కార్లను దొంగలిస్తాడు..దర్జాగా తిరుగుతాడు | Congress Youth Leader Arrested Who Stole Cars In Guntur | Sakshi
Sakshi News home page

దొంగిలించిన కార్లలో దర్జాగా..  

Jul 10 2019 10:48 AM | Updated on Jul 10 2019 10:48 AM

Congress Youth Leader Arrested Who Stole Cars In Guntur  - Sakshi

పోలీసుల అదుపులో నకిలీ నంబర్‌తో కారు

సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : దొంగలించిన కార్లకు నంబర్‌ ప్లేట్‌లు మార్చి దర్జాగా తిరుగుతున్న ఓ కాంగ్రెస్‌ పార్టీ యువజన రాష్ట్ర నాయకుడి బండారం బట్టబయలైంది. చీటింగ్‌ కేసులో పట్టుబడ్డ నిందితుడి విచారిస్తే అక్రమ కార్ల డొంక కదిలింది.  నిందితుడిని అరెస్ట్‌ చేసి నకిలీ నంబర్‌ ప్లేట్‌తో ఉన్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బరంపేటకు చెందిన అడపా విజయకు కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గత సార్వత్రిక ఎన్నికల్లో వినుకొండ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అట్లూరి విజయ కుమార్‌ తనను న్యాయవాదిగా పరిచయం చేసుకున్నాడు.

అతడి స్నేహితుడు చిచ్చుల శ్రీనివాసరావుకు డబ్బులు అవసరమని చెప్పి ఆమె వద్ద నుంచి రూ.3.50 లక్షలు అప్పుగా తీసుకొని ఇద్దరూ ప్రామిసరీ నోట్‌ రాశారు. డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఇద్దరి ప్రవర్తనపై అనుమానం వచ్చి విచారించగా విజయకుమార్‌ న్యాయవాది కాదని తెలిసింది. అదేవిధంగా చిచ్చుల శ్రీనివాసరావు పేరుతో తన్నీరు వెంకటేష్‌ సంతకం చేసి డబ్బులు తీసుకున్నట్లు అడపా విజయ గుర్తించింది. మోసపోయానని గ్రహించి డబ్బులు తిరిగి ఇవ్వాలని పెద్ద మనుషులతో వెళ్లి నిలదీసింది.

దీంతో తనకు రాజకీయ పలుకుబడి ఉందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబుతో మాట్లాడి నీ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని విజయను నమ్మబలికాడు. అయితే నెలలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించక పోవటంతో డబ్బుల విషయంపై ప్రశ్నించింది. ఈ క్రమంలో విజయకుమార్‌ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు జిల్లా రూరల్‌ ఎస్పీ జయలక్ష్మీకి ఫిర్యాదు చేసింది. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వన్‌టౌన్‌పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. 

తీగలాగితే కదిలిన అక్రమ కార్ల డొంక..
విజయకుమార్‌ను మంగళవారం వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని దొంగ కార్ల భాగోతం వెలుగు చూసింది. హైదరాబాద్‌లో చోరీకి గురైన ఏపీ 07ఎ 0001 నంబరు  కారును ఏపీ 07బిఎ 3333 నంబర్‌గా మార్చి వినియోగిస్తున్నాడు. దీనితో పాటు ఏపీ 07బీఎఫ్‌ 2728 నంబర్‌ కారును ఏపీ 09టియూఎ 3308 నంబర్‌గా మార్చి ఉపయోగిస్తున్నాడు. పోలీసులు ఈ రెండు వాహనాలను స్వాధీనం చేసుకొని ఆర్టీవో కార్యాలయ అధికారులకు  సమాచారం అందించారు.

బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌ చాయిస్‌ నంబర్‌లను పరిశీలించి వాహనానికి ఉన్న నంబర్‌ ప్లేట్స్‌ నకిలీవిగా గుర్తించారు. ఈ మేరకు నిందితుడిపై చీటింగ్‌ కేసుతో పాటు వాహనాల దొంగతనం కేసు నమోదు చే సినట్లు సీఐ బిలాలుద్ధిన్‌ తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ చీటింగ్‌ కేసు నమోదై ఉండగా, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కిడ్నాప్‌ కేసులో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement