గిరిజన యువతి దారుణ హత్య

Brutal murder of a tribal young woman - Sakshi

భర్తే హంతకుడు?

మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులు సూత్రధారులు

అరకులోయ: భార్య ఉండగానే, నెల రోజుల క్రితం రెండో వివాహం చేసుకొని ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన అరకులోయలో కలకలం సృష్టించింది. విశాఖ ఏజెన్సీ అరకులోయ మండలం చినలబుడు గ్రామానికి చెందిన కిల్లో పుష్ప (20) అనే గిరిజన యువతిని, అరకులోయకు చెందిన గిరిజనుడు కె.రమేష్‌ (25) ప్రేమించాడు. అతనికి అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ పుష్పను రెండో వివాహం చేసుకుని, స్థానిక సి.కాలనీలో కాపురం పెట్టాడు. రమేష్‌ రెండో వివాహం చేసుకున్న తరువాత కుటుంబ కలహాలు అధికమైనట్టు తెలిసింది.

గిరిజనేతర యువతి రాజేశ్వరిని కూడా ఐదేళ్ల క్రితం రమేష్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి ఒత్తిడి అధికం కావడంతో పుష్పను అడ్డు తొలగించుకునేందుకు భర్త రమేష్‌ ఈ హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులు కూడా పుష్ప హత్యకు సహకరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్ప మీసేవ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తోంది. పుష్పను శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో భర్త రమేష్‌ బయటకు తీసుకువెళ్లినట్టు చుట్టు పక్కల వారు చెబుతున్నారు. శనివారం ఉదయాన్నే శరభగుడ సమీపంలోని నీలగిరి తోటలలో సగం వరకు బట్టలు లేకుండా ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, సీఐ పైడయ్య, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన రమేష్‌పై అనుమానం వచ్చి పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులు ధర్మారావు, అనసూయలను కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పుష్ప ధరించిన చున్నీనే ఆమె మెడకు బిగించి హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. కాగా, హత్యకు గురైన పుష్ప తల్లిదండ్రులు కిల్లో పరశురామ్, పుణ్యవతితో పాటు, కుటుంబ సభ్యులు, బంధువులు అరకులోయలో ఆందోళన చేపట్టారు. నిందితులను అరెస్టు చేశామని, కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హమీ ఇవ్వడంతో వారు శాంతించారు. మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top