మీకు తెలుసా?

మీకు తెలుసా?


పెనుకొండ దుర్గం

జిల్లాలోని గిరి దుర్గాలలో ప్రఖ్యాతిగాంచింది పెనుకొండ దుర్గం. దీనిని పెనుకొండ ఘనగిరి అని శాసనాల్లో పేర్కొన్నారు. రెండు ఆమడల వైశాల్యంలో బలిష్టమైన ఈ దుర్గం 914 మీటర్ల ఎత్తున కొండపై నిర్మించారు. దుర్గం చుట్టూ పెద్ద అగడ్త ఉంది. నాలుగు ముఖద్వారాలున్నాయి. ఉత్తరం వైపు ద్వారాన్ని మహా ద్వారమని అంటారు. అలనాటి ప్రాభవాన్ని, శిల్ప చాతుర్యాన్ని చాటే గొప్ప కట్టడాలు నేటికీ ఇక్కడ చూడవచ్చు. కోటలో కోట పద్ధతిలో మొత్తం ఏడు కోటలుగా నిర్మించారు. దుర్గంలోని రాజధానికి దక్షిణంగా మూడు శిలా ప్రాకారాలు,  365 ఆలయాలు ఉండేవి. పలుసార్లు విదేశీ దండయాత్రల ఫలితంగా సుందర ఆలయాలు మట్టిలో కలిసిపోయాయి. ఇక్కడి గగన్‌మహల్‌ క్రీ.శ. 1575లో నిర్మితమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.



ఇది ఒకనాటి సార్వభౌములకు వేసవి విడిదిగా విరాజిల్లింది. ఈ కోటను క్రియాశక్త ఓడయార్‌ కట్టించినట్లు ప్రతీతి. క్రీస్తుకు పూర్వం మౌర్యుల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని తర్వాత శాతవాహనులు, బాదామి చాళుక్యులు, బాణరాజులు, రాష్ట్ర కూటులు, నొలంబ పల్లవులు, కల్యాణ చాళుక్యులు, దేవగిరి యాదవులు పాలించారు. క్రీ.శ. 1357లో బుక్కరాయలు తన కుమారుడైన విరుపణ్ణను పెనుకొండ రక్షకుడిగా నియమించారు. ఆ తర్వాత చిక్క ఒడయారు అనే మంత్రి ఈ కోట రక్షకుడై దీనిని పునర్‌నిర్మాణం చేసి శత్రుదుర్భేద్యంగా మార్చారు. తర్వాత కొన్నేళ్లకు ఉమ్మతూరు గంగరాజు దీనిని జయించగా, శ్రీకృష్ణదేవరాయలు అతనిని ఓడించి కోటను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పటి విజయనగర సార్వభౌముడు సదాశివరాయల సమాధి ఇక్కడే ఉంది. ఆధునాతన ఇంజినీర్లను సవాల్‌ చేస్తూ, ఆంధ్రుల శిల్ప కళా శక్తికి, నిర్మాణ నైపుణ్యానికి మచ్చుతునకగా మిగిలిన పెనుకొండ దుర్గం అనంతపురం - బెంగళూరు రహదారి మార‍్గంలో జిల్లా కేంద్రానికి 78 కిలోమీటర్ల దూరంలో ఉంది.

- పెనుకొండ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top