
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని కోటగల్లికి చెందిన వివాహిత గురువారం బాసర వద్ద గోదావరి నదిలో మృతదేహామై తేలింది. అయితే, ఇది ఆత్మహత్యా లేక హత్యనా? అన్న దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు, ఆమె రెండేళ్ల కూతురి ఆచూకీ లేకుండా పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన నిఖిలేశ్, భవాని (29) దంపతులు కోటగల్లిలోని అద్దెకుంటున్నారు. వీరికి రెండేళ్ల కూతురు శ్రీహర్ష ఉంది. ఏం జరిగిందో ఏమో కానీ భవాని గురువారం ఉదయం ఇంటికి తాళం వేసి, తాళం చేవితో పాటు తన ఫోన్‌ను ఇంటి యజమానికి ఇచ్చి బయటకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. అనంతరం ఆమె మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాసర వద్ద గోదావరి బ్రిడ్జి నుంచి నదిలో దూకినట్లు బాసర ఎస్సై తోట మహేష్ తెలిపారు.
అయితే, భవాని మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. భవాని బాసర బ్రిడ్జి వద్ద గోదావరి నదిలోకి దూకే సమయంలో రెండు బైకులపై ఇద్దరు మగవాళ్లు, చుడీదార్ ధరించిన మహిళ అక్కడే ఉన్నట్లు తెలిసింది. ఆ ముగ్గురు ఎవరు, వారికి భవానికి గల సంబంధం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు జరిగాయా.. వీరి మధ్య వివాదానికి వేరే మహిళ కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాసర పోలీసులు నిఖిలేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు ఆమె భర్త నిఖిలేశ్ మధ్యాహ్నం 1.20 గంటలకు భవాని తల్లి జ్యోతి వద్దకు వెళ్లి తన భార్య గురించి వాకబు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి నిఖిలేశ్‌కు అతడి స్నేహితుడు ఫోన్ చేయడంతో ఇద్దరు కలిసి బాసరకు వెళ్లారు. అప్పటికే నదిలో బయటపడిన తన భార్య మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. మరోవైపు భవాని తన వెంట తీసుకెళ్లిన రెండేళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.