మీ బీమా 'పాలసీ' సరైనదేనా!!

Your insurance policy is right! - Sakshi

తగినంత కవరేజీ ముఖ్యం

ప్రీమియం, కాల వ్యవధి కీలకం

అధిక కవరేజీతో బేసిక్‌ టర్మ్‌ పాలసీలే ఉత్తమం

సమాచారం మొత్తం ముందే వెల్లడించాలి

దాచిపెడితే క్లెయిముల సమయంలో ఇబ్బందే  

తక్కువ ప్రీమియంతో అత్యధికంగా జీవిత బీమా కవరేజీనిచ్చేవి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు. అయితే, ఏ టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవాలి.. కవరేజీ ఎంత ఉండాలి.. ఎక్కడ తీసుకోవాలి.. ఏమేం జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాల్లో సందేహాలు ఉంటూనే ఉంటాయి. అలాంటివి నివృత్తి చేసే ప్రయత్నమే ఈ కథనం...

1. ఎంత ముందుగా తీసుకుంటే అంత మేలు..
ఈ వయస్సులోనే తీసుకోవాలంటూ టర్మ్‌ పాలసీకి ప్రత్యేకమైన పరిమితులేమీ లేవు. అయితే, వీలైనంత ముందుగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ కట్టాల్సిన ప్రీమియం కూడా పెరుగుతుంది. పై పెచ్చు.. ఇతరత్రా అనారోగ్యం లాంటివేమైనా వచ్చినా.. తర్వాత కాలంలో పాలసీ రావడం కూడా కష్టం కావొచ్చు. కనుక మీకు ఉండాల్సిన కవరేజీపై స్పష్టత వచ్చిన తర్వాత .. సాధ్యమైనంత త్వరగా తీసేసుకోవడం ఉత్తమం.

2. రిటైర్మెంట్‌ దాకానే..
టర్మ్‌ పాలసీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాక.. ఇంతకీ ఎన్నేళ్ల వ్యవధికి తీసుకోవాలనే సందేహం తలెత్తవచ్చు. ప్రస్తుతం ముప్పై ఏళ్లున్న వ్యక్తి ఎనభై ఏళ్ల వ్యవధికి తీసుకోవాలా అంటే.. లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే..యవ్వనంలో ఉన్నప్పుడు ఆర్థిక బాధ్యతలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి.. కాబట్టి అధిక కవరేజీ అవసరమవుతుంది. అదే, వయస్సు పెరిగే కొద్దీ క్రమంగా మన అసెట్స్‌ పెరగవచ్చు. అలాగే.. రిటైర్మెంట్‌ తర్వాత మనపై ఆర్థికంగా ఆధారపడే కుటుంబ సభ్యుల సంఖ్య పెద్దగా ఉండకపోవచ్చు.

3. చౌక ప్రీమియం లెక్కల మాయలో పడొద్దు..
ఈ మధ్య చాలా మటుకు బీమా కంపెనీలు పాలసీ ప్రీమియంలను రోజువారీ లెక్కలు వేసి చాలా చౌకైనవిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి. రోజుకి పాతిక రూపాయలకే 1 కోటి రూపాయల పాలసీలంటూ పలు సంస్థలు ఊదరగొడుతున్నా యి. అయితే,  ఈ లెక్కల మాయలో పడొద్దు. కారణమేంటంటే.. ఈ లెక్కం తా నిర్దిష్ట వయస్సుల్లో ఉన్నవారికి.. నిర్దిష్ట వ్యవధికి మాత్రమే వర్తిస్తుంది. చాలా మటుకు పాతికేళ్ల వయస్సు గల వారు ఓ నలభై ఏళ్లకు తీసుకునే పాలసీల్లాంటివి మాత్రమే ఇంత చౌకగా ఉంటాయి. కనుక.. మన వయస్సు, కాల వ్యవధి మొదలైనవన్నీ పరిగణనలోకి తీసుకునే ముందడుగు వేయాలి.

4. సింగిల్‌ ప్రీమియం పాలసీలకు దూరం..
జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు సింగిల్‌ ప్రీమియం అనీ విడతల వారీగా సాధారణ ప్రీమియం చెల్లింపులనీ రెండు రకాల ఆప్షన్స్‌ ఉంటాయి. కట్టగలిగే స్థోమత ఉంది కదా అని కొందరు వన్‌టైమ్‌ ప్రీమియంని ఎంచుకుంటే బాగుంటుందని అనుకుంటారు. ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప అన్ని వేళలా ఇది సరికాదు. ఉత్తమమైన ఆప్షన్‌ ఏదైనా ఉందంటే.. అది వార్షిక ప్రీమియం విధానం. ఖర్చులు తగ్గుతాయనే కారణంతో వన్‌టైమ్‌ పేమెంటు ఆకర్షణీయంగా కనిపించినా దాన్ని ఎంచుకోకపోవడమే మంచిది.

5. ప్రీమియం పెరిగిందని ఆందోళన వద్దు..
టర్మ్‌ ప్లాన్‌ (ఆ మాటకొస్తే.. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అయినా సరే) తీసుకునేటప్పుడు ప్రీమియంలు.. ముందు అనుకున్న దానికన్నా వైద్య పరీక్షల తర్వాత మరికాస్త పెరగొచ్చు. మీ ఆరోగ్యపరమైన అంశాల ఆధారంగానే ఇది జరుగుతుంది. ఉదాహరణకు సిగరెట్స్, మద్యపానం లాంటి అలవాట్లతో పాటు గతంలో ఇతరత్రా తీవ్ర అనారోగ్య సమస్యలు మొదలైనవేమైనా ఉన్నా హై రిస్క్‌ కేటగిరీలోకి వస్తారు. కంపెనీ ముందుగానే దీన్ని గుర్తించి దానికి తగ్గట్లుగా ప్రీమియంలు తీసుకోవడం ఒక రకంగా మంచిదే. ఎందుకంటే తర్వాత దశలో ఏదైనా జరిగితే ఇలాంటి కారణాలు చూపించి క్లెయిమ్‌ను తిరస్కరించడానికి ఉండదు.

6. రైడర్స్‌పై అత్యుత్సాహం వద్దు...
టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లకు అదనంగా కొన్ని రైడర్స్‌ కూడా లభిస్తాయి. ఇవి అందుబాటులో ఉన్నాయి కదాని తీసుకోవడం కాకుండా.. నిఖార్సుగా అవసరమైతేనే తీసుకోవడం మంచిది. ఉదాహరణకు.. ఎక్కువగా పర్యటనలు చేసే వారై ఉండి.. ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అనుకున్నప్పుడు యాక్సిడెంటల్‌ రైడర్‌ను కూడా తీసుకోవడంలో అర్థం ఉంటుంది. అంతే తప్ప.. బీమా కంపెనీ ఆఫర్‌ చేస్తోందికదా అని తీసుకోవడంలో అర్థం లేదు. అలాగే భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్యాలకేమైనా కవరేజీ కావాలనుకుంటే ప్రత్యేకంగా మరో పాలసీ తీసుకోకుండా..క్రిటికల్‌ కవర్‌ తీసుకోవచ్చు. వివిధ రకాల టర్మ్‌ ప్లాన్స్‌ రైడర్లేమిటంటే..

యాక్సిడెంటల్‌ డెత్‌ రైడర్‌ ఊ శాశ్వత, పాక్షిక అంగవైకల్యం
క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ఊ ప్రీమియం వెయివర్‌ ఊ ఇన్‌కమ్‌ బెనిఫిట్‌ రైడర్‌

7. బేసిక్‌ పాలసీ శ్రేయస్కరం ..
ప్రస్తుతం టర్మ్‌ ప్లాన్లలోనూ అనేక వెరైటీలు ఉంటున్నాయి. సాధారణంగా బేసిక్‌ పాలసీ విషయం తీసుకుంటే.. పాలసీదారు మరణానంతరం కుటుంబానికి ఏకమొత్తంగా క్లెయిమ్‌ లభిస్తుంది. అలా కాకుండా.. ప్రధాన కవరేజీతో పాటు పదేళ్లు.. ఇరవై ఏళ్లు స్థిరంగా ఆదాయాలు కూడా ఇస్తామనో.. లేదా వచ్చే పది, ఇరవై ఏళ్ల పాటు ఆదాయమిస్తూ.. క్లెయిమ్‌ సమయంలో కేవలం కొంత మొత్తం మాత్రమే వచ్చేలాగానో కొన్ని పాలసీలు ఉంటున్నాయి. ఇలాంటివి ఏవో కొన్ని సందర్భాలకు తప్ప అందరికీ పనిచేయవు. కనుక.. చాలా పరిస్థితుల్లో బేసిక్‌ పాలసీనే ఎంచుకోవడం శ్రేయస్కరం.

8. సిగరెట్స్, మద్యం అలవాటుంటే దాచొద్దు..
సిగరెట్లు, మద్యం సేవించడం మొదలైన అలవాట్లు ఉంటే.. జీవిత బీమా పాలసీ తీసుకుంటున్నప్పుడు దాచిపెట్టకుండా కచ్చితంగా వెల్లడించడమే మంచిది. ప్రీమియం పెరిగిపోతుందేమోనన్న భయంతో చెప్పకుండా ఊరుకుంటే.. తీరా ఏదైనా జరిగితే.. ఇదే విషయంపై క్లెయిమ్‌ తిరస్కరణకు గురికావొచ్చు.

ఫలితంగా పాలసీ ఉన్నా ప్రయోజనం లేకుండా పోతుంది. అప్పుడప్పుడు ఏదో ఒకటో రెండో సిగరెట్లు కాలుస్తాను.. కనుక నాన్‌–స్మోకర్‌ కిందికే వస్తాను అనుకోవద్దు. ఎప్పుడో ఓసారైనా సరే రెండు కాల్చినా.. ఒకటి కాల్చినా కంపెనీ స్మోకర్‌ కిందే పరిగణిస్తుంది. మందు విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఏజెంటు కాకుండా సాధ్యమైనంత వరకూ మీ పాలసీ దరఖాస్తు మీరే నింపండి. అందులో కచ్చితంగా విషయాలన్నీ వెల్లడించండి.

9. ఆరోగ్య సమస్యలేమీ దాచిపెట్టొద్దు..
సాధారణంగా ప్రీమియంలు పెరిగిపోతాయేమో అన్న భయంతో కొన్ని సందర్భాల్లో కీలకమైన ఆరోగ్యపరమైన అంశాలను వెల్లడించకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే ఆ తర్వాత బైటపడిందంటే క్లెయిమ్‌ తిరస్కరణకు కూడా గురికావొచ్చు. కనుక ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నా.. కీలకమైన ఆపరేషన్లు గట్రా చేయించుకున్నా.. పాలసీ దరఖాస్తులో ఆ విషయాలన్నీ పొందుపర్చడమే మంచిది.

కుటుంబసభ్యుల అనారోగ్యాలూ వెల్లడించాలి..
పాలసీ విషయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర కూడా ముఖ్యమే. ఒకవేళ తల్లిదండ్రులు గానీ తోబుట్టువులకు కానీ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న పక్షంలో అవి కూడా వెల్లడించడమే మంచిది. ప్రీమియం తగ్గించుకుందామనే భావనతో దాచిపెట్టొద్దు. ఉదాహరణకు పేరెంట్స్‌కి మధుమేహం ఉన్నా.. తమకు దానివల్ల సమస్య ఉండదనుకుంటారు. కానీ అది తప్పు.

అరకొర కవరేజీ వద్దు..
మన దేశంలో సాధారణంగా పాలసీల సమ్‌ అష్యూర్డ్‌ పరిమాణం సగటున కేవలం రూ. 90,000– రూ. 1,00,000 దాకా మాత్రమే ఉంటోంది. చాలా మందికి ఆ మాత్రం బీమా కవరేజీనిచ్చే పాలసీలు కూడా ఉండటం లేదు. అది వేరే సంగతనుకోండి. అయితే, పాలసీ తీసుకుంటున్నవారు కూడా అరకొర కవరేజీ తీసుకోవడమే ప్రధాన సమస్య. ప్రస్తుతం అందరికీ రూ. 1 కోటి కవరేజీ ఫేవరెట్‌గా ఉంటోంది.  కానీ .. ఖర్చులు పెరిగిపోతున్న పరిస్థితుల్లో రేప్పొద్దున్న ఇది ఏ మూలకూ సరిపోకపోవచ్చు.

అందరికీ ఇదే స్థాయి సరిపోతుందనుకోవడానికి లేదు. సాధారణంగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ లెక్కింపునకో ఫార్ములా ఉంది. ఇందుకోసం మన అప్పులన్నింటినీ లెక్కేసుకుని, నెలవారీ ఖర్చులకు మూడు వందల రెట్లు దానికి జోడిస్తే.. ఎంత కవరేజీ అవసరమవుతుందన్నది ఒక అంచనాకు రావొచ్చు. దానికి మరికాస్త అదనంగా కలిపి పాలసీ కవరేజీ ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు మీకు రూ. 1.3 కోట్ల కవరేజీ అవసరం పడుతోందనుకుంటే.. రూ. 1 కోటికి కాకుండా రూ. 1.5 కోట్లకు పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం.

మరీ నాన్చొద్దు..
పాలసీ తీసుకుందామని నిర్ణయించుకున్నప్పటికీ.. బెస్ట్‌ పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో, దాన్ని అన్వేషిస్తూ కాలయాపన చేస్తుంటారు మరికొందరు. అనేకానేక కంపెనీల పాలసీలను పోల్చి చూసుకుంటూ గడిపేస్తుంటారు. తీరా తీసుకునే సమయానికి పుణ్యకాలం కాస్త గడిచిపోవచ్చు. కాబట్టి పాలసీలో ఫీచర్లు, ప్రీమియంలు మొదలైన వాటి గురించి మరీ ఎక్కువగా విశ్లేషించుకుంటూ కూర్చోకుండా కీలకమైన అంశాల గురించి అధ్యయనం చేసి ముందుగా ఒక మెరుగైన పాలసీ తీసుకోవడం మంచిది. అసలే కవరేజీ లేకపోవడం కన్నా ఏదో ఒక కవరేజీ ఉండటం శ్రేయస్కరం కదా.

ఆన్‌లైన్‌ బ్రోకింగ్‌ సంస్థలనూ పరిశీలించవచ్చు..
ప్రస్తుతం బీమా రంగంలోనూ పాలసీబజార్, కవర్‌ఫాక్స్‌ వంటి ఆన్‌లైన్‌ బ్రోకింగ్‌ సంస్థలు వచ్చాయి. కస్టమరుకు ఎటువంటి అదనపు ఖర్చులూ లేకుండా వేగవంతమైన సర్వీసులు, క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ సహాయం మొదలైనవి అందిస్తున్నాయి. ఇందుకోసం ఆయా బీమా కంపెనీల నుంచి వాటికి కొంత మొత్తం లభిస్తుంది. అందుకే కస్టమరుకు భారం కాకుండా ఇవి సర్వీసులు అందించగలుగుతున్నాయి. పాలసీని నేరుగా కంపెనీ నుంచి కొన్నా.. లేదా ఈ బ్రోకింగ్‌ సంస్థ నుంచి తీసుకున్నా ప్రీమియం ఒకే రకంగా ఉండగలదు. కాబట్టి వీటినీ ఒకసారి ప్రయత్నించి చూడొచ్చు. లేదా సాంప్రదాయ పద్ధతిలోనే కంపెనీ నుంచే కొనుక్కోనూవచ్చు.

నామినీ పేరు మరవొద్దు..
బీమా ఫాం నింపేటప్పుడు నామినీ పేరు కచ్చితంగా పేర్కొనాలి. జీవిత భాగస్వామి, పిల్లలతో పాటు ఇతరత్రా ఎవరికైతే టర్మ్‌ ప్లాన్‌ సొమ్ము చెందాలనుకుంటున్నారో వారి పేర్లను పొందువర్చవచ్చు. వీలైనంత వరకూ వయోవృద్ధులను నామినీలుగా ఎంచుకోకపోవడం మంచిది. ఇక వీలునామా లాంటిదేదైనా ఉంటే.. అందులో కూడా ఈ వివరాలను పొందుపర్చాలి. టర్మ్‌ ప్లాన్‌ గతంలో ఎప్పుడో తీసుకున్నదైనా.. తాజాగా ప్రాధాన్యతలు మారిన పక్షంలో ఆ మేరకు నామినీలను కూడా మార్చుకోవాలి.

పాత పాలసీ గురించి చెప్పాలి..
సాధారణంగా జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు మనం అప్పటికే తీసుకున్న పాత బీమా పాలసీలు, వాటి కవరేజీ గురించి కూడా తెలియజేయడం తప్పనిసరి. అదనంగా ఎంత కవరేజీ ఇవ్వొచ్చనే దానిపై బీమా కంపెనీ సరైన అంచనా వేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇప్పటికే పాత పాలసీల గురించి చెప్పకుండా తీసుకున్న టర్మ్‌ పాలసీ ఉన్న పక్షంలో.. ఆ వివరాలను ఇప్పటికైనా కంపెనీకి తెలియజేయడం శ్రేయస్కరం.

ఒకటో.. రెండో చాలు..
జీవిత బీమాకు సంబంధించి ఒక టర్మ్‌ ప్లాన్‌ చాలు. కావాలనుకుంటే గరిష్టంగా రెండు చాలు. పాలసీల సంఖ్య అంతకు మించొద్దు. రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్‌ కవరేజీని.. రూ. 50 లక్షల చొప్పున నాలుగు పాలసీలుగా తీసుకునే వారూ ఉన్నారు. దానికి బదులుగా పెద్ద మొత్తానికి ఒకటే తీసుకోవచ్చు. అలా కాదనుకుంటే గరిష్టంగా రెండింటి కింద తీసుకోండి. చాలు.

పత్రాలు పరిశీలించాలి..
పాలసీ వచ్చిన తర్వాత తక్షణమే అన్ని కీలకమైన వివరాలు సరిగ్గా పేర్కొన్నారో లేదో పరిశీలించుకోవాలి. పేరు, వయస్సు, బ్లడ్‌ గ్రూపు, చిరునామా మొదలైనవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ తేడాలేమైనా ఉంటే తక్షణమే కంపెనీ దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలి.

మార్కెటింగ్‌ గిమ్మిక్కులకు పడొద్దు..
మన వార్షికాదాయానికి పది రెట్లు కవరేజీ ఉండాలంటూ కాల్‌ సెంటర్‌ మార్కెటింగ్‌ వాళ్లు చెప్పే మాటల్లో పడొద్దు. నికార్సుగా చెప్పాలంటే.. మన ఖర్చులు, అప్పులే కవరేజీ లెక్కింపునకు ప్రామాణికం కావాలి. నెలవారీ ఖర్చులకు మూడు వందల రెట్లు లెక్కించి.. దానికి అప్పులను కూడా కలిపి కూడితే.. కావాల్సిన కవరేజీ తెలుస్తుంది.

ఇతరత్రా ఆర్థిక లక్ష్యాల సాధన కోసం (పిల్లల చదువు వగైరా) కూడా కలిపి మరి కాస్త జోడిస్తే.. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలనేది తెలుస్తుంది. ఉదాహరణకు నెలకు రూ. 50,000 ఖర్చులు, రూ. 60 లక్షల రుణబకాయి ఉందనుకుంటే.. 300 ్ఠ 50,000+ 60 లక్షలు కింద లె క్కిస్తే కనీసం రూ. 2.1 కోట్లు అవసరమవుతాయి. అలాం టప్పుడు కాస్త అటూ ఇటూగా రూ. 2.5 కోట్లకు కవరేజీ తీసుకోవచ్చు. కవరేజీకి ఖర్చులు, అప్పులే ప్రాతిపదిక కావాలి తప్ప ఆదాయం కాదు.

మంచి బ్రాండ్‌ని ఎంచుకోవాలి..
ప్రస్తుతం దేశీయంగా ఇరవై నాలుగు పైచిలుకు జీవిత బీమా కంపెనీలు ఉన్నాయి. ఆయా సంస్థల క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ తీరుతెన్నులు, క్లయింట్లతో వ్యవహరించే విధానం, వైద్య పరీక్షల నిర్వహణ శైలి, వ్యాపార నిర్వహణ తీరుతెన్నులు మొదలైనవన్నీ పరిశీలించాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో డేటా చూడొచ్చు.. వాటిపై రివ్యూలు చదివి తెలుసుకోవచ్చు. కంపెనీ పెద్దదే కావాలనేమీ లేదు.. సర్వీసులు మెరుగ్గా అందించేదిగా పేరొందిన బ్రాండ్‌ని ఎంచుకోవచ్చు.

ఇంట్లో చెప్పాలి..
టర్మ్‌ పాలసీ తీసుకున్నప్పుడు ఆ విషయం ఇంట్లో వారికి తప్పనిసరిగా చెప్పాలి. పాలసీ పత్రాలు, బీమా కంపెనీ కాంటాక్టు నంబరు మొదలైనవి ఇవ్వాలి. సంతోషపర్చే విషయం కాకపోయినప్పటికీ .. క్లెయిమ్‌ ప్రక్రియలో కీలకాంశాల గురించి అవగాహన కల్పించాలి. కావాలంటే ఈ ప్రక్రియ మొత్తం ఒక పేపరులో రాసి, ఎక్కడో ఒక దగ్గర భద్రపర్చి ఆ విషయాన్ని కుటుంబసభ్యులకూ చెప్పాలి.

ఆన్‌లైన్‌లో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ కొనుగోలు ఇలా ..
ఎంత కవరేజీ అవసరమవుతుందో ముందే లెక్కగట్టుకోవాలి.
 ఆన్‌లైన్లో వివిధ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం కాలిక్యులేటర్స్‌ ఉపయోగించుకుని ప్రీమియం అమౌంటును లెక్కించుకోవాలి.
ప్రీమియం మీ బడ్జెట్‌లోబడే ఉంటే.. టర్మ్‌ ప్లాన్‌కి అప్లై చేయొచ్చు.
 ప్రాథమికంగా ప్రీమియం చెల్లించి, డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ ప్రారంభించవచ్చు.
 బీమా కంపెనీయే వైద్య పరీక్షల ఏర్పాట్లు చేస్తుంది. సమయం లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి.
 అన్నీ సరిగ్గా ఉన్న పక్షంలో బీమా కంపెనీ మీకు పాలసీ జారీ చేస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top