పూరు, గుంతకల్లు, యాడికి, రొద్దం, డి.హీరేహాల్ మండలాల్లో పప్పుశనగ ఎక్కువగా సాగులోకి రావచ్చని అంచనా. 35 మండలాల్లో పప్పుశనగ పంట వేస్తున్నట్లు అంచనా వేశారు. వేరుశనగ జిల్లా అంతటా వేసే అవకాశం ఉన్నా 20 మండలాల్లో ఎక్కువగా సాగు చేసే పరిస్థితి ఉంది. తాడిపత్రి, పుట్లూరు, యాడికి, యల్లనూరు, డి.హీరేహాల్, పెద్దపప్పూరు, బొమ్మనహాల్, ఎన్‌పీ కుంట, అమడగూరు మండలాల్లో పొద్దుతిరుగుడు పంట ఎక్కువగా వేయవచ్చని పేర్కొన్నారు. రబీలో పంటల వారీగా సాధారణ సాగు విస్తీర్ణం ఇలా ఉంది.
–––––––––––––––––––––––––––––––––––––––––––––
పంట సాధారణం (హెక్టార్లలో) పంట సాధారణం (హెక్టార్లలో)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
పప్పుశనగ 77,564 వేరుశనగ 19,330
వరి 10,074 జొన్న 6,672
మొక్కజొన్న 5,926 పొద్దుతిరుగుడు 4,673
ఉలవ 3,855 రాగి 939
ఉల్లి 407 ప్రత్తి 392
పెసర 344 ఆముదం 341
పొగాకు 194 మినుములు 157
చెరకు 141 కుసుమ 126