కాటేసిన కరెంట్‌       | Two Died By Electric Shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరి మృతి

Aug 3 2018 10:35 AM | Updated on Oct 16 2018 3:15 PM

Two Died By Electric Shock  - Sakshi

సంఘటనా స్థలంలో మృతదేహాలు

అల్లాదుర్గం(మెదక్‌) : విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలు బలయ్యయి. ఈ ఘటన గురువారం అల్లాదుర్గం మండలం చిల్వెరలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గీత కార్మికుడు సంగమేశ్వర్‌గౌడ్‌ బుధవారం సాయంత్రం కల్లుగీచేందుకు శివారులోని ఈదుల్లోకి వెళ్లారు. అతని వెంట స్థానిక యువకుడు ఎండీ శాహనవాస్‌ సరదాగా వెళ్లాడు.

విద్యుత్‌ అధికారులు ట్రాన్స్‌పార్మర్‌ నుంచి నేరుగా ఓ రైతు బోరుకు కనేక్షన్‌ ఇచ్చారు. కనెక్షన్‌ ఇచ్చిన తీగకు అతుకులు ఉండడం, అది ఇనుప కంచెను తాకడంతో విద్యుత్‌ ప్రసారం అయ్యింది. ఈ విషయం తెలియని ఇద్దరు కంచె పక్కన ఉన్న బురదమయమైన దారిలో నడుస్తూ కింద పడకుండా సపోర్టు కోసం ఇనుప తీగలను పట్టుకున్నారు.

దీంతో విద్యుత్‌ షాక్‌కి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వీరు రాత్రి ఇంటికి రాక పొవడంతో తోటి గీత కార్మికులను, స్నేహితులను కుటుంబ సభ్యులు అడిగినా జాడ తెలియలేదు. గురువారం ఉదయం నల్లపోచమ్మ గుడి వద్ద ఎండీ యూసూఫ్‌ మామిడి తోట ఇనుప కంచేకు అనుకుని సంగమేశ్వర్, శాహనవాస్‌ మృతి చెంది కనిపించారు. 

రహదారిపై రాస్తారోకో

విద్యుత్‌ అధికారులు, రైతు నయూం నిర్లక్ష్యం వల్ల రెండు ప్రాణాలు పోయాయని మృతిడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. అధికారులు సంఘటనా స్థలానికి రాకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు చిల్వెర గ్రామ శివారులో హైదరాబాద్, అకోలా జాతీయ రహదారిపై ఆరగంట పాటు రాస్తారోకో చేశారు.

విషయం తెలుసుకున్న అల్లాదుర్గం హెడ్‌కానిస్టేబుల్‌ దయానంద్‌ రాస్తారోకో ఆందోళన కారులను సముదాయించి, అధికారులను పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు. విషయం తెలుసుకున్న అల్లాదుర్గం సీఐ రవీందర్‌రెడ్డి, టేక్మాల్‌ ఎస్‌ఐ ఎల్లగౌడ్, అల్లాదుర్గం ఎస్‌ఐ హహ్మద్‌గౌస్‌ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు సంగమేశ్వర్‌ భార్యా ఆలవేణి ఫిర్యాదు మేరకు కెసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జోగిపేట ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు.

మృతుడికి ముగ్గురు పిల్లలు

విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందిన సంగమేశ్వర్‌ ఇద్దరు కుమారులు, ఒక కూతురు, భార్య ఉన్నారు. సంఘటన స్థలంలో మృతుడి భార్య, పిల్లలు రోదనలు అక్కడ ఉన్నవారిని కంట తడి పెట్టించాయి. మృతి చెందిన యువకుడు శాహనవాస్‌ పది పూర్తి చేసి ఐటీఐ చేయడానికి సన్నద్ధం అవతున్నట్లు తెలిసింది.

రూ. 5 లక్షల ఆర్థిక సహాయం..

విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన సంగమేశ్వర్‌గౌడ్, శాహనవాస్‌ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని విద్యుత్‌ శాఖ డీఈఈ రవీందర్‌ రెడ్డి చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు .నెల రోజుల్లో ఆర్థిక సహయం అందేలా కృషి చేస్తానని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement