వాయిదా వేద్దాం..!
అహనా పెళ్లంట సినిమా గుర్తుందా.. ఆ చిత్రంలో లక్ష్మీపతి (కోట) కంచం ముందు కోడిని వేలాడదీసుకొని పొడి అన్నం తింటూ..
కొనే శక్తి, ఆసక్తి రెండూ లేవు
ఇంటి ఖర్చులకూ రేషన్..
చిల్లర దొరక్క పరేషాన్
సండే స్పెషల్ ఐటమ్స్ నో..
సాక్షి,సిటీబ్యూరో: అహనా పెళ్లంట సినిమా గుర్తుందా.. ఆ చిత్రంలో లక్ష్మీపతి (కోట) కంచం ముందు కోడిని వేలాడదీసుకొని పొడి అన్నం తింటూ.. కోడికూర తింటున్నట్టు ఊహించుకొంటాడు. మరీ వివరాల్లోకి వెళ్లొద్దు కానీ.. కరెన్సీ కటకట ఇప్పుడు అందరికీ అలాంటి పరిస్థితినే తెచ్చిపెట్టింది. సగటు నగర జీవికి సర్దుకుపోవడం అలవాటు చేసింది. జనం ఖాతాల్లో డబ్బున్న పీనాసులయ్యారు. సండే వచ్చిందంటే వెరైటీ డిష్‌లు కోరుకొనేవారు సైతం ఇప్పుడు ఇంట్లో ఉన్నదానితో సరిపెట్టుకుంటున్నారు. వీకెండ్ పార్టీ అంటే హుషారుగుండేవారు.. ఇప్పుడు నీరుగారిపోతున్నారు. కాలక్షేపాలు, పిల్లల సరదాలు, విందులు, వినోదాలు అన్నీ బంద్ అయ్యాయి.
నోట్ల రద్దుతో వచ్చిపడ్డ ఈ నయా సంస్కృతితో ‘వచ్చే వారం చూద్దాంలే’ అనుకొంటూ వారుుదా పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. పెద్ద నోట్లపై వేటు పడి ఇప్పటికి మూడు ఆదివారాలు గడిచి నాలుగోది కూడా వచ్చేసింది. మొదట్లో ‘సండే వచ్చింది. ఏ వెరైటీ లేదాయె!’ అని ఇబ్బంది పడ్డవారు.. ఇప్పుడు ‘దొరికిందే వెరైటీ’ అని సర్దుకుపోతున్నారు. చికెన్, మటన్ బిరియానీలు, స్వీట్లు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్‌లు, పార్కు, నెక్లెస్‌రోడ్డులో షికార్లు, ఐమాక్స్‌లో సినిమాలు.. అన్నీ వాయిదాల పర్వంలో భాగమైపోయాయి. నవంబర్ రెండోవారం నుంచి ఇప్పటి వరకు కరెన్సీ కొరత కారణంగా నగరంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో నెలకొన్న బలవంతపు పొదుపు సంస్కృతిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
అంతా ఆచి తూచి ఖర్చు..
ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు ప్రతి ఒక్కరి మదిలో మెదిలేది ‘రేపెట్లా’ అనే ఆవేదనే. తెరుచుకోని ఏటీఎంలు, ఒకటీ, రెండూ పనిచేసినా ఫర్లంగుల కొద్దీ కనిపించే రద్దీ పట్టపగలు చుక్కలు చూపిస్తున్నారుు. రూ.10వేల కోసం బ్యాంకుకెళితే రూ.2 వేలు చేతికిచ్చి పంపింస్తున్నారు. పొద్దంతా ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తే వచ్చేది ఒక్క రూ.రెండు వేల నోటు. దాన్ని మార్చుకునేందుకు చిల్లర దొరక్క జనం నానాబాధలు పడుతున్నారు. అకౌంట్‌లో డబ్బున్నా చేతికి రాక.. వచ్చిన పెద్ద నోట్లును మార్చుకోలేక.. ప్రతి చిల్లర రూపాయిని ఆచుతూచి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. తప్పనిసరైతే తప్ప జేబులోని డబ్బులు బయటకు తీయడం లేదు.
ఉదయం పాలు, కూరగాయలు, ఆఫీసుకెళ్లేందుకు బండికి పెట్రోలు.. లేదంటే బస్సుకు చార్జీలు.. ఇంట్లో సరుకులు నిండుకున్నా, డబ్బాలో బియ్యం అడుగున పడ్డా ‘రేపు చూద్దాం.. ఈరోజుకు సర్దుకుందాం’ అనుకోవడం పరిపాటిగా మారింది. సాయంత్రం ఇంటికి వెళ్లేపటప్పుడు పిల్లలకు పండ్లు, బేకరీ ఫుడ్‌స కొనడం తగ్గించేశారు. కోరికలన్నీ వాయిదా జాబితాలోకి చేర్చేశారు. ‘వైద్యం, తప్పనిసరి మందులు మినహా సాధారణ నొప్పులు, జ్వరాలు, చిన్న జబ్బులకు డాక్టర్‌ను సంప్రదించడం కూడా తగ్గించుకున్నాం’ అన్నవాళ్లూ ఇప్పుడు నగరంలో అడుగడుగునా తారసపడుతున్నారు. కొత్త బట్టలు కొనాలన్నా, ఇంట్లోకి కొత్త వస్తువులు తేవాలన్నా వంద సార్లు ఆలోచిస్తున్నారు. నగరంలో అలవడిన ఈ నయా సంస్కృతిపై సిటీజన్‌స అభిప్రాయం ఇలా ఉంది.