ముగ్గురూ మహా ముదుర్లు!

Murder Case Reveals After Ten Years in Hyderabad - Sakshi

పదేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితులు

హతుడితో సహా అందరూ

కరడుగట్టిన నేరస్తులే

పరారీలో ఉన్న సూత్రధారి కోసం గాలింపు

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్, ఆర్‌జీఐఏ ఠాణా పరిధిలో పదేళ్ల క్రితం ఎస్కే బాషను హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురూ మహా ముదుర్లని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో హతుడితో సహా అందరికీ నేరచరిత్ర ఉన్నట్లు తెలిపారు. బాష హత్య కేసుకు సంబంధించి అల్లం సురేష్, మహ్మద్‌ వశీంలను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే. పరారీలో ఉన్న సూత్రధారి పల్నాటి శ్రీనివాస్‌ కోసం గాలిస్తున్నారు. అందరూ నేర చరితులే.

ఎస్‌కే బాష (హతుడు)
 కడప పట్టణం శ్రీదేవి కాలనీకి చెందిన బాషా నగరానికి వలసవచ్చి పార్శిగుట్టలో స్థిరపడ్డాడు. టీ వెండర్‌గా జీవితం ప్రారంభించి నేరగాడిగా మారిన ఇతను ఘరానా దొంగ. తాళం వేసి ఇళ్ళల్లో చోరీలు చేసేవాడు. అతడిపై హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని చిలకలగూడ, చిక్కడపల్లి, సైబరాబాద్‌లోని నార్సింగి, బాలానగర్, రాజేంద్రనగర్, రాచకొండ పరిధిలోని  సరూర్‌నగర్, ఉప్పల్‌ ఠాణాల్లో పదుల సంఖ్యలో కేసులుఉన్నాయి.

మహ్మద్‌ వశీం
 బహదూర్‌పుర ఠాణా, బండ్లగూడకు చెందిన ఇతడు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 2016లో బహదూర్‌పురలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అఫ్జల్‌గంజ్‌లో దోపిడీ, కామాటిపురలో వాహనాల చోరీ కేసులు సైతం ఇతడిపై నమోదయ్యాయి. పల్నాటి శ్రీనివాస్‌కు కీలక అనుచరుడిగా ఉంటున్నాడు. 2001లో చంచల్‌గూడ జైలులో పల్నాటి శ్రీనివాస్‌తో అల్లం సురేష్‌కు పరిచయం ఏర్పడింది. సురేష్‌ ద్వారా వశీం సైతం శ్రీనివాస్‌కు దగ్గరయ్యాడు. పల్నాటి శ్రీను భూ కబ్జాలు, బెదిరింపులకు సైతం పాల్పడటంతో అనేక మంది శత్రువులు ఏర్పడ్డారు. దీంతో కోర్టు వాయిదాలకు వెళ్లిన ప్రతిసారీ సురేష్, వశీం అతడికి బాడీగార్డులుగా ఉండేవారు.  

పల్నాటి శ్రీనివాస్‌ (సూత్రధారి)
సికింద్రాబాద్‌లోని పార్శిగుట్టకు చెందిన ఇతను వృత్తిరీత్యా రియల్టర్‌. హైదరాబాద్‌లోని సైదాబాద్, సైబరాబాద్‌లోని దుండిగల్, బాలానగర్‌లతో పాటు రాచకొండలోని కుషాయిగూడ పరిధిలో నాలుగు హత్య కేసులు ఉన్నాయి. వీటిలో సుపారీ హత్యలే అధికం. 1998లో బాలానగర్‌ పరిధిలో రౌడీషీటర్‌ గోవింద్‌ రాజ్‌ను హత్య చేశాడు. అదే ఏడాది కృష్ణారెడ్డి అనే వ్యక్తి నుంచి సుపారీ తీసుకుని సైదాబాద్‌ పరిధిలో నరేందర్‌రెడ్డిని హత్య చేశాడు. గాంధీనగర్‌కు చెందిన మాజీ రౌడీషీటర్‌ రియాజ్‌ను చంపేందుకు 2003లో వరంగల్‌కు చెందిన మాజీ నక్సలైట్‌ నక్కా మోహన్‌ నుంచి సుపారీ తీసుకున్నాడు. ఇందులో సఫలీకృతుడు కాలేకపోయిన శ్రీనివాస్‌ అంతటితో ఆగలేదు. ఆ తర్వాత రియాజ్‌ నుంచి సుపారీ తీసుకుని కుషాయిగూడ పరిదిలో నక్కా మోహన్‌ను హత్య చేశాడు. 2005లో దుండిగల్‌లో బొల్లారం ప్రాంతానికి చెందిన అశోక్‌ చారిని హత్య చేశాడు. ముషీరాబాద్, బోయిన్‌పల్లి, ఉప్పల్‌ పోలీసుస్టేషన్లలో ఇతడిపై ఆయుధ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.  

అల్లం సురేష్‌:  హుస్సేనిఆలం పోలీసుస్టేషన్‌ పరిధిలోని దూద్‌బౌలికి చెందిన ఇతను వృత్తిరీత్యా స్క్రాప్‌ వ్యాపారి. పల్నాటి శ్రీనివాస్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఇతగాడు అతడి ఆదేశాల మేరకే నేరాలు చేశాడు. శ్రీనివాస్‌ సోదరుడు పల్నాటి రాకేష్‌తో కలిసి 14 ఇళ్లల్లో చోరీలు చేశాడు. సైబరాబాద్‌లోని కేపీహెచ్‌బీ, మాదాపూర్, జీడిమెట్ల, పేట్‌ బషీరాబాద్, బాలానగర్, అల్వాల్, రాచకొండలోని మీర్‌పేటల్లో అతడిపై కేసులు ఉన్నాయి. మీర్‌చౌక్, హుస్సేనిఆలం పోలీసుస్టేషన్ల పరిధిలో వాహనాలను దొంగతనం చేశాడు. ఆయుధ చట్టం కింద పల్నాటి శ్రీనును ముషీరాబాద్, బోయిన్‌పల్లి పోలీసులు పట్టుకున్నప్పుడు ఇతనూ చిక్కాడు.  

అనుమానం వచ్చి అజ్ఞాతంలోకి...
చోరీ సొత్తును విక్రయించడంతో పాటు గర్ల్‌ఫ్రెండ్‌ విషయంలో శ్రీనివాస్, బాషల మధ్య స్పర్థలు వచ్చాయి. శ్రీను తాను సుపారీ తీసుకుని హత్యలు చేసినప్పటికీ బాషను చంపడానికి మాత్రం సురేష్, వశీంలతో రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2009 మే 9 రాత్రి ఈ హత్య జరిగింది. ఆ మర్నాడు ఆర్‌జీఐఏ ఠాణాలో కేసు నమోదు కావడం, కొన్నాళ్ళకు ఇది మూతపడటంతో తామంతా సేఫ్‌ అని నిందితులు భావించారు. అయితే ఇటీవల వశీం తన భార్యకు ఇచ్చిన ‘వార్నింగ్‌’తో విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వశీంతో పాటు సురేష్‌ను పట్టుకున్నారు. వీరిద్దరినీ పోలీసులు తీసుకువెళ్లడంతో పదేళ్ల క్రితం నాటి హత్య కేసు బయటపడిందని అనుమానించిన శ్రీను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దీంతో ఇటు టాస్క్‌ఫోర్స్, అటు ఆర్‌జీఐఏ పోలీసులు శ్రీను కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top