స్ట్రైడ్స్‌ ఫార్మా- తేజాస్‌ నెట్‌వర్క్‌.. జోష్‌

Tejas networks- Strides pharma science gains - Sakshi

యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి

స్ట్రైడ్స్‌ ఫార్మా 5 శాతం ప్లస్‌

కేడియా వాటా కొనుగోలు

తేజాస్‌ 5 శాతం హైజంప్‌

మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ హాఫ్‌ సెంచరీతో సాగుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కంపెనీ తేజాస్‌ నెట్‌వర్క్స్‌, హెల్త్‌కేర్‌ కంపెనీ స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

తేజాస్‌ నెట్‌వర్క్స్‌
ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా తేజాస్‌ నెట్‌వర్క్స్‌లో 0.81 శాతం వాటాను కేడియా సెక్యూరిటీస్‌ కొనుగోలు చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ బల్క్‌డీల్స్‌ డేటా పేర్కొంది. ప్రసిద్ధ ఇన్వెస్టర్‌ విజయ్‌ కిషన్‌లాల్‌ కేడియాకు చెందిన ఈ సంస్థ షేరుకి రూ. 49.13 ధరలో దాదాపు 7.54 లక్షల తేజాస్‌ షేర్లను సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 3.7 కోట్లను వెచ్చించింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో తేజాస్‌ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 52 సమీపంలో ఫ్రీజయ్యింది. 

స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌
సింగపూర్‌ అనుబంధ సంస్థ ద్వారా ఫియొరిసెట్‌ కోడియిన్‌ క్యాప్సూల్స్‌ జనరిక్‌ వెర్షన్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతి పొందినట్లు దేశీ హెల్త్‌కేర్‌ కంపెనీ స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ తాజాగా పేర్కొంది. వీటిని 50ఎంజీ/325 ఎంజీ, 40 ఎంజీ/30ఎంజీ డోసేజీలలో విక్రయించనున్నట్లు తెలియజేసింది. తెవా ఫార్మాకు చెందిన ఫియొరిసెట్‌ కోడియిన్‌ క్యాప్సూల్స్‌ ప్రధానంగా ఒత్తిడితో ఎదురయ్యే తలనొప్పి.. తదితర నొప్పుల నివారణకు వినియోగించవచ్చని స్ట్రైడ్స్‌ ఫార్మా పేర్కొంది. ఈ నేపథ్యంలో స్ట్రైడ్స్‌ ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3.5 శాతం పెరిగి రూ. 426 వద్ద ట్రేడవుతోంది. తొలుత 5 శాతం ఎగసి రూ. 432 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top