
పచ్చని పండుగ
హరితోద్యమం మొదలైంది. ఊరు.. వాడా పచ్చదనం వెల్లివిరిసింది. ఉత్సాహపూరిత వాతావరణంలో రెండో విడత ‘హరితహారం’
♦ ఊరూరా మొదలైన హరితోద్యమం లాంఛనంగా హరితహారం ప్రారంభం
♦ భారీగా మొక్కలు నాటిన మంత్రులు, ఉన్నతాధికారులు
♦ మొయినాబాద్ మండలంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ
♦ వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో మొక్కనాటిన మంత్రి మహేందర్‌రెడ్డి
♦ సైబరాబాద్ కమిషనరేట్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్
♦ తొలిరోజు లక్షన్నర మొక్కలకు జీవం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : హరితోద్యమం మొదలైంది. ఊరు.. వాడా పచ్చదనం వెల్లివిరిసింది. ఉత్సాహపూరిత వాతావరణంలో రెండో విడత ‘హరితహారం’ లాంఛనంగా ప్రారంభమైంది. పల్లెపల్లెనా ఆకుపచ్చని పండగ సందడి నెలకొంది. వివిధ సంస్థల సహకారంతో ఇప్పటివరకు 10 లక్షల మొక్కలు నాటిన అధికారయంత్రాంగం.. ఇందులో తొలిరోజు లక్షన్నర మొక్కలకు జీవం పోసింది. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో మహేందర్‌రెడ్డి మొక్కను నాటి హరితహారానికి శ్రీకారం చుట్టగా.. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సైబరాబాద్ కమిషనరేట్‌లో.. పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటారు.
ఇక పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు శామీర్‌పేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులకు పోటీగా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా హరితహారంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. మొయినాబాద్ మండలంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ ఆమ్రపాలి, మేడ్చల్‌లో సహకార కార్యదర్శి పార్థసారథి, మహేశ్వరం మండలంలో హౌసింగ్‌బోర్డు కమిషనర్ అశోక్ మొక్కలు నాటి సామాజిక బాధ్యతను గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కింద జిల్లాలో 2.53 కోట్ల మొక్కలు పెట్టాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇదివరకే గుంతలు తీసిన వాటిలో మొక్కలు కూడా నాటింది. కాగా, శుక్రవారం అత్యధికంగా అబ్కారీ శాఖ మొక్కలు పెట్టింది. సుమారు 46 వేల ఈత, ఖర్జూర చెట్లను చెరువు గట్లపై నాటడం ద్వారా రికార్డు నమోదు చేసింది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ పర్యటన పురస్కరించుకొని విజయవాడ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఇందులో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, అధికారపార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. కాగా, ఆయా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా హరితహారం ఘనంగా ప్రారంభమైంది.