గర్భిణిపై దాడి... పిండం బయటకు...

Anganwadi Worker Attack on Pregnant Woman in Khammam - Sakshi

టేకులపల్లి: గర్భిణిలకు చిన్నారులకు పోషకాహారం అందించి, వారి ఆరోగ్య సంరక్షణకు కృషి చేయాల్సిన అంగన్‌వాడీ కేంద్రం రణరంగమైంది. ఓ గర్భిణికి శాపంగా మారింది. ఆమె గర్భంలో పెరుగుతున్న ఆరు నెలల (గర్భస్థ) శిశువు.. ఈ లోకంలోకి రాకుండానే కన్ను మూసింది. పిండం బయటకు వచ్చింది. పోలీసులు, బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు....

మండలంలోని మద్దిరాలతండా గ్రామస్తుడు బాదావత్‌ లక్ష్మణ్‌ భార్య పద్మ ఆరు నెలల గర్భిణి. వీరి ఇద్దరు పిల్లలు మేఘనశ్రీ, అభిశ్రీ... స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. ఈ పాఠశాల ఆవరణలోనే అంగన్‌వాడీ కేంద్రం ఉంది. ఈ నెల 3వ తేదీన  మేఘనశ్రీ, మధ్యాహ్న భోజనం ప్లేటుతో అంగన్‌వాడీ కేంద్రంలోకి వచ్చింది. అక్కడే కూర్చుని తింటోంది. ఆ సమయంలో ఆయా మాలోత్‌ నీల వచ్చింది. ‘‘నీకు జబ్బు ఉంది. అందరికీ అంటుకుంటుంది. బయటకు వెళ్లిపో’’ అంటూ, తిట్టింది. ఆ చిన్నారి, ఇంటికి వెళ్లిన తరువాత ఈ విషయాన్ని తన తల్లి పద్మతో చెప్పింది. సోమవారం రోజున అంగన్‌వాడీ కేంద్రానికి  పద్మ  వెళ్లింది. ‘‘నా బిడ్డను ఎందుకు తిట్టావు...? అంగన్‌వాడీ కేంద్రంలో ఎందుకు కూర్చోనీయలేదు..?’’ అని, ఆయ మాలోతు నీలను అడిగింది. దీనికి సమాధానంగా, ఆమెను ఆ ఆయా బూతులు తిట్టసాగింది.

ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అంగన్‌వాడీ టీచర్‌ జ్యోతి, పక్కనే ఉన్న పాఠశాల హెచ్‌ఎం వారించినప్పటికీ గొడవ ఆగలేదు. కొద్దిసేపటి తరువాత, ఆ ఆయా తన భర్త వీరుని పిలిపించింది. ఆ తరువాత గొడవ ఇంకా ఎక్కువైంది. అంగన్‌వాడీ ఆయా నీల, ఆమె భర్త వీరు కలిసి పద్మను జుట్టు పట్టుకుని విపరీతంగా కొట్టారు. కడుపుపై పిడి గుద్దులు గుద్దారు. ఆరు నెలల గర్భవతయిన పద్మకు తీవ్రంగా రక్త స్రావమైంది. ఆ వెంటనే గర్భస్రావమైంది. పిండం పూర్తిగా బయటపడింది. ఆమె స్పృహ కోల్పోయింది. అంగన్‌వాడీ టీచర్, గ్రామస్తులు చూస్తుండగానే ఇదంతా జరిగింది. పద్మను ఆమె భర్త లక్ష్మణ్, కుటుంబీకులు కలిసి 108 అంబులెన్స్‌లో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను కొత్తగూడెం రూరల్‌ సీడీపీఓ కనకదుర్గ పరామర్శించారు. కుటుంబీకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పిండానికి  వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ గ్రామంలో టేకులపల్లి సీఐ నాగరాజు, ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌ విచారణ చేపట్టారు. పద్మ భర్త లక్ష్మన్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top