హెచ్‌ఐవీ, డయాబెటిస్‌ కిట్లలో చేతివాటం

ACB officials have identified New perspective on purchases of ESI medical kits - Sakshi

ఈఎస్‌ఐ మెడికల్‌ కిట్ల కొనుగోళ్లలో కొత్తకోణం

గతేడాది 22 ఇండెంట్లలో ఇప్పటిదాకా రెండింటి పరిశీలన

రూ.60 కోట్ల కొనుగోళ్లలో రూ.1.02 కోట్లు పక్కదారి

దేవికారాణి, పద్మ కార్యాలయ సిబ్బంది పాత్రపై ఏసీబీ ఆరా  

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్ (ఐఎంఎస్‌) విభాగంలో మరో కొత్త అవినీతి కోణాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెలికితీసింది. మెడికల్‌ కిట్ల కోసం పెట్టిన ఇండెంట్లలో గోల్‌మాల్‌ జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జేడీ పద్మతోపాటు ఓమ్నీ మెడీ ఫార్మా కంపెనీల పాత్ర ఉండటం గమనార్హం. ఇప్పటికే ఈ కేసులో దేవికారాణి, పద్మ, ఓమ్ని మెడీ సిబ్బందిని విచారించిన ఏసీబీ అధికారులు రాబట్టిన పలు కీలక విషయాల ఆధారంగా కేసులో ముందుకెళ్తున్నారు. 

ఏం జరిగింది? 
ఐఎంఎస్‌లో 2017–18కి సంబంధించిన మెడికల్‌ కిట్ల కోసం దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు జరిగింది. ఈ మొత్తం నిధులతో హెచ్‌ఐవీ, డయాబెటిస్, హిమోగ్లోబిన్‌ తదితర కీలక వైద్య పరీక్షలకు సంబంధించిన కిట్లు కొనుగోలు చేయాలి. అయితే అలా కొనుగోలు చేసిన మెడికల్‌ కిట్లలో సగానికిపైగా ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు చేరనేలేదని ఏసీబీ దర్యాప్తులో తేలింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 22 పర్చేసింగ్‌ ఆర్డర్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటిదాకా ఏసీబీ అధికారులు కేవలం 2 పర్చేసింగ్‌ ఆర్డర్లు మాత్రమే పరిశీలించారు. వీటి ప్రకారం.. హెచ్‌ఐవీ, డయాబెటిస్, హిమోగ్లోబిన్‌ కిట్లు ఒక్కోటి రూ.1,750 చొప్పున మొత్తం 1,000 కిట్లు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.1.76 కోట్లు. అందులో 583 కిట్లు స్థానిక ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు చేరలేదని దర్యాప్తులో వెలుగుచూసింది. వీటి విలువ రూ.1.02 కోట్లుగా తేల్చారు. ఈ కిట్లన్నీ సరఫరా చేసింది ఓమ్నీ మెడీ ఫార్మా కంపెనీగా గుర్తించారు. సదరు సంస్థ యజమాని హరిబాబు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ నాగరాజులు కూడా పాలుపంచుకున్నట్లు సమాచారం. 

ఏడు డిస్పెన్సరీలు ఇవే..! 
దేవికారాణి, పద్మ కేంద్రంగా సాగిన ఈ దందాలో కొనుగోలు చేసిన వాటిలో సగానికిపైగా బ్లాక్‌మార్కెట్‌కు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా బొల్లారం, కాటేదాన్, శభాష్‌పల్లి, సదాశివపేట్, బొంతపల్లి, చర్లపల్లి, జహీరాబాద్‌ ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు పంపినట్లు రికార్డుల్లో రాసినా.. అక్కడి రికార్డులో పంపినట్లు నమోదు కాకపోవడం గమనార్హం. ఈ మొత్తం నిధులు ఏమయ్యాయి? మధ్యలో ఎవరు పక్కదారి పట్టించారు? అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా దేవికారాణి, పద్మ కార్యాలయాల్లో కీలకంగా పనిచేసిన వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. నాలుగేళ్ల అక్రమాలకు సంబంధించి వందలాది పర్చేసింగ్‌ ఆర్డర్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటిదాకా ఏసీబీ పరిశీలించింది చాలా తక్కువ. 2014 నుంచి 2019 వరకు ఐఎంఎస్‌లో జరిగిన మొత్తం మందుల కొనుగోళ్లను పూర్తిగా పరిశీలించాలంటే ఏసీబీకి మరింత సమయం పట్టేలా ఉంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top